Wednesday, May 17, 2017

దక్ష యాగము - 35:

4-93-వ.
అదియునుం గాక, దేవతల కాకాశగమనంబును, మనుష్యులకు భూతల గమనంబును, స్వాభావికంబు లయినట్లు ప్రవృత్తినివృత్తి లక్షణ కర్మంబులు రాగవైరాగ్యాధికారంబులుగా వేదంబులు విధించుటం జేసి రాగయుక్తులై కర్మతంత్రు లయిన సంసారులకు వైరాగ్యయుక్తు లయి యాత్మారాము లయిన యోగిజనులకు విధినిషేధరూపంబు లయిన వైదిక కర్మంబులు గలుగుటయు లేకుండుటయు నైజంబు లగుటం జేసి స్వధర్మ నిష్ఠుండగువాని నిందింపం జనదు; ఆ యుభయకర్మ శూన్యుండు బ్రహ్మభూతుండు నయిన సదాశివునిఁ గ్రిఁయా శూన్యుం డని నిందించుట పాపం బగు; దండ్రీ! సంకల్పమాత్ర ప్రభవంబు లగుటం జేసి మహాయోగిజన సేవ్యంబు లయిన యస్మదీయంబు లగు నణిమాద్యష్టైశ్వర్యంబులు నీకు సంభవింపవు; భవదీయంబు లగు నైశ్వర్యంబులు ధూమమార్గ ప్రవృత్తులై యాగాన్నభోక్తలైన వారి చేత యజ్ఞశాలయందె చాల నుతింపంబడి యుండుఁ గాన నీ మనంబున నే నధిక సంపన్నుండ ననియుఁ, జితాభస్మాస్థి ధారణుండైన రుద్రుండు దరిద్రుం డనియును గర్వింపం జన” దని; వెండియు నిట్లనియె.

టీకా:
అదియున్ = అంతే; కాక = కాకుండగ; దేవతల్ = దేవతల; కున్ = కు; ఆకాశ = ఆకాశ; గమనంబును = యానమును; మనుష్యుల్ = మానవుల; కున్ = కు; భూతల = భూమి యందు; గమనంబును = యానమును; స్వాభావికంబులు = స్వభావసిద్ధమైనవి; అయినట్లు = అయినవిధముగ; ప్రవృత్తి = విధి; నివృత్తి = నిషేధ; లక్షణ = లక్షణములుకలిగిన; కర్మంబులు = కర్మములు; రాగ = రాగము; వైరాగ్య = వైరాగ్యము; అధికారంబులు = అధికారములు; కాన్ = అగునట్లు; వేదంబులు = వేదములు; విధించుటన్ = విధించుట; చేసి = వలన; రాగ = రాగములతో; యుక్తులు = కూడినవారు; ఐ = అయ్యి; కర్మ = కర్మములతో కూడిన; తంత్రులు = విధానములు కలవారు; అయిన = అయిన; సంసారుల = సంసారుల; కున్ = కు; వైరాగ్య = వైరాగ్యముతో; యుక్తులు = కూడియుండువారు; అయి = అయ్యి; ఆత్మారాములు = తమయాత్మనందే ఆనందించువారు; అయిన = అయిన; యోగి = యోగులైన; జనుల్ = జనుల; కున్ = కి; విధి = చేయవలసినవి; నిషేధ = చేయరానివి అనెడి; రూపంబులు = రూపములో ఉండేవి; అయిన = అయిన; వైదిక = వేదములకి సంబంధించిన; కర్మంబులు = కర్మములు; కలుగుటయు = చెందుటయును; లేకుండుటయు = చెందకపోవుటయును; నైజంబులు = సహజములు; అగుటన్ = అయివుండుట; చేసి = వలన; స్వధర్మ = తమధర్మమునందు; నిష్ఠుండు = నిష్ఠకలవాడు; అగు = అయిన; వానిన్ = వానిని; నిందింపన్ = తెగడుట; చనదు = తగదు; ఆ = ఆ; ఉభయ = రెండువిధములైన; కర్మ = కర్మములు; శూన్యుండు = లేనివాడు; బ్రహ్మ = పరబ్రహ్మము; భూతుండు = అయినవాడు; అయిన = అయినట్టి; సదాశివునిన్ = శివుని {సదాశివుడు - శాశ్వతమైన శుభము యైనవాడు, శంకరుడు}; క్రియాశూన్యుండు = పనిలేనివాడు; అని = అని; నిందించుట = తిట్టుట; పాపంబు = పాపము; అగున్ = అవును; తండ్రీ = తండ్రీ; సంకల్ప = సంకల్పముచేసినంత; మాత్ర = మాత్రముననే; ప్రభవంబులు = ప్రభావముచూపునవి; అగుటన్ = అవుట; చేసి = వలన; మహా = గొప్ప; యోగి = యోగులైన; జన = జనములచే; సేవ్యంబులు = సేవింపబడునవి; అయిన = అయినట్టి; అస్మదీయంబులు = మాకు చెందినవి; అగు = అయిన; అణిమాదష్టైశ్వర్యంబులు = అష్టైశ్వర్యములు {అష్టైశ్వర్యములు - 1అణిమ, 2మహిమ, 3లఘిమ, 4గరిమ, 5ప్రాప్తి, 6ప్రాకామ్యము, 7వశిత్వము, 8ఈశత్వము}; నీకున్ = నీకు; సంభవింపవు = కలుగనేరవు; భవదీయంబులు = నీకు చెందినవి; అగు = అయినట్టి; ఐశ్వర్యములు = భాగ్యములు; ధూమ = పొగచూరిన; మార్గ = దారిలో; ప్రవృత్తులు = తిరుగువారు; ఐ = అయ్యి; యాగా = యజ్ఞములలో; అన్న = అన్నమును; భోక్తలు = భుజింజువారు; ఐన = అయిన; వారి = వారి; చేత = చేత; యజ్ఞశాల = యజ్ఞశాల; అందే = లోనే; చాలన్ = మిక్కిలి; నుతింపంబడి = స్తుతింపబడి; ఉండున్ = ఉంటాయి; కాన = కావున; నీ = నీ యొక్క; మనంబునన్ = మనసులో; నేను = నేను; అధిక = ఎక్కువ; సంపన్నుండను = ధనవంతుడను; అనియున్ = అనియు; చితా = చితిపైనున్న; భస్మ = భస్మము; అస్థి = ఎముకలు; ధారణుండు = ధరించువాడు; ఐన = అయిన; రుద్రుండు = శివుడు; దరిద్రుండు = దరిద్రుడు; అనియున్ = అనియు; గర్వింపన్ = గర్వించుట; చనదు = చెల్లదు; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈవిధముగ; అనియున్ = పలికెను.

భావము:
అంతేకాక దేవతలకు ఆకాశయానం, మానవులకు భూతలయానం సహజమైనట్లు, విధి నిషేధ లక్షణాలు కలిగిన కర్మలు రాగ వైరాగ్యాలకు కారణాలుగా వేదాలు విధించడం వలన రాగయుక్తులై కర్మతంత్రులైన సంసారులకూ, వైరాగ్యంతో కూడి ఆత్మారాములైన యోగులకు విధి నిషేధ రూపాలలో ఉన్న వైదికకర్మలు కలిగిఉండడమూ లేకపోవడమూ సహజం. అందువల్ల స్వధర్మపరుడైనవానిని నిందించరాదు. (సంసారులకు అగ్నిహోత్రాలు మొదలైన ప్రవృత్తి కర్మలను, విరక్తులకు శమదమాది నివృత్తి కర్మలను వేదాలు విధించాయి. దేవతలకు ఆకాశయానం, మానవులకు భూతలయానం సహజమైనట్లు సంసారులకు, విరక్తులకు వేరువేరు ధర్మాలు సహజాలు. విధి నిషేధ రూపాలైన వైదిక కర్మలు ధర్మాసక్తులైన సంసారులకే కాని ఆత్మారాములైన యోగులకు కాదు.) ప్రవృత్తి నివృత్తి కర్మలులేనివాడు, పరబ్రహ్మ స్వరూపుడు అయిన సదాశివుని నిందించడం పాపం. తండ్రీ! సంకల్పమాత్రం చేతనే మేము పొందగలవీ, యోగిజనులచేత సేవింపబడేవీ అయిన అణిమ మొదలైన అష్టసిద్ధులను నీవు పొందలేవు. నీ ఐశ్వర్యాలను యజ్ఞశాలలో హోమధూపాల మధ్య తిరుగుతూ, యజ్ఞాన్నాన్ని భుజించేవారు ఇక్కడ మాత్రమే స్తుతిస్తారు. కనుకనీవు మిక్కిలి సంపన్నుడవనీ, చితాభస్మాన్నీ ఎముకలను ధరించే రుద్రుడు దరిద్రుడనీ భావించి గర్వించకు” అని చెప్పి ఇంకా ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=93

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: