Monday, February 20, 2017

వామన వైభవం - 122:

8-673-వ.
అదియునుం గాక.
8-674-ఆ.
సర్వగతుఁడ వయ్యు సమదర్శనుఁడ వయ్యు
నొకట విషమవృత్తి నుండు దరయ
నిచ్ఛలేనివారి కీవు భక్తులు గోరు
తలఁపు లిత్తు కల్పతరువు మాడ్కి.
8-675-వ.
అని విన్నవించుచున్న ప్రహ్లాదుం జూచి పరమ పురుషుం డిట్లనియె.

టీకా:
అదియునున్ = అంతే; కాక = కాకుండగ. సర్వగతుడవు = అన్నిటి యందునుండు వాడవు; సమదర్శనుడవు = సర్వులఎడల సమదృష్టి కలవాడవు; అయ్యున్ = అయినప్పటికిని; ఒకటన్ = ఒక్కొక్కసారి; విషమవృత్తిన్ = పక్షపాతబుద్ధితో; ఉండుదు = ఉండెదవు; అరయ = తరచిచూసినచో; ఇచ్చ = భక్తి; లేని = లేనట్టి; వారి = వారి; కిన్ = కి; ఈవు = వరములీయవు; భక్తులు = భక్తులు; కోరు = కోరెడి; తలపుల్ = కోరికలను; ఇత్తు = ప్రసాదించెదవు; కల్పతరువు = కల్పతరువు; మాడ్కిన్ = వలె. అని = అని; విన్నవించుచున్న = మనవిచేసెడి; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; చూచి = చూసి; పరమపురుషుండు = నారాయణుడు {పరమపురుషుడు - అత్యున్నతమైనవ్యక్తి, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
అంతేకాకుండా. నీవు అన్నింటిలోనూ వ్యాపించి ఉంటావు. అందరిని సమానంగా చూస్తావు. అయినప్పటికీ ఒక్కొక్కసారి పక్షపాతాన్ని చూపుతావు. భక్తిలేనివారి కోరికలు తీర్చవు. కల్పవృక్షం వలె భక్తులైనవారి కోర్కెలు నెరవేర్చుతావు. ” ఇలా మనవిచేసిన ప్రహ్లాదుడితో పరమాత్ముడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=84&Padyam=674

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: