Sunday, February 19, 2017

వామన వైభవం - 121:

8-672-సీ.
చతురాననుఁడు నీ ప్రసాదంబు గానఁడు;
శర్వుఁడీ లక్ష్ముల జాడఁ బొందఁ,
డన్యుల కెక్కడి? దసురులకును మాకు;
బ్రహ్మాదిపూజితపదుఁడ వయిన
దుర్లభుండవు నీవు వైతి;
పద్మజాదులు భవత్పాదపద్మ
మకరంద సేవన మహిమ నైశ్వర్యంబు;
లందిరి కాక యే మల్పమతుల
8-672.1-తే.
మధిక దుర్యోనులము కుత్సితాత్మకులము
నీ కృపాదృష్టిమార్గంబు నెలవు చేర
నేమి తప మాచరించితి మెన్నఁగలమె?
మమ్ముఁ గాచుట చిత్రంబు మంగళాత్మ!

టీకా:
చతురాననుడు = బ్రహదేవుడు {చతురాననడు - నాలుగుమోములవాడు, బ్రహ్మ}; నీ = నీ యొక్క; ప్రసాదంబున్ = అనుగ్రహమును; కానడు = ఇంతగాపొందలేడు; శర్వుడున్ = ఈశ్వరుడు {శర్వుడు - ప్రళయమున భూతలములను హింసించువాడు, శంకరుడు}; ఈ = ఇంతటి; లక్ష్ములన్ = ఐశ్వర్యములను; పొందడు = పొందలేడు; అన్యుల్ = ఇతరుల; కున్ = కు; ఎక్కడిది = ఏక్కడదొరుకుతుంది; అసురుల = రాక్షసుల; కును = కు; మా = మా; కున్ = కు; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మున్నగువారిచేత; పూజితుడవు = పూజింపబడువాడవు; అయిన = ఐన; దుర్లభుండవు = దరిచేరసాధ్యంకానివాడవు; నీవు = నీవు; దుర్గ = కోటను; పాలుడవు = కాపాడువాడవు; ఐతి = అయితివి; పద్మజ = బ్రహ్మదేవుడు; ఆదులు = మున్నగువారు; భవత్ = నీ యొక్క; పాద = పాదములు యనెడి; పద్మ = పద్మముల; మకరంద = మకరందమును; సేవన = సేవించిన; మహిమన్ = మహిమవలన; ఐశ్వర్యంబులున్ = ఐశ్వర్యములను; అందిరి = అందుకొనిరి; కాక = అలా అయ్యుండగ; ఏము = మేము; అల్పమతులము = అల్పులము; అధిక = మిక్కిలి.  దుర్యోనులము = నీచజన్ములు కలవారము; కుత్సిత = కుత్సితమైన; ఆత్మకులము = బుద్ధికలవారము; నీ = నీ యొక్క; కృపాదృష్టి = కరుణాకటాక్షపు; మార్గంబున్ = దారిలో; నెలవు = ఉండుటను; చేరన్ = చేరుటకు; ఏమి = ఎట్టి; తపమున్ = తపస్సును; ఆచరించితిమి = చేసితిమో; ఎన్నగలమె = తెలియగలమా లేము; మమ్మున్ = మమ్మలను; కాచుట = కాపాడుట; చిత్రంబు = ఆశ్చర్యకరవిషయము; మంగళాత్మా = మంగళస్వరూపా.

భావము:
“ఓ మంగళస్వరూపా బ్రహ్మదేవుడు సైతం ఇంతగా నీ అనుగ్రహాన్ని పొందలేదు. శివుడు కూడా ఇంతగా ఆదరాభిమానాలు పొందలేదు. ఇంక ఇతరులనగా ఎంత. బ్రహ్మాదేవుదు మున్నగువారిచేత నీవు పూజింపబడువాడవు. నిన్ను దరిజేరడానికి ఎవరికీ సాద్యం కాదు. అటువంటి నీవు మారాక్షసులకు దుర్గరక్షకుడవు అయ్యావు. నీ పాదపద్మాల మకరందాన్ని సేవించిన మహిమవల్ల బ్రహ్మాదేవుడు మున్నగువారు ఐశ్వర్యాన్ని పొందారు. కానీ, మేము చాలా అల్పులము. నీచజన్మ కలవారము. ఏమి తపస్సు చేయడంవల్ల మామీద నీ కరుణాకటాక్షం కురిసిందో ఊహించలేము. నీవు మమ్ములను కాపాడడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=84&Padyam=672

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: