Thursday, May 18, 2017

దక్ష యాగము - 36:

4-94-ఉ.
"నీలగళాపరాధి యగు నీకుఁ దనూభవ నౌట చాలదా?
చాలుఁ గుమర్త్య! నీదు తనుజాత ననన్ మది సిగ్గు పుట్టెడి
న్నేల ధరన్ మహాత్ములకు నెగ్గొనరించెడి వారి జన్మముల్
గాలుపనే? తలంప జనకా! కుటిలాత్మక! యెన్ని చూడఁగన్.
4-95-చ.
వర వృషకేతనుండు భగవంతుఁడు నైన హరుండు నన్ను నా
దరపరిహాస వాక్యముల దక్షతనూభవ యంచుఁ బిల్వ నేఁ
బురపురఁ బొక్కుచున్ ముదముఁ బొందక నర్మవచఃస్మితంబులం
దొఱఁగుదు; నీ తనూజ నను దుఃఖముకంటెను జచ్చు టొప్పగున్."

టీకా:
నీలగళా = శివుని యెడల {నీలగళుడు - నీల (నల్లని) గళ (గొంతుక) కలవాడు, శివుడు}; అపరాధి = అపరాథము చేసినవాడు; అగు = అయిన; నీకున్ = నీకు; తనూభవన్ = పుత్రికను; అగుటన్ = అవుట; చాలదా = సరిపోదా; చాలున్ = చాలు; కుమర్త్య = చెడుమనిషి; నీదు = నీ యొక్క; తనూజాతన్ = కూతురను; అనన్ = అనగా; మదిన్ = మనసున; సిగ్గు = లజ్జ; పుట్టెడిన్ = పుడుతున్నది; ఏల = ఎందులకు; ధరన్ = భూమిమీద; మహాత్ముల్ = గొప్పవారి; కిన్ = కి; ఎగ్గు = అపకారము; ఒనరించెడి = చేసెడి; వారి = వారియొక్క; జన్మముల్ = పుట్టుకలు; కాలుపనే = కాల్చుటకా ఏమి; తలంప = తలచుకొంటే; జనకా = తండ్రీ; కుటిలాత్మకా = వంకరబుద్దికలవాడ; ఎన్ని = ఎంచి; చూడగన్ = చూస్తే. వర = శ్రేష్టమైన; వృష = వృషభము; కేతనుడు = వసించువాడు, వాహనుడు; భగవంతుడు = భగవంతుడును; ఐన = అయిన; హరుండు = శివుడు {హరుడు - హరించువాడు, లయకారుడు, శివుడు}; నన్ను = నన్ను; ఆదర = ప్రీతితో; పరిహాస = నవ్వులాట; వాక్యములన్ = మాటలలో; దక్షతనూభవ = దక్షునికూతురా {తనూభవ - తనువున భవ (పుట్టినామె), స్త్రీ}; అంచున్ = అంటూ; పిల్వ = పిలవగా; నేన్ = నేను; పురపుర = పురపురమని; బొక్కుచున్ = దుఃఖిస్తూ; ముదమున్ = సంతోషమును; పొందక = పొందకుండ; నర్మవచస్ = చమత్కారపుమాటలు; స్మితంబులు = చిరునవ్వులతో; తొఱగుదు = తప్పించుకొందు; నీ = నీ యొక్క; తనూజన్ = కూతురను; అను = అనెడి; దుఃఖము = దుఃఖము; కంటెను = కంటే; చచ్చుట = మరణించుట; ఒప్పు = తగి; అగున్ = ఉండును.

భావము:
"తండ్రీ! లోకకల్యాణంకోసం కాలకూటవిషం తాగి కంఠం నల్లగా చేసుకున్న సర్వలోక శుభంకరుడు కదయ్యా పరమ శివుడు. ఆయన యెడ క్షమింపరాని అపరాధం చేసావు. నా దురదృష్టం కొద్దీ అలాంటి నీకు పుత్రికగా పుట్టాను నీచమాన! ఇక చాల్లే! నీ కుమార్తె నని తల్చుకుంటేనే సిగ్గు వేస్తోంది. లోకంలో గౌరవనీయులకు కీడు తలపెట్టే నీలాంటి వాళ్ళ పుట్టుకలు ఎందుకయ్యా? కాల్చడానికా? పూడ్చడానికా? వృషభధ్వజుడు, భగవంతుడు అయిన శివుడు నన్ను ఆదరంగానో పరిహాసంగానో ‘దక్షతనయా’ అని పిలిచినప్పుడు నేను మిక్కిలి దుఃఖిస్తూ ఆనందాన్ని పొందలేక చమత్కారపు మాటలతోనో, చిరునవ్వుతోనో తొలగిపోతాను. నీ కుమార్తెను అని బాధపడడం కంటె చావడం మేలు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=94

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: