Friday, May 12, 2017

దక్ష యాగము - 30

4-83-క.
చనుదెంచిన యమ్మగువను
జననియు సోదరులుఁ దక్క సభఁ గల జను లె
ల్లను దక్షువలని భయమున
ననయము నపు డాదరింపరైరి మహాత్మా!
4-84-క.
నెఱిఁ దల్లియుఁ బినతల్లులుఁ
బరిరంభణ మాచరింపఁ బరితోషాశ్రుల్
దొరఁగఁగ డగ్గత్తికతో
సరసిజముఖి సేమ మరయ సతి దా నంతన్.

టీకా:
చనుదెంచిన = వచ్చిన; ఆ = ఆ; మగువను = స్త్రీని; జననియు = తల్లి; సోదరులున్ = తోడబుట్టనవారు; తక్క = తప్పించి; సభన్ = సదస్సున; కల = ఉన్న; జనులు = ప్రజలు; ఎల్లను = అందరును; దక్షు = దక్షుని; వలని = అందలి; భయమునన్ = భయముతో; అనయమున్ = మృదుత్వములేక; అపుడు = అప్పుడు; ఆదరింపరు = అదరింపనివారు; ఐరి = అయ్యారు; మహాత్మా = గొప్పవాడ. నెఱిన్ = నిండుగ; తల్లియున్ = తల్లి; పినతల్లులన్ = పినతల్లులు; పరిరంభణము = కౌగలింతలు; ఆచరింపన్ = చేయగ; పరితోష = ఆనంద; అశ్రుల్ = భాష్పములు; = తొరగగ = కారగా; డగ్గుతిక = గద్గదస్వరము; తోన్ = తో; సరసిజముఖి = సతీదేవి {సరసిజముఖి - సరసిజము (సరసున పుట్టు పద్మము) వంటి ముఖము కలామె, స్త్రీ}; సేమము = క్షేమము; అరయన్ = విచారించగ; సతిన్ = సతీదేవి; తాన్ = తను; అంతన్ = అంతట.

భావము:
విదురా! వచ్చిన సతీదేవిని చూడగానే తల్లి, తోబుట్టువులు అనురాగంతో ఆదరించారు. సభలో ఉన్న తక్కినవారు దక్షునికి భయపడి ఆమెను గౌరవించకుండా ఊరకున్నారు. తల్లి, పినతల్లులు సతీదేవిని కౌగలించుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గదస్వరంతో కుశలప్రశ్నలు వేయగా, సతీదేవి అప్పుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=84

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: