Sunday, May 14, 2017

దక్ష యాగము - 32:

4-87-సీ.
"అనయంబు శివ యను నక్షరద్వయ మర్థి;
వాక్కునఁ బలుక భావమునఁ దలఁప
సర్వజీవుల పాపసంఘముల్ చెడు; నట్టి;
మహితాత్మునందు నమంగళుండ
వగు నీవు విద్వేషి వగుట కాశ్చర్యంబు;
నందెద; వినుము; నీ వదియుఁ గాక
చర్చింప నెవ్వని చరణపద్మంబుల;
నరసి బ్రహ్మానంద మను మరంద
4-87.1-తే.
మతుల భక్తిని దమ హృదయంబు లనెడి
తుమ్మెదలచేతఁ గ్రోలి సంతుష్టచిత్తు
లగుదు రత్యంత విజ్ఞాను; లట్టి దేవు
నందు ద్రోహంబు చేసి; తే మందు నిన్ను?

టీకా:
అనయంబున్ = అవశ్యమును; శివ = శివ; అను = అనెడి; అక్షర = అక్షరముల; ద్వయము = రెంటిని; అర్థిన్ = కోరి; వాక్కునన్ = నోటితొ; పలుకన్ = పలుకుతే; భావమునన్ = భావములో; తలపన్ = తలచుకొన్న; సర్వ = సమస్తమైన; జీవుల్ = ప్రాణుల; పాప = పాపముల; సంఘముల్ = సమూహములు; చెడును = నాశనమగును; అట్టి = అటువంటి; మహితాత్ము = మహిమాన్వితమైనఆత్మ కలవాడు; అందున్ = ఎడల; అమంగళుండవు = అశుభకరమైనవాడవు; అగు = అయిన; నీవున్ = నీవు; విద్వేషివి = శత్రుత్వము కలవాడవు; అగుటన్ = అవుటకు; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; అందెదన్ = పోయెదను; వినుము = వినుము; నీవున్ = నీవు; అదియున్ = అంతే; కాక = కాకుండగ; చర్చింపన్ = చర్చించి చూసినచో; ఎవ్వని = ఎవని; చరణ = పాదములు అనెడి; పద్మంబులన్ = పద్మములను; అరసి = ఎరిగి; బ్రహ్మానందము = బ్రహ్మానందము; అను = అనెడి; మరందము = మధువుని; అతుల = మిక్కలి. భక్తిన్ = భక్తితో; తమ = తమయొక్క; హృదయంబులు = మనసులు; అనెడి = అనెడి; తుమ్మెదలన్ = తుమ్మెదల; చేతన్ = వలన; గ్రోలి = త్రాగి; సంతుష్ట = సంతోషించిన; చిత్తులు = చిత్తములు కలవారు; అగుదురు = అవుతారో; అత్యంత = అత్యధికమైన; విజ్ఞానులు = చక్కటి జ్ఞానము కలవారు; అట్టి = అటువంటి; దేవుని = దేవుని; అందున్ = ఎడల; ద్రోహంబు = ద్రోహము; చేసితి = చేసావు; ఏమి = ఏమని; అందున్ = అంటాను; నిన్ను = నిన్ను.

భావము:
“ఎల్లప్పుడూ శివ అనే రెండక్షరాలను ఆసక్తితో నోటితో పలికినా, మనస్సులో తలచినా సమస్త ప్రాణుల పాపలన్నీ నశిస్తాయి. అటువంటి మహాత్ముని అమంగళుడవైన నీవు ద్వేషించడం చూచి ఆశ్చర్యాన్ని పొందుతున్నాను. తండ్రీ! విను. గొప్ప విజ్ఞానులు అయినవారు ఏ దేవుని పాదారవిందాలను ధ్యానిస్తూ బ్రహ్మానందమనే మకరందాన్ని తమ మనస్సులనే తుమ్మెదల ద్వారా భక్తిపారవశ్యంతో గ్రోలి తృప్తిపొందుతారో అటువంటి దేవునికి ద్రోహం చేశావు. నిన్నేమనాలి?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=87

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: