Sunday, May 21, 2017

దక్ష యాగము - 39:


4-100-వ.
మఱియు నిట్లనిరి.
4-101-సీ.
"సకల చరాచర జనకుఁ డై నట్టి యీ;
దక్షుండు దన కూర్మి తనయ మాన
వతి పూజనీయ యీ సతి దనచే నవ;
మానంబు నొంది సమక్ష మందుఁ
గాయంబు దొఱఁగంగఁ గనుఁగొను చున్నవాఁ;
డిట్టి దురాత్ముఁ డెందేనిఁ గలఁడె?
యనుచుఁ జిత్తంబుల నాశ్చర్యములఁ బొంది, ;
రదియునుఁ గాక యి ట్లనిరి యిట్టి
4-101.1-తే.
దుష్టచిత్తుండు బ్రహ్మబంధుండు నయిన
యీతఁ డనయంబుఁ దా నపఖ్యాతిఁ బొందు
నిందఁబడి మీఁద దుర్గతిఁ జెందుగాక!"
యనుచు జనములు పలుకు నయ్యవసరమున.

టీకా:
మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి. సకల = సమస్తమైన; చర = చలనము కలవాటికి; అచర = చలనరహితమైనవాటికి; జనకుడు = తండ్రి {జనకుడు - జననమునకు కారణభూతుడు, తండ్రి}; ఐనట్టి = అయినట్టి; ఈ = ఈ; దక్షుండు = దక్షుడు; తన = తన యొక్క; కూర్మి = ప్రియ; తనయ = పుత్రిక; మానవతి = అబిమానముకలామె; పూజనీయ = పూజింపదగినది; ఈ = ఈ; సతి = సతీదేవి; తన = తన; చేన్ = చేత; అవమానంబున్ = అవమానమును; ఒంది = పొంది; సమక్షమందు = ఎదురుగ; కాయంబున్ = శరీరమును; తొఱగంగన్ = విడుచుచుండగ; కనగొనుచున్ = చూస్తూ; ఉన్నవాడు = ఉన్నాడు; ఇట్టి = ఇటువంటి; = దురాత్ముడు = దుర్మార్గుడు; ఎందేని = ఎక్కడైన; కలడె = ఉన్నాడా; అనుచున్ = అంటూ; చిత్తంబుల్ = మనసులలో; ఆశ్చర్యములన్ = ఆశ్చర్యములను; పొందిరి = పొందారు; అదియునున్ = అంతే; కాక = కాకుండ; ఇట్లు = ఈవిధముగ; అనిరి = పలికిరి; ఇట్టి = ఇటువంటి.
దుష్టచిత్తుడు = దుర్మార్గపు మనసుకలవాడు; బ్రహ్మబంధుండు = చెడిపోయిన బ్రాహ్మణుడు {బ్రహ్మబంధుడు - బ్రష్టుపట్టిన బ్రాహ్మణునికి వాడే జాతీయము}; ఈతడు = ఇతగాడు; అనయంబున్ = అవశ్యము; తాన్ = తను; అపఖ్యాతిన్ = చెడ్డపేరును; పొందున్ = పొందును; నిందబడి = తిట్టబడి, దూషింపబడి; మీద = తరువాత; దుర్గతిన్ = నరకమునకు; చెందుగాక = పడుగాక; అనుచున్ = అంటూ; జనములు = జనులు; పలుకు = పలికెడి; ఆ = ఆ; అవసరంబున = సమయములో.

భావము: 
ఇంకా ఇలా అన్నారు. సకల చరాచరాలను సృష్టించే ఈ దక్షుడు అభిమానవతి, పూజ్యురాలు అయిన తన ప్రియపుత్రిక సతీదేవి తన చేత అవమానింపబడి, తన ఎదుటనే శరీరాన్ని విడవడం చూస్తూ ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గుడు ఎక్కడైనా ఉన్నాడా?” అని ఆశ్చర్యపడ్డారు. ఇంకా ఇలా అన్నారు “ఇటువంటి దుష్టుడు పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు. ఇతడు తప్పక అపకీర్తిని పొంది, నిందల పాలయి, నరకంలో పడతాడు” అని దూషించే సమయంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=101

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: