Sunday, April 30, 2017

దక్షయాగము - 18:

4-61-క.
ఆ యజ్ఞముఁ గనుగొనఁగా
నా యనుజులు భక్తిఁ బ్రాణనాథుల తోడం
బాయక వత్తురు; మనముం
బోయిన నే వారి నచటఁ బొడగనఁ గల్గున్.
4-62-క.
జనకుని మఖమున కర్థిం
జని నీతోఁ బారిబర్హ సంజ్ఞికతఁ గడుం
దనరిన భూషణములఁ గై
కొన వేడ్క జనించె నీశ! కుజనవినాశా!

టీకా:
ఆ = ఆ; యజ్ఞమున్ = యాగమును; కనుగొనగాన్ = చూడవలెనని; నా = నా యొక్క; అనుజులు = సహోదరులు; భక్తిన్ = భక్తితో; ప్రాణనాథుల = భర్తల; తోడన్ = తోటి; పాయక = తప్పక; వత్తురు = వస్తారు; మనమున్ = మనముకూడ; పోయినన్ = వెళ్ళినచో; నేన్ = నేను; వారిన్ = వారిని; అచటన్ = అక్కడ; పొడగనగల్గున్ = చూడగలను.  జనకుని = తండ్రి; మఖమున్ = యాగమున; కున్ = కు; అర్థిన్ = కోరి; చని = వెళ్ళి; నీ = నీ; తోడన్ = తోటి; పారిబర్హ = పారిబర్హమని; సంజ్ఞికతన్ = పేరుతో; కడున్ = మిక్కిలి; తనరిన = అతిశయించిన; భూషణములన్ = ఆభరణములను; కైకొన్ = తీసుకొనవలెనని; వేడ్క = వేడుక, సరదా; జనించెన్ = పుట్టినది; ఈశా = శివా {ఈశుడు - ఈశత్వము కలవాడు, ప్రభువు, శివుడు}; కుజనవినాశ = శివా {కుజనవినశుడు - కుజనులను (దుష్టులను) వినాశ (నాశనము చేయువాడు), శివుడు}.

భావము:
ఆ యజ్ఞాన్ని చూడడానికి నా తోబుట్టువులంతా తమ తమ భర్తలతో తప్పకుండా వస్తారు. మనమూ వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళనందరినీ చూచే అవకాశం నాకు కలుగుతుంది. శంకరా! దుష్టజన నాశంకరా! నా తండ్రి చేసే యజ్ఞానికి నీతో వెళ్ళి అక్కడ పరిబర్హం అనబడే నగలను కానుకలుగా పొందాలనే కోరిక పుట్టింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=62


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, April 29, 2017

దక్షయాగము - 17:

4-59-క.
సతి దన పతి యగు నా పశు
పతిఁ జూచి సముత్సుకతను భాషించె; "ప్రజా
పతి మీ మామ మఖము సు
వ్రతమతి నొనరించుచున్న వాఁడఁట వింటే;
4-60-క.
కావున నయ్యజ్ఞమునకు
నీ విబుధగణంబు లర్థి నేగెద; రదిగో!
దేవ! మన మిప్పు డచటికిఁ
బోవలె నను వేడ్క నాకుఁ బుట్టెడు నభవా!

టీకా:
సతి = సతీదేవి; తన = తనయొక్క; పతి = భర్త; అగు = అయిన; ఆ = ఆ; పశుపతిన్ = శివుని {పశుపతి - పాశములచే బంధించబడిన సకల జీవులను పాలించు అధిపతి, శివుడు}; చూచి = చూసి; సముత్సకతను = మంచి; ఉత్సుకతనున్ = ఉత్సాహముతో; భాషించెన్ = మాట్లాడెను; ప్రజాపతి = ప్రజాపతి; మీ = మీ యొక్క; మామ = మావగారు; మఖమున్ = యాగమును; సువ్రత = బాగుగాచేయు; మతిన్ = ఉద్దేశ్యముతో; ఒనరించుచున్ = చేస్తూ; ఉన్నవాడట = ఉన్నాడట; వింటే = విన్నావా. కావునన్ = అందుచేత; ఆ = ఆ; యజ్ఞమున్ = యాగమున; కున్ = కు; ఈ = ఈ; విబుధ = దేవతల; గణంబుల్ = సమూహములు; అర్థిన్ = కోరి; ఏగెదరు = వెళుతున్నారు; అదిగో = అదిగో; దేవ = దేవుడ; మనము = మనము; ఇపుడున్ = ఇప్పుడు; అచటికిన్ = అక్కడకి; పోవలెను = వెళ్ళవలెను; అని = అని; వేడ్క = వేడుక; నాకున్ = నాకు; పుట్టెడున్ = పుడుతున్నది; అభవా = శివుడ {అభవ - పుట్టుక లేనివాడు, శివుడు}.

భావము:
అప్పుడు సతీదేవి అతిశయించిన కుతూహలంతో తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరునితో ఇలా అంటోంది “విన్నారా! మీ మావగారు దక్షప్రజాపతి దీక్షాపరుడై యజ్ఞం చేస్తున్నా డట! కనుక ఆ యజ్ఞాన్ని చూదాలనే వేడుకతో అదుగో ఆ దెవతలంతా గుంపులుగా వెళ్తున్నారు. స్వామీ! మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళాలనే కోరిక నాకు కలుగుతున్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=60

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :


Friday, April 28, 2017

దక్షయాగము - 16:

4-58-సీ.
తనరారు నవరత్న తాటంక రోచులు;
చెక్కుటద్దములతోఁ జెలిమి చేయఁ;
మహనీయ తపనీయమయ పదకద్యుతు;
లంసభాగంబుల నావరింప;
నంచిత చీనిచీనాంబర ప్రభలతో;
మేఖలాకాంతులు మేలమాడఁ;
జంచల సారంగ చారు విలోచన;
ప్రభలు నల్దిక్కులఁ బ్రబ్బికొనఁగ;
4-58.1-తే.
మించు వేడుక భర్తృసమేత లగుచు
మానితంబుగ దివ్య విమానయాన
లగుచు నాకాశపథమున నరుగుచున్న
ఖచర గంధర్వ కిన్నరాంగనలఁ జూచి.

టీకా:
తనరారు = అతిశయించిన; నవరత్న = నవరత్నములు పొదిగిన; తాటంక = చెవిదిద్దుల; రోచులు = కాంతులు; చెక్కుడు = చెంపలను; అద్దముల్ = అద్దముల; తోన్ = తోటి; చెలిమి = స్నేహము; చేయన్ = చేస్తుండగ; మహనీయ = గొప్ప; తపనీయ = బంగారముతో; మయ = చేయబడిన; పదక = పతకముల; ద్యుతులు = కాంతులు; అంసభాగములన్ = భుజములపైన; ఆవరింపన్ = పరచుకొనగా; అంచిత = పూజనీయమైన; చీనిచీనాంబర = సన్ననిపట్టువస్త్రముల {చీనిచీనాంబరము - చీనీ (చైనా దేశమునుండి వచ్చిన) చీనాంబరము (చైనాగుడ్డ, పట్టువస్త్రము)}; ప్రభల్ = ప్రకాశముల; తోన్ = తోటి; మేఖలా = వడ్డాణపు; కాంతులు = వెలుగులు; మేలము = పరిహాసములు; ఆడన్ = చేస్తుండగ; చంచల = చలిస్తున్న; సారంగ = లేడికన్నులవంటి; చారు = అందమైన; విలోచన = కన్నుల; ప్రభలు = ప్రకాశములు; నల్దిక్కులన్ = నాలుగు దిక్కులందును {నాలుగుదిక్కులు - 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తర దిక్కులు}; ప్రబ్భికొనగ = పరచుకొనగ. మించి = అతిశయిచిన; వేడుకన్ = కుతూహలముతో; భర్తృసమేతలు = భర్తతోకూడినవారు; అగుచున్ = అవుతూ; మానితంబు = స్తుతింపదగినవి; కాన్ = అగునట్లుగ; దివ్య = దివ్యమైన; విమాన = విమానములందు; యానలు = ప్రయాణించువారు; అగుచున్ = అవుతూ; ఆకాశ = ఆకాశ; పథంబునన్ = మార్గమున; అరుగుచున్ = వంలుతూ; ఉన్న = ఉన్నట్టి; = ఖచర = ఆకాశమున సంచరిస్తున్న; గంధర్వ = గంధర్వ; కిన్నర = కిన్నర; అంగనలన్ = స్త్రీలను {అంగనలు - అంగములు చక్కగ యున్నవారు, స్త్రీలు}; చూచి = చూసి.

భావము:
నవరత్నాలు తాపిన చెవికమ్మల కాంతులు అద్దాలవంటి చెక్కిళ్ళపై పడుతుండగా, మేలిమి బంగారు పతకాల కాంతులు భుజాలపై వ్యాపించగా, చీని చీనాంబరాల కాంతులు మొలనూళ్ళ కాంతులతో కలిసి మెరుస్తుండగా, లేడికన్నుల వెలుగులు నాలుగు దిక్కులా ప్రసరిస్తుండగా ఉరకలు వేసే ఉత్సాహంతో తమ తమ భర్తలతో కూడి దివ్యవిమానాలను అధిరోహించి దేవతాస్త్రీలు ఆకాశంలో వెళ్తుండగా సతీదేవి చూచి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=58

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :




Thursday, April 27, 2017

దక్షయాగము - 15:


4-56-తే.
దక్షతనయ సతీదేవి దవిలి యాత్మ
సదనమున నుండి జనకుని సవనమహిమ
గగన చరులు నుతింప నా కలకలంబు
విని కుతూహలిని యయి విన్వీథిఁ జూడ.
4-57-వ.
అయ్యవసరంబునఁ దదుత్సవ దర్శన కుతూహలులై సర్వదిక్కుల వారును జనుచుండి; రా సమయంబున.

టీకా:
దక్ష = దక్షుని; తనయ = పుత్రిక; సతీదేవి = సతీదేవి; తవిలి = పూని; ఆత్మ = తన; సదనమున్ = భవనము; నుండి = నుంచి; జనకుని = తండ్రి; సవన = యాగము యొక్క; మహిమన్ = గొప్పదనమును; గగనచరులు = ఆకాశన తిరుగు దేవతలు; నుతింపన్ = స్తుతింపగా; ఆ = ఆ; కలకలంబున్ = శబ్దములను; విని = వినుటచే; కుతూహలిని = కుతూహలముకలామె; అయి = అయ్యి; విన్వీథిన్ = ఆకాశమార్గమును; చూడన్ = చూడగా. ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; తత్ = ఆ; ఉత్సవము = ఉత్సవమును; దర్శన = చూసెడి; కుతూహలులు = కుతూహలముకలవారు; ఐ = అయ్యి; సర్వ = అన్ని; దిక్కులన్ = దిక్కులందు; వారున్ = ఉండువారు; చనుచుండిరి = వెళ్ళుతుండిరి; ఆ = ఆ; సమయంబునన్ = సమయములో.

భావము:
దక్షుని కూతురైన సతీదేవి తన ఇంటిలో ఉన్నదై తండ్రి చేస్తున్న యజ్ఞవైభవాన్ని దేవతలు పొగడుతుండగా ఆ కలకలాన్ని విని ఆకాశంవైపు చూడగా... అప్పుడు ఆ యజ్ఞవైభవాన్ని చూడాలనే కుతూహలంతో అన్నిదిక్కులవారు వెళ్తున్నారు. ఆ సమయంలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=56

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday, April 26, 2017

దక్షయాగము - 14


4-54-వ.
“అంత శ్వశురుండగు దక్షునకు జామాత యైన భర్గునకు నన్యోన్య విరోధంబు పెరుఁగుచుండ నతిచిరంబగు కాలం బరిగె; నంత దక్షుండు రుద్రవిహీనంబగు యాగంబు లేనిది యైనను శర్వుతోడి పూర్వ విరోధంబునను బరమేష్టి కృతంబైన సకల ప్రజాపతి విభుత్వగర్వంబు ననుం జేసి బ్రహ్మనిష్ఠులగు నీశ్వరాదుల ధిక్కరించి యరుద్రకంబుగా వాజపేయ సవనంబు గావించి తదనంతరంబ బృహస్పతిసవన నామకం బైన మఖంబు చేయ నుపక్రమించిన నచ్చటికిం గ్రమంబున.
4-55-చ.
కర మనురక్తి నమ్మఖముఁ గన్గొను వేడుక తొంగలింపఁగాఁ
బరమమునిప్రజాపతి సుపర్వ మహర్షి వరుల్ సభార్యులై
పరువడి వచ్చి యందఱు శుభస్థితి దీవన లిచ్చి దక్షుచేఁ
బొరిఁబొరి నచ్చటన్ విహిత పూజల నొందిరి సమ్మదంబునన్.

భావము:
అప్పుడు మామ అయిన దక్షునికి, అల్లుడైన శివునికి పరస్పర వైరం నానాటికీ పెరుగుచుండగా చాలాకాలం గడిచింది. బ్రహ్మ దక్షుణ్ణి ప్రజాపతులందరికీ అధ్యక్షుణ్ణి చేయగా ఆ అధికారగర్వంచేత, పరమేశ్వరునిపై ఉన్న పగచేత దక్షుడు బ్రహ్మవేత్తలను, పరమేశ్వరుణ్ణి ధిక్కరించి, రుద్రహీనమైన వాయపేయం అనే యజ్ఞాన్ని చేశాడు. తరువాత బృహస్పతి సవనం అనే యజ్ఞాన్ని చేయటానికి పూనుకోగా అక్కడికి క్రమంగా.... ఆ యజ్ఞాన్ని చూడాలని వేడుకతో మునులు, ప్రజాపతులు, దేవతలు, మహర్షులు భార్యాసమేతులై వచ్చి, దక్షుణ్ణి దీవించారు. అతడు చేసిన పూజలను సంతోషంగా అందుకున్నారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=55

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, April 25, 2017

దక్షయాగము - 13:



4-52-వ.
ఇట్లన్యోన్యంబును శాపంబులం బొందియు భగవదనుగ్రహంబు గల వారలగుటం జేసి నాశంబు నొందరైరి; అట్టి యెడ విమనస్కుం డగుచు ననుచర సమేతుం డై భవుండు చనియె నంత.
4-53-సీ.
అనఘాత్మ! యే యజ్ఞమందు సర్వశ్రేష్ఠుఁ;
డగు హరి సంపూజ్యుఁడై వెలుంగు
నట్టి యజ్ఞంబు సమ్యగ్విధానమున స;
హస్ర వత్సరములు నజుఁ డొనర్చెఁ
గరమొప్ప నమర గంగాయమునా సంగ;
మావనిఁ గలుగు ప్రయాగ యందు
నవభృథస్నానంబు లతిభక్తిఁ గావించి;
గతకల్మషాత్ములై ఘనత కెక్కి
4-53.1-తే.
తగ నిజాశ్రమభూములఁ దలఁచి వార
లందఱును వేడ్కతోఁ జని రనుచు" విదురు
నకును మైత్రేయుఁ డను మునినాయకుండు
నెఱుఁగ వినిపించి వెండియు నిట్టు లనియె.

భావము:
ఈ విధంగా నందీశ్వరుడు, భృగుమహర్షి ఒకరినొకరు శపించుకున్నారు. దైవానుగ్రహంవల్ల వారు నశింపలేదు. అప్పుడు వ్యాకుల హృదయుడై శివుడు అనుచరులతో అక్కడినుండి వెళ్ళిపోయాడు. పుణ్యాత్మా! సర్వశ్రేష్ఠుడైన నారాయణుడు ఏ యజ్ఞంలో పూజనీయుడో అటువంటి యజ్ఞాన్ని బ్రాహ్మణులు వేయి సంవత్సరాలు యథావిధిగా చేశారు. గంగా యమునలు సంగమించే ప్రయాగక్షేత్రంలో సదస్యులు దీక్షా స్నానాలు చేసి పాపాలు పోగొట్టుకొని తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు” అని మైత్రేయ మహర్షి విదురునితో చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=53

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, April 24, 2017

దక్షయాగము - 12


4-51-సీ.
"సకల వర్ణాశ్రమాచార హేతువు, లోక;
మునకు మంగళమార్గమును, సనాత
నముఁ, బూర్వఋషిసమ్మతము, జనార్దనమూల;
మును, నిత్యమును, శుద్ధమును, శివంబు,
నార్యపథానుగం బగు వేదమును విప్ర;
గణము నిందించిన కారణమున
నే శివదీక్ష యందేని మధ్యమ పూజ్యుఁ;
డై భూతపతి దైవ మగుచు నుండు
4-51.1-తే.
నందు మీరలు భస్మజటాస్థిధార
ణములఁ దగి మూఢబుద్ధులు నష్టశౌచు
లై నశింతురు పాషండు లగుచు" ననుచు
శాప మొనరించె నా ద్విజసత్తముండు.

భావము:
సమస్తమైన వర్ణాశ్రమాచారాలను విధించే వేదం లోకాలకు మేలును కలిగిస్తుంది. అది సనాతనమైనది. దానిని పూర్వ ఋషిపుంగవులంతా అంగీకరించారు. వేదం విష్ణువునుండి ఆవిర్భవించింది. అది శాశ్వతమైనది, పరిశుద్ధమైనది, మంగళప్రదమైనది. దానిని ఆర్యులైనవారు అనుసరిస్తారు. అటువంటి వేదాన్నీ బ్రాహ్మణులనూ నీవు నిందించావు. అందుచేత శివదీక్షను స్వీకరించేవారికి మద్యం పూజ్యమగుగాక! శివవ్రతులు భస్మాన్నీ, జడలనూ, ఎముకలనూ ధరిస్తారు గాక! మూర్ఖులై శుచిత్వం లేనివారై పాషండులై నశింతురు గాక!” అని భృగుమహర్షి శపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=51

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, April 23, 2017

దక్షయాగము - 11:

4-50-తే.
"వసుధ నెవ్వారు ధూర్జటివ్రతులు వారు
వారి కనుకూలు రగుదు రెవ్వారు వారు
నట్టి సచ్ఛాస్త్ర పరిపంథు లైన వారు
నవనిఁ బాషండు లయ్యెద" రని శపించె.

భావము:
ఈ లోకంలో ఎవరు శివదీక్షాపరాయణులో, ఎవరు వారిని అనుసరిస్తారో వారంతా శాస్త్రాలకు విరోధులై పాషండులు అగుదురు గాక!

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=50



: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, April 22, 2017

దక్షయాగము - 10:


4-48-మ.
"అనయంబుం దన మానసంబున నవిద్యన్ ముఖ్యతత్త్వంబు గాఁ
గని గౌరీశుఁ దిరస్కరించిన యసత్కర్మాత్ము నీ దక్షుని
న్ననువర్తించినవాఁరు సంసరణకర్మారంభుఁలై నిచ్చలున్
జననం బందుచుఁ జచ్చుచున్ మరల నోజం బుట్టుచున్ వర్తిలున్.
4-49-వ.
అదియునుం గాక యీ హరద్వేషులైన ద్విజు లర్థవాద బహుళంబు లైన వేదవాక్యంబుల వలన మధుగంధ సమంబైన చిత్తక్షోభంబుచేత విమోహిత మనస్కులై కర్మాసక్తు లగుదురు; మఱియును భక్ష్యాభక్ష్య విచారశూన్యులై దేహాది పోషణంబుకొఱకు ధరియింపఁ బడిన విద్యా తపోవ్రతంబులు గలవారలై ధన దేహేంద్రియంబుల యందుఁ బ్రీతిం బొంది యాచకులై విహరింతురు;” అని నందికేశ్వరుండు బ్రాహ్మణజనంబుల శపియించిన వచనంబులు విని భృగుమహాముని మరల శపి యింపం బూని యిట్లనియె.

భావము:
“ఎల్లప్పుడు అజ్ఞానాన్నే జ్ఞానంగా భ్రమించి దేవదేవుడైన మహాదేవుని నిందించిన ఈ మహాపాపిని అనుసరించేవారు సర్వదా సంసారంలో చిక్కుకుని పుడ్తూ చస్తూ మళ్ళీ పుడ్తూ ఉందురు గాక! అంతేకాక శివుని ద్వేషించే ఇందలి బ్రాహ్మణులు అర్థవాదాలతో నిండిన వేదవాక్యాలవల్ల కల్లుకైపు వంటి మనోమాలిన్యంతో కలత చెంది మోహపడి అసత్కర్మలపై ఆసక్తి పెంచుకుంటారు. తినదగినవి, తినదగనివి అనే ఆలోచన నశించి అన్నింటినీ ఆరగిస్తారు. విద్యను, తపస్సును, వ్రతాలను పొట్టకోసమే అవలంబిస్తారు. ధనంమీద, దేహంమీద, ఇంద్రియాలమీద ఆదరాభిమానాలు కలవారై యాచకులై సంచరిస్తారు” అని నందికేశ్వరుడు అచ్చటి బ్రాహ్మణులను శపించాడు. నంది శాపవాక్కులు విని భృగుమహర్షి తిరిగి ఇలా శపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=48

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, April 21, 2017

దక్షయాగము - 9:


4-47-వ.
ఇట్లు దక్షుండు పల్కిన గర్హితవాక్యంబులు వినిందితంబు లగుం గాని యాథార్థ్యంబున వాస్తవంబు లగుచు భగవంతుండగు రుద్రునందు నిందితంబులు గాక స్తుతి రూపంబున నొప్పెఁ; దదనంతరంబ రుద్రునకు శాపం బిచ్చిన కారణంబున దక్షుండు సదస్యముఖ్యులచే 'నకృత్యం' బని నిషేధింపబడి ప్రవృద్ధంబయిన క్రోధంబుతోడ నిజనివాసంబునకుం జనియె; అంత గిరిశానుచరాగ్రేసరుం డగు నందికేశ్వరుండు దక్షుండు నిటలాక్షుని శపియించిన శాపంబు, నతనిఁ బల్కిన యనర్హ వాక్యంబులును విని కోపారుణితలోచనుండై యిట్లను “నీ దక్షుండు మర్త్యశరీరంబు శ్రేష్ఠంబు గాఁ దలఁచి యప్రతిద్రోహియైన భగవంతునందు భేదదర్శియై యపరాధంబుఁ గావించె; ఇట్టి మూఢాత్ముండు దత్త్వ విముఖుం డగు; మఱియుం గూటధర్మంబు లయిన నివాసంబుల గ్రామ్యసుఖకాంక్షలం జేసి సక్తుండై యర్థవాదంబు లైన వేదంబులచేత నష్టమనీషం గలిగి కర్మతంత్రంబు విస్తృతంబు చేయు; వెండియు దేహాదికంబు లుపాదేయంబులు గాఁ దలఁచుచు బుద్దిచేత నాత్మతత్త్వంబు మఱచి వర్తించుచుఁ బశుప్రాయుండై స్త్రీకాముండు నగు; నిదియునుం గాక దక్షుం డచిరకాలంబున మేషముఖుం డగు" నని మఱియు.

భావము:
ఈ విధంగా దక్షుడు పలికిన నిందావాక్యాలు పైకి అనుచితాలుగా తోచినా మరొక అర్థంలో వాస్తవాలై, సముచితాలై పూజ్యుడైన శివునికి పొగడ్తలే అయ్యాయి. ఆ తరువాత శివుని శపించిన దక్షుణ్ణి చూచి సభ్యులు “నీవు చేసినది చెడ్డపని” అని అడ్డుకోగా, దక్షుడు ఆగ్రహోదగ్రుడై తన గృహానికి వెళ్ళిపోయాడు. అప్పుడు శివుని సేవకులలో శ్రేష్ఠుడైన నందికేశ్వరుడు దక్షుడు పరమేశ్వరుని నిందించడం, శపించడం విని కోపంతో కన్నులెర్రవారగా ఇలా అన్నాడు “ఈ దక్షుడు తన మర్త్యశరీరం గొప్పది అని భావించాడు. తనకు తిరిగి కీడు చేయకుండా శాంతుడై ఉన్న దేవదేవునికి అపరాధం చేశాడు. వీడు భేదదర్శి. ఇటువంటి మూర్ఖునికి తత్త్వదర్శనం లభించదు. వీడు కుటిల ధర్మాలను ఆశ్రయించి నీచసుఖాలపై కోర్కెలు పెంచుకున్నాడు. వేదాలలోని అర్థవాదాలను నిజమని నమ్మాడు. దేహమునే ఆత్మగా భావిస్తాడు. అందుచేత వీడు సత్యమైన ఆత్మతత్త్వాన్ని విస్మరించి పశువుతో సమానమౌతాడు. వీడు స్త్రీలోలుడై చెడిపోతాడు. అంతేకాదు, ఈ దక్షుడు తొందరలోనే గొర్రెతలవాడు అగుగాక” అని ఇంకా...





: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, April 20, 2017

దక్షయాగము - 8:

4-44-వ.
ఇతనికి నస్మత్తనూజను విధిప్రేరితుండనై యిచ్చితి.”
4-45-క.
అని యిట్టులు ప్రతికూల వ
చనములు దక్షుండు పలికి శపియింతును శ
ర్వుని నని జలములు గొని కర
మున నిలిపి యిటులనె రోషమున ననఘాత్మా!
4-46-క.
"ఇతఁ డింద్రోపేంద్ర పరీ
వృతుఁడై మఖసమయమున హవిర్భాగము దే
వతలం గూడఁగ మహిత ని
యతిఁ బొందక యుండుఁగాక యని శపియించెన్."


భావము:
ఇతనికి బ్రహ్మ మాట విని నా పుత్రికను ఇచ్చాను.” అని ఈ విధంగా దక్షుడు నిందించి “శంకరుని శపిస్తాను” అంటూ శాపజలాలను చేతిలో తీసికొని రోషంతో ఇలా అన్నాడు. “ఈ శివుడు ఇంద్రుడు, విష్ణువు మొదలైన దేవతలతోపాటు యజ్ఞంలో హవిర్భాగం పొందకుండు గాక!” అని శపించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=46

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday, April 19, 2017

దక్షయాగము - 7:

4-43-సీ.
అనయంబు లుప్తక్రియాకలాపుఁడు మాన;
హీనుఁడు మర్యాదలేని వాఁడు
మత్తప్రచారుఁ డున్మత్తప్రియుఁడు దిగం;
బరుఁడు భూతప్రేత పరివృతుండు
దామస ప్రమథ భూతములకు నాథుండు;
భూతలిప్తుం డస్థిభూషణుండు
నష్టశౌచుండు నున్మదనాథుఁడును దుష్ట;
హృదయుఁ డుగ్రుఁడును బరేతభూ ని
4-43.1-తే.
కేతనుఁడు వితతస్రస్తకేశుఁ డశుచి
యయిన యితనికి శివనాముఁ డను ప్రవాద
మెటులు గలిగె? నశివుఁ డగు నితని నెఱిఁగి
యెఱిఁగి వేదంబు శూద్రున కిచ్చినటులు.

భావము:
దక్షుడు శివుని ఇలా నిందిస్తున్నా స్తుతి కూడ స్పురిస్తున్న చమత్కారం ఉన్న పద్యం యిది – ఇతను ఎప్పుడు వేదకర్మ లాచరించని వాడు. (కర్మలు చేయని వాడు అంటే పూర్తిగా కర్మలకు అతీతుడు); మానాభిమానాలు లేని వాడు. (మానం లేనివాడు అంటే గౌరవ అగౌరవాలు పట్టని వాడు); నియమాలు లేని వాడు. (మర్యాద లేదంటే దేశకాలాలకి తరతమ భేదాలకి అతీతుడు); మత్తెక్కి తిరుగు వాడు. (ఆత్మానందంలో మెలగు వాడు); పిచ్చివారి కిష్టుడు. (ఉన్నత్తాకారంలో మెలగే సిద్ధులకు ఇష్టుడు); నగ్నంగా ఉంటాడు. (దిగంబరుడు ఆకాశ అంతరిక్షాలు దేహంగా కలవాడు); భూతాలు ప్రేతాలు ఎప్పుడు చుట్టూ ఉంటాయి. (పంచభూతాలు మరణానంతర జీవాత్మలు కూడ ఆశ్రయించి ఉంటాయి); తమోగుణం గల ప్రమథ గణాలకు నాయకుడు. బూడిద పూసుకుంటాడు. (ఆది విరాగి కనుక వైరాగ్య చిహ్న మైన విభూతి రాసుకుంటాడు); ఎముకలు అలంకారాలుగా ధరిస్తాడు. (అస్థి భూషణుడు అంటే బ్రహ్మ కపాలాలు ధరిస్తాడు); అపవిత్రుడు. (శౌచాశౌచాలకి అతీత మైన వాడు) (ఉన్మత్తులనే భూతగణాలకి అధిపతి. లౌకిక విలువలు లెక్కచెయ్యని వాడు;). దుష్టబుద్ధి. (దుష్ట అర్థచేసుకోరాని నిగూఢ మనస్సు కలవాడు);. ఉగ్రమైన స్వభావం కల వాడు. (ఉగ్రుడు అంటే రుద్రుడు); శ్మశాన వాసి. (మరణ స్థితులకు అవ్వల నుండు వాడు); జుట్టు విరబోసుకొని ఉంటాడు. (సంకోచ సందేహాదులకు అతీతుడు); శుచి శుభ్రం లేకుండా మలినదేహంతో ఉంటారు. (అశుచి అంటే సర్వం తానే కనుక శుచి అశుచి భేదాలు లేని వాడు); అలాంటి వాడికి శివుడు అని ఎందుకో అసందర్భంగా పిలుస్తారు. శివుడు అంటే శుభాలను కలిగించే వాడు అని చూడొద్దా. (శివనాముడను ప్రవాదము పేరుకు మాత్రమే శివుడు అనటం అసందర్భం); ఇంతటి అశివుడు అని తెలిసికూడ, శూద్రునికి వేదాలు చెప్పినట్లు, శివుడు అని పేరు పెట్టారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=43

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, April 18, 2017

దక్షయాగము - 6:


4-42-సీ.
"పరికింప నితఁడు దిక్పాలయశోహాని;
కరుఁ డీ క్రియాశూన్యపరుని చేతఁ
గరమొప్ప సజ్జనాచరితమార్గము దూషి;
తం బయ్యె; నెన్న గతత్రపుండు
మహితసావిత్రీ సమానను సాధ్వి న;
స్మత్తనూజను మృగశాబనేత్ర
సకల భూమీసుర జన సమక్షమున మ;
ర్కటలోచనుఁడు కరగ్రహణ మర్థిఁ
4-42.1-తే.
జేసి తా శిష్యభావంబుఁ జెందు టాత్మఁ
దలఁచి ప్రత్యుద్గమాభివందనము లెలమి
నడపకుండిన మాననీ; నన్నుఁ గన్న
నోరిమాటకుఁ దన కేమి గోరువోయె.



భావము:
“ఈ శివుడు దిక్పాలకుల కీర్తికి హాని చేసేవాడు. ఇతడు క్రియాశూన్యుడు. సత్పురుషులు నడిచే మార్గం ఇతనివల్ల చెడిపోయింది. ఇతనికి సిగ్గు లేదు. లేడి కన్నులు కలిగి, సావిత్రీదేవివంటి సాధ్వీశిరోమణి అయిన నా కుమార్తెను ఈ కోతికన్నులవాడు పెద్దల సమక్షంలో కోరి పెండ్లి చేసుకున్నాడు. తన శిష్యభావాన్ని తలచుకొని నాకు ఎదురువచ్చి నమస్కరించకపోతే పోనీయండి. నన్ను చూచి పలుకరిస్తే తన నోటి ముత్యాలు రాలిపోతాయా?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=42

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

చరణి భాగవతం పదివేల దిగుమతి

చరణి భాగవతం( మొబైలు ఆప్ - తెలుగు భాగవతం) 10,000 దాటాయి. అని తెలుపుటకు సంతోషిస్తున్నాను. 

Monday, April 17, 2017

దక్షయాగము - 5:

4-41-తే.
"వినుఁడు మీరలు రొదమాని విబుధ ముని హు
తాశనాది సురోత్తములార! మోహ
మత్సరోక్తులు గావు నా మాట" లనుచు
వారి కందఱ కా పురవైరిఁ జూపి.

భావము:
“దేవతలారా! మునులారా! మీరందరూ సద్దు చేయకుండా వినండి. నా మాటలు అజ్ఞానంతో, అసూయతో పలికేవి కావు” అని వారందరికీ శివుని చూపించి...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=41


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, April 16, 2017

దక్షయాగము - 4:

4-39-క.
చనుదెంచిన యా దక్షుఁడు
వనజజునకు మ్రొక్కి భక్తివశులై సభ్యుల్
తన కిచ్చిన పూజలు గై
కొని యర్హాసనమునందుఁ గూర్చుండి తగన్.
4-40-తే.
తన్నుఁ బొడగని సభ్యు లందఱును లేవ
నాసనము దిగనట్టి పురారివలను
గన్నుఁ గొనలను విస్ఫులింగములు సెదరఁ
జూచి యిట్లను రోషవిస్ఫురణ మెఱయ.

భావము:
వచ్చిన దక్షుడు బ్రహ్మకు నమస్కరించాడు. సభ్యులు భక్తితో తనకు చేసిన పూజలను అందుకున్నాడు. తనకు తగిన పీఠంపై కూర్చొని... తనను చూచి సభ్యులందరూ లేచి నిలబడగా గద్దె దిగని శివునివైపు తన కంటికొనలనుండి మంటలు విరజిమ్ముతూ చూచి కోపంతో (ఇలా అన్నాడు).

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=40

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, April 15, 2017

భారతీయ భాషలకు చక్కటి PDF మన దిలీప్ American Patent


మా భాగవతబంధువు. తెలుగుభాగవతం.ఆర్గ్ సాంకేతిక నిపుణుడు మా Dileep Miriyala అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే, నా తెలుగుకే కాకుండా సకల భారతీయ భాషలకు ప్రయోజనకరమైన అద్భుతమైన సేవ కదా ఇది.

http://www.freepatentsonline.com/y2017/0097921.html

దక్షయాగము - 3:

4-37-క.
అని యడిగిన నవ్విదురునిఁ
గనుఁగొని మైత్రేయుఁ డనియెఁ గౌతుక మొప్పన్
"విను మనఘ! తొల్లి బ్రహ్మలు
జన నుతముగఁ జేయునట్టి సత్రముఁ జూడన్.
4-38-చ.
సరసిజగర్భ యోగిజన శర్వ సుపర్వ మునీంద్ర హవ్యభు
క్పరమ ఋషిప్రజాపతులు భక్తిఁ మెయిం జనుదెంచి యుండ న
త్తరణిసమాన తేజుఁడగు దక్షుఁడు వచ్చినఁ దత్సదస్యు లా
దరమున లేచి; రప్పుడు పితామహ భర్గులు దక్క నందఱున్.

భావము:
అని అడిగిన విదురునకు మైత్రేయ మహర్షి ఇలా చెప్పాడు. “పుణ్యాత్మా! విను. పూర్వం బ్రహ్మవేత్తలు ప్రారంభించిన మహాయజ్ఞాన్ని చూడటానికి. శివుడు, బ్రహ్మ, యోగీశ్వరులు, దేవతలు, మునీంద్రులు, మహర్షులు, ప్రజాపతులు మొదలైన వారంతా పరమాసక్తితో వచ్చారు. అప్పుడు అక్కడికి సూర్యతేజస్సుతో ప్రకాశిస్తూ దక్షుడుకూడ వచ్చాడు. దక్షుని చూడగానే బ్రహ్మ, శివుడు తప్ప సభలోని వారందరూ లేచి నిలబడ్డారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=38


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, April 14, 2017

దక్షయాగము - 2:


4-36-సీ.
"చతురాత్మ! దుహితృవత్సలుఁడైన దక్షుండు;
దన కూఁతు సతి ననాదరము చేసి
యనయంబు నఖిలచరాచర గురుఁడు ని;
ర్వైరుండు శాంతవిగ్రహుఁడు ఘనుఁడు
జగముల కెల్లను జర్చింప దేవుండు;
నంచితాత్మారాముఁ డలఘుమూర్తి
శీలవంతులలోన శ్రేష్ఠుండు నగునట్టి;
భవునందు విద్వేషపడుట కేమి
4-36.1-తే.
కారణము? సతి దా నేమి కారణమున
విడువరానట్టి ప్రాణముల్ విడిచె? మఱియు
శ్వశుర జామాతృ విద్వేష సరణి నాకుఁ
దెలియ నానతి యిమ్ము సుధీవిధేయ!"

భావము:
“చతురస్వభావం కలవాడా! సజ్జనవిధేయా! తన పుత్రికలపై ప్రేమ గల దక్షుడు సతీదేవిని ఎందుకు అవమానించాడు? సమస్త చరాచరాలకు గురువు, ఎవరినీ ద్వేషింపనివాడు, ప్రశాంతమూర్తి, మహానుభావుడు, ఎల్ల లోకాలకు దేవుడు, ఆత్మారాముడు, విశ్వేశ్వరుడు, శీలవంతులలో అగ్రేసరుడు అయిన మహాదేవుని దక్షుడు ద్వేషించడానికి కారణం ఏమిటి? ఏ కారణంగా సతీదేవి తన ప్రాణాలు విడిచింది? మామయైన దక్షునికి, అల్లుడైన శివునికి విరోధం ఎలా సంభవించింది? నాకు ఈ కథను దయచేసి సెలవీయండి.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=36

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, April 13, 2017

దక్షయాగము - 1:


4-35-సీ.
దక్షప్రజాపతి తనయ యా భవుని భా;
ర్యయు ననఁ దగు సతి యను లతాంగి
సతతంబుఁ బతిభక్తి సలుపు చుండియుఁ దనూ;
జాతలాభము నందఁ జాలదయ్యె;
భర్గుని దెసఁ జాలఁ బ్రతికూలుఁ డైనట్టి;
తమ తండ్రిమీఁది రోషమునఁ జేసి
వలనేది తా ముగ్ధవలె నిజయోగ మా;
ర్గంబున నాత్మదేహంబు విడిచె;"
4-35.1-తే.
నని మునీంద్రుఁడు వినిపింప నమ్మహాత్ముఁ
డైన విదురుండు మనమున నద్భుతంబు
గదురఁ దత్కథ విన వేడ్క గడలుకొనఁగ
మునివరేణ్యునిఁ జూచి యిట్లనియె మఱియు.

భావము:


దక్షప్రజాపతి కూతురు, పరమశివుని భార్య అయిన సతీదేవి తన పతిని అనునిత్యం మిక్కిలి భక్తితో సేవించినా ఆమెకు సంతానం కలుగలేదు. పరమేశ్వరునిపట్ల పగబూనిన తన తండ్రిమీద కోపించి ఆ ఉత్తమ ఇల్లాలు యోగమార్గంలో తన శరీరాన్ని పరిత్యజించింది.” అని మైత్రేయుడు విదురునితో చెప్పాడు. విదురుడు ఆశ్చర్యపడి ఆ వృత్తాంతమంతా తెలుసుకోవాలనే కుతూహలం కలుగగా ఆ మునీంద్రుని ఇలా ప్రశ్నించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=5&Padyam=35

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, April 10, 2017

మత్స్యావతార కథ - 28:


8-741-మ.
ప్రళయాంభోనిధిలోన మేన్మఱచి నిద్రంజెందు వాణీశు మో
ముల వేదంబులుఁ గొన్న దైత్యుని మృతిం బొందించి సత్యవ్రతుం
డలరన్ బ్రహ్మము మాటలం దెలిపి సర్వాధారుఁడై మీనమై
జలధిం గ్రుంకుచుఁ దేలుచున్ మెలఁగు రాజన్మూర్తికిన్ మ్రొక్కెదన్.
8-742-వ.
అని చెప్పి.

భావము:
ప్రళయసముద్రంలో మైమరచి నిద్రించే బ్రహ్మదేవుడి ముఖాల నుండి వెలువడిన వేదాలను దొంగిలించిన దుష్టరాక్షసుడిని సంహరించి, సత్యవ్రతుడు సంతోషించేటట్లు బ్రహ్మస్వరూపాన్ని తెలిపి, అన్నింటికి ఆధారుడవు అయి, మత్స్యావతారంతో సముద్రంలో మునుగుతూ తేలుతూ సంచారం చేసిన మహావిష్ణువునకు నమస్కారం చేస్తున్నాను.” అని ఈవిధంగా శుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునకు చెప్పాడు.


: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, April 9, 2017

మత్స్యావతార కథ - 27:


8-739-ఆ.
జనవిభుండు దపసి సత్యవ్రతుండును
మత్స్యరూపి యైన మాధవుండు
సంచరించినట్టి సదమలాఖ్యానంబు
వినిన వాఁడు బంధ విరహితుండు.
8-740-క.
హరి జలచరావతారముఁ
బరువడి ప్రతిదినముఁ జదువఁ బరమపదంబున్
నరుఁ డొందు వాని కోర్కులు
ధరణీశ్వర! సిద్ధిఁ బొందుఁ దథ్యము సుమ్మీ.

భావము:

రాజఋషియైన సత్యవ్రతుడి భక్తిని; మత్స్యావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు మహిమనూ; ప్రకటించే ఈ పుణ్య చరిత్రను విన్నవాడు సంసారబంధాల నుంచి విముక్తుడు అవుతాడు. ఓ రాజా! ప్రతిదినమూ మత్స్యావతారం కథను శ్రద్ధతో చదివేవాడు మోక్షాన్ని పొందుతాడు. అతని కోరికలు నెరవేరుతాయి. ఇది సత్యం.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=92&padyam=740

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, April 8, 2017

మత్స్యావతార కథ -26:



8-738-క.
జలరుహనాభుని కొఱకై
జలతర్పణ మాచరించి సత్యవ్రతుఁ డా
జలధి బ్రతికి మను వయ్యెను;
జలజాక్షునిఁ గొలువ కెందు సంపదఁ గలదే?

భావము:
పద్మనాభుడు అయిన విష్ణుదేవుడికి సత్యవ్రతుడు అర్ఘ్యం సమర్పించి ప్రళయ సముద్రంలో నుండి బయటపడి మనువు అయ్యాడు. ఆ పద్మాక్షుడిని విష్ణువును పూజించకుండా ఐశ్వర్యం ప్రాప్తించదు కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=91&padyam=738

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, April 7, 2017

మత్స్యావతార కథ - 25:


8-736-వ.
అయ్యవసరంబున.
8-737-ఆ.
వాసవారిఁ జంపి వాని చేఁ బడియున్న
వేదకోటి చిక్కు విచ్చి తెచ్చి
నిదుర మాని యున్న నీరజాసనునకు
నిచ్చెఁ గరుణతోడ నీశ్వరుండు.

భావము:
ఆ సమయంలో.... భగవంతుడు ఇంద్రుడి శత్రువు అయిన హయగ్రీవుణ్ణి చంపేసి, వాడు అపహరించిన వేదాల చెర విడిపించాడు. వాటిని తెచ్చి నిద్ర లేచిన బ్రహ్మదేవుడికి దయతో పూర్వకంగా అప్పగించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=91&padyam=737

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, April 6, 2017

మత్స్వావతార కథ - 24:


8-734-వ.
అంతం బ్రళయావసాన సమయంబున.
8-735-సీ.
ఎప్పుడు వేగు నం చెదురు చూచుచునుండు;
మునుల డెందంబులం ముదము నొందఁ,
దెలివితోఁ బ్రక్క నిద్రించు భారతి లేచి;
యోరపయ్యెదఁ జక్క నొత్తి కొనఁగ,
మలినమై పెనురేయి మ్రక్కిన తేజంబుఁ;
దొంటి చందంబునఁ దొంగలింపఁ,
బ్రాణుల సంచితభాగధేయంబులుఁ;
గన్నుల కొలకులఁ గానఁబడఁగ,
8-735.1-తే.
నవయవంబులుఁ గదలించి, యావులించి
నిదురఁ దెప్పఱి, మేల్కాంచి, నీల్గి, మలఁగి,
యొడలు విఱుచుచుఁ గనుఁగవ లుసుముకొనుచు.
ధాత గూర్చుండె సృష్టి సంధాత యగుచు.

భావము:
అలా హయగ్రీవాసురుణ్ణి సంహరించి వేదాలను ఉద్దరించే సమయానికి ప్రళయకాలం ముగిసింది. అలా ప్రళయకాలం ముగిస్తుండటంతో, ఎప్పుడు తెలవారుతుందో అనుకుంటూ ఎదురుచూస్తున్న మునుల హృదయాలు సంతోషించాయి. మైమరచి నిద్రిస్తున్న సరస్వతి లేచి బ్రహ్మ ప్రక్కన కూర్చుండి ఓరగా పైట సర్దుకుంది. ప్రళయకాలం మాసిపోయిన బ్రహ్మ తేజస్సు మరల మిసమిసలాడింది. ప్రాణులు సంపాదించిన పూర్వపుణ్యాలు ఆయన కడకన్నులకు అగుపించాయి. అప్పుడు నిద్రలోవున్న బ్రహ్మదేవుడు అవయవాలను కదిలించాడు. ఆవులించి మేల్కొని నిక్కి. ఒడలు విరుచుకుంటూ కన్నులు తుడుచుకున్నాడు. తిరిగి సృష్టి చేయడానికి కూర్చున్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=91&padyam=735

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday, April 5, 2017

మత్స్యావతార కథ - 23:


8-732-వ.
అని యిట్లు సత్యవ్రతుండు పలికిన సంతసించి మత్స్యరూపంబున మహాసముద్రంబున విహరించు హరి పురాణపురుషుం డగుటం జేసి సాంఖ్యయోగక్రియాసహితయగు పురాణసంహిత నుపదేశించె; నమ్మహారాజు ముని సమేతుండై భగవన్నిగదితంబై సనాతనంబగు బ్రహ్మస్వరూపంబు విని కృతార్థుం డయ్యె; నతం డిమ్మహాకల్పంబున వివస్వతుం డనం బరఁగిన సూర్యునకు శ్రాద్ధదేవుండన జన్మించి శ్రీహరి కృపావశంబున నేడవ మనువయ్యె; అంత నవ్విధంబున బెనురేయి నిండునంతకు సంచరించి జలచరాకారుండగు నారాయణుండు తన్నిశాంత సమయంబున.
8-733-మ.
ఉఱ కంబోనిధి రోసి వేదముల కుయ్యున్ దైన్యముం జూచి వేఁ
గఱు లల్లార్చి ముఖంబు సాఁచి బలువీఁకందోఁక సారించి మే
న్మెఱయన్ దౌడలు దీటి మీస లదరన్ మీనాకృతిన్ విష్ణుఁ డ
క్కఱటిం దాఁకి వధించె ముష్టిదళితగ్రావున్ హయగ్రీవునిన్.

భావము:
ఈ విధంగా సత్యవ్రతుడు ప్రార్ధన చేయగా విని, మత్స్య రూపంతో సముద్రంలో సంచరిస్తున్న మహావిష్ణువు సంతోషించాడు. ఆ పరమాత్ముడు సాంఖ్యయోగంతో కూడిన పురాతనమైన వేదభాగాన్ని అతనికి బోధించాడు. మునులతోపాటు సత్యవ్రతుడు భగవంతుడు చెప్పిన సనాతనమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని ధన్యుడైయ్యాడు. సత్యవ్రతుడు ఈ కల్పంలో వివస్వంతుడని పిలువబడే సూర్యునికి శ్రాద్ధదేవుడు అనే పేరుతో పుట్టి విష్ణువు దయవల్ల ఏడవమనువు అయ్యాడు. ప్రళయరాత్రి ముగిసి తెల్లవారే పర్యంతమూ ఆవిధంగా విష్ణువు మత్స్య స్వరూపంతో తిరుగుతున్నాడు. వేదాలు బాధతో మొరపెట్టుకోవడాన్ని ఆ కాళరాత్రి ముగిసే తెల్లవారుజామున విష్ణుమూర్తి కన్నాడు. వేగంగా రెక్కలు అల్లార్చి, నోరు తెరిచాడు; ఉత్సాహంతో తోక ఊగించాడు; మేను మెరపించాడు; దౌడలు చక్క జేసుకున్నాడు; మీసాలు కదిలించాడు; దుష్టుడూ మహాబలిష్టుడూ ఐన హయగ్రీవుణ్ణి హతమార్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=90&padyam=733

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

పోతన జయంతి - పోతన లో తాను

     2017 - మార్చి , 5వ తారీఖున కడప దగ్గరి ఒంటిమిట్టలో "*పోతన జయంతి*" కార్యక్రమం చేస్తున్నారట. అది సుసంపన్నంగానూ, బహుధా జయప్రదంగానూ జరగాలని మా నల్లనయ్య అనుగ్రహించు గాక.
ఒక మహానుభావుడు గొబ్బిట దుర్గా ప్రసాదు వారు పోతనగారు ఈ కాలంలోకి వస్తే తన గురించి తాను ఏమంటాడో ఊహించి, చక్కటి ఊహాచిత్రం వ్రాసారు..
మీ అందరికోసం దానిని మన తెలుగుభాగవతం.ఆర్గ్ లో ప్రచురించాను ఆస్వాదించండి.
అనుకోకుండా ఈ ప్రచురణ ఒంటిమిట్టవారి పోతన జయంతి కార్యక్రమ సమయానికే వచ్చింది.  అంతా నల్లనయ్య అల్లరి.....
http://telugubhagavatam.org/?Details&Branch=vyasamulu&Fruit=potana-lo-tanu

Tuesday, April 4, 2017

మత్స్యావతార కథ - 22:


8-730-ఆ.
నీరరాశిలోన నిజకర్మ బద్దమై
యుచితనిద్రఁ బొంది యున్న లోక
మే మహాత్ముచేత నెప్పటి మేల్కాంచు
నట్టి నీవు గురుఁడ వగుట మాకు.
8-731-క.
ఆలింపుము విన్నప మిదె
వేలుపు గమిఱేని నిన్ను వేఁడికొనియెదన్
నాలోని చిక్కు మానిచి
నీలోనికిఁ గొంచుఁ బొమ్ము నిఖిలాధీశా!

భావము:
కర్మఫలానికి లోబడి సముద్రంలో మునిగి కూరుకుపోయిన లోకాన్ని మేలుకొలిపే మహాత్ముడవు నీవు. నీవు దేవతలకు ప్రభువవు. అటువంటి నీవు మాకు గురువవు అయ్యావు. ఓ సర్వేశ్వరా! దేవధిదేవా! మా విన్నపాలు మన్నించమంటూ ప్రార్దిస్తున్నాను. నాలోని సంకటాన్ని తొలగించి నన్ను నీ లోకానికి చేర్చుకోమని వేడుకుంటున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=90&padyam=731

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, April 3, 2017

మత్స్యావతార కథ - 21:



8-728-క.
పెఱవాఁడు గురు డటంచును
గొఱగాని పదంబు చూపఁ గుజనుండగు నీ
నెఱ త్రోవ నడవ నేర్చిన
నఱమఱ లేనట్టిపదమునందు దయాబ్ధీ!



8-729-మ.
చెలివై చుట్టమవై మనస్థ్సితుఁడవై చిన్మూర్తివై యాత్మవై
వలనై కోర్కులపంటవై విభుఁడవై వర్తిల్లు నిన్నొల్లకే
పలువెంటంబడి లోక మక్కట; వృథా బద్దాశమై పోయెడిన్
నిలువన్ నేర్చునె హేమరాశిఁ గనియున్ నిర్భాగ్యుఁ డంభశ్శయా!

భావము:
దయా సముద్రుడవు అయిన శ్రీ మహావిష్ణువా! పనికిమాలినవాడిని గొప్ప వాడు అనుకొని దరిచేరేవారు చెడిపోతారు. నిన్ను నమ్ముకొని మంచిమార్గంలో నడవగలిగితే సందేహం లేకుండా అభేద రూపమైన ముక్తిని పొందుతాడు. నారాయణా! మత్య్యావతారా! నీవు స్నేహితుడుగా, బంధువుగా, జ్ఞానస్వరూపుడుగా, మానవుల మనస్సులోనే మసలుతావు. ఆత్మవై అండగా ఉంటావు. ప్రభువు అయి కోరికలు పండిస్తావు. అటువంటి నిన్ను ఆనుసరించకుండా, లోకం ఏవేవో అనవసరపు పేరాశలకు బంధీ అయిపోయి పరుగులు పెడుతుంది. అదృష్టహీనుడు బంగారు రాశి లభించినా దక్కించుకోలేడు కదా.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=90&padyam=729

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

అచ్యుతరత్న భాగవత మాల

: : చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం : :



శ్రీరామ
అచ్యుతరత్న భాగవత మాల

వ్యాస అవతరణం – నారద ఉద్భోదనం 
పారిక్షిత విరచితం – శుక ముఖ వినుతం 
సూత నోట వితరణం – శౌనకాది సంప్రశ్నం 
శ్రీరాముని ఆదేశం – పోతన ప్రసాదం 
అశ్వత్థామ దారుణం – కుంతి స్తుతించడం
తెలుగు భాగవతామృతం – సర్వదుఃఖ పరిహరం 
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం 
1
 
భీష్మస్తుతి తారణం - ఉత్తరగర్భ రక్షణం 
 కృష్ణనిర్యాణ శ్రవణం – పాండవ ప్రస్థానం 
 కలిపురుష నిగ్రహం – శృంగి శాపం 
భాగవతపురాణ వైభవం – సృష్టిక్రమ వివరణం 
అవతార వైభవం – వైకుంఠ వర్ణనం 
బ్రహ్మజన్మ ప్రకారం – సృష్టిభేదనం
తెలుగు భాగవతామృతం – సర్వదుఃఖ పరిహరం 
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం 
2
 
వరాహ అవతరణం – భూమ్యుద్ధరణం 
సనకాదుల శాపం – హిరణ్యాక్షవరాల వితరణం 
వరాహుని విజయం – కపిలుని సాంఖ్యం 
దక్షాధ్వర ధ్వంసం - ధృవస్థితి నొందడం 
వేన చరితం - భూమిని పితకడం 
 పురంజను కథనం – ప్రచేతసుల తపం
తెలుగు భాగవతామృతం – సర్వదుఃఖ పరిహరం 
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం 
3
 
ద్వీపవర్ష నిర్ణయం - ఋషభుని చరితం 
భరతుని తపం - జడభరతుని మోక్షం. 
భగణ విషయం - చతుర్దశ భువనం 
అజామిళ కథనం – దేవాసుర యుద్ధం 
నారాయణ కవచం – వృత్రాసుర వృత్తాంతం
తెలుగు భాగవతామృతం – సర్వదుఃఖ పరిహరం 
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం 
4
 
చిత్రకేతు చరితం – మరుద్గణ జన్మం 
ప్రహ్లాద చరితం – నారసింహ విజయం 
త్రిపురాసుర సంహారం – ప్రహ్లాద అజగరం
తెలుగు భాగవతామృతం – సర్వదుఃఖ పరిహరం 
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం 
5
 
గజేంద్ర మోక్షణం – సముద్ర మథనం 
గరళ భక్షణం – అమృత ఆహారం 
బలి ప్రహసనం – వామన విజయం 
త్రివిక్రమ స్పురణం – మత్స్యావతారం
తెలుగు భాగవతామృతం – సర్వదుఃఖ పరిహరం 
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం 
6
 
సూర్యవంశ వర్ణనం – అంబరీష కథనం 
భాగీరథ యత్నం – శ్రీరామ జయం 
చంద్రవంశ వర్ణనం – యయాతి శాపం 
భరతుని చరిత్రం – యదువంశ వృత్తాతం.
తెలుగు భాగవతామృతం – సర్వదుఃఖ పరిహరం 
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం 
7
 
దేవకీవసుదేవ వివాహం - ఆకాశవాణి పలకడం 
కన్నయ్య జననం - చెరసాల వీడడం 
యమునా తరణం – యశోదానందన స్ఫురణం 
పూతనాది హరణం - వెన్నదొంగ విహరణం 
 విశ్వ వీక్షణం - జంటమద్ది గూల్చడం
తెలుగు భాగవతామృతం – సర్వదుఃఖ పరిహరం 
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం 
8
 
చల్లులు కుడవడం - కాళీయమర్దనం 
వస్త్రాపహరణం - మానస చోరణం 
గిరి ధారణం- దావాగ్ని తాగడం 
 బృందా విహారం - రాసక్రీడా ఖేలనం 
అక్రూర పాలనం - త్రివిక్ర విస్ఫురణం 
కువలయపీడా హరణం – మల్ల విహారం 
కంసాది హరణం - దుష్ట ప్రహరణం 
తెలుగు భాగవతామృతం – సర్వదుఃఖ పరిహరం 
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం 
9

భ్రమరగీతల ఆలాపం - రుక్మిణీ కల్యాణం 
 ప్రద్యుమ్నాది ఉదయం- శ్యమంతక హరణం 
అష్టమహషీ పరిణయం - నరకాసుర వధం 
పదాఱువేల కన్యకా గ్రహణం - పారిజాత అపహరణం
తెలుగు భాగవతామృతం – సర్వదుఃఖ పరిహరం 
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం 
10
 
 ప్రద్యుమ్న కల్యాణం - ఉషాపరిణయం 
బాణాసుర గర్వమర్దనం - కాళిందీ భేదనం 
పౌండ్రకాది వధం – పదాఱువేల విహరణం 
 జరాసంధ వధం - శిశుపాల శిక్షణం 
పాండవ పాలనం - సాళ్వాదుల హరణం
కుచేల వరదం - యదువృష్ణి వంశం 
సుభద్రా పరిణయం - విప్రశోక హరణం
తెలుగు భాగవతామృతం – సర్వదుఃఖ పరిహరం 
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం 
11
ఉద్ధవునకు ఉపదేశం – శ్రీకృష్ణ నిర్యాణం 
పరీక్షిత్తు మోక్షం – మార్కండేయ రక్షణం 
అచ్యుతరత్న భాగవతమాల – గణనాధ్యాయ దర్శనం 
ఇది తెలుగు భాగవతామృతం – సర్వదుఃఖ పరిహరం 
భవభయ తారకం - శ్రీకృష్ణం వందే జగద్గురుం 
12

ఓం! ఓం! ఓం! 
 ఓం! శాంతిః! శాంతిః! శాంతిః! 
సర్వేజనాస్సుఖినోభవంతు!!
2017-
మార్చి, 31