Tuesday, February 28, 2017

కాళియమర్దనము – కచబంధంబులు వీడ


:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:


10.1-672-మ.
బంధంబులు వీడ భూషణము లాకంపింపఁ గౌఁదీవియల్
కుయుగ్మంబుల వ్రేగునం గదలఁ బైకొంగుల్ వడిన్ జాఱఁగాఁ
బ్రచురభ్రాంతిఁ గలంగి ముందట రుదద్బాలావళిం గొంచు స్రు
క్కుచుభక్తింజని కాంచి రా గుణమణిన్ గోపాలచూడామణిన్.

టీకా:
కచబంధంబలు = జుట్టుముళ్ళు; వీడన్ = విడిపోతుండగ; భూషణములు = ఆభరణములు; ఆకంపింపన్ = అంతటనుచలించగా; కౌన్ = నడుములు అనెడి; తీవియల్ = లతలు; కుచ = స్తనములు; యుగ్మంబులు = జంటల; వ్రేగునన్ = బరువునకు; కదలన్ = చలింపగా; పైకొంగులు = పైటకొంగులు; వడిన్ = వేగముచేత; జార = తొలగుచుండగా; ప్రచుర = అధికమైన; భ్రాంతిన్ = తొట్రుపాటుచేత; కలంగి = కలతనొంది; ముందట = ఎదురుగా; రుదత్ = ఏడ్చుచున్న; బాల = పిల్లల; ఆవళిన్ = సమూహమును; కొంచున్ = తీసుకొనుచు; స్రుక్కుచు = నొచ్చుకొనుచు; భక్తిన్ = భక్తితో; చని = వెళ్ళి; కాంచిరి = దర్శనముచేసికొనిరి; గుణమణిన్ = మంచిగుణములుకలవాని; గోపాల = యాదవులలో; చూడామణిన్ = శిరోమణివంటివానిని.

భావము:
కాళియుని భార్యల కొప్పుముడులు జారిపోతున్నాయి. వారి ఆభరణాలు చెదిరిపోతున్నాయి. స్తనాల బరువుకు తీగలాంటి నడుములు అల్లాడిపోతున్నాయి. పైటకొంగులు జారి పోతున్నాయి. దిక్కు తోచని భ్రాంతితో కలవర పడిపోతున్నారు. గొల్లున ఏడుస్తున్న పిల్లలను ముందు పెట్టుకొని సుగుణాలశ్రేష్ఠుడు గోపాలశేఖరుడు అయిన కృష్ణుని వారు భక్తిపూర్వకంగా దర్శనం చేసుకొన్నారు.


త్రిపురాసుర సంహారం - 4:

7-392-వ.
ఇట్లు రక్కసులు దన వెనుకఁ జొచ్చిన మాయానిలయుండును దుర్ణయుండును నైన మయుండు దన విద్యాబలంబున నయోరజత సువర్ణమయంబులై యెవ్వరికిని లక్షింపరాని గమనాగమనంబులును వితర్కింపరాని కర్కశపరిచ్ఛదంబులును గలిగిన త్రిపురంబుల నిర్మించి యిచ్చిన, నక్తంచరు లందఱు నందుంబ్రవేశించి కామసంచారులై పూర్వవైరంబుఁ దలంచి సనాయకంబు లయిన లోకంబుల నస్తోకంబయిన నిజబలాతిరేకంబున శోకంబు నొందించిన.

టీకా:
ఇట్లు = ఈ విధముగ; రక్కసులు = రాక్షసులు; తన = తన యొక్క; వెనుకన్ = ఆశ్రయమునకు; చొచ్చిన = చేరగా; మాయా = మాయలకు; నిలయుండును = నివాసమైనవాడు; దుర్ణయుండునున్ = చెడ్డనీతిగలవాడు; ఐన = అయిన; మయుండు = మయుడు; తన = తనయొక్క; విద్యా = యోగవిద్య యొక్క; బలంబునన్ = శక్తిచేత; అయస్ = ఇనుము; రజత = వెండి; సువర్ణ = బంగారములచే; మయంబులు = చేయబడినవి; ఐ = అయ్యి; ఎవ్వరి = ఎవరి; కిన్ = కి యైనను; లక్షింప = ఛేదింప; రాని = శక్యముకాని; గమనాగమనంబులు = రాకపోకలుగలది; వితర్కింప = ఊహించుటకు; రాని = శక్యముకాని; కర్కశ = కఠినములైన; పరిచ్ఛదంబులును = రక్షా కవచములు,పరిజనము; కలిగిన = ఉన్నట్టి; త్రి = మూడు (3); పురంబులన్ = పురములను; నిర్మించి = తయారుచేసి; ఇచ్చినన్ = ఇవ్వగా; నక్తంచరులు = రాక్షసులు {నక్తంచరులు - నక్తన్ (రాత్రులందు) చరులు (తిరుగువారు), రాక్షసులు}; అందఱున్ = అందరు; అందున్ = దానిలో; ప్రవేశించి = చేరి; కామసంచారులు = యధేచ్ఛగా తిరుగువారు; ఐ = అయ్యి; పూర్వ = వెనుకటి; వైరంబు = శత్రుత్వము; తలంచి = తలచుకొని; సనాయకంబులు = లోకపాలురతోకూడినవి; అయిన = ఐన; లోకంబులన్ = లోకములను; అస్తోకంబు = అధికము; అయిన = ఐన; నిజ = తమ; బల = బలము యొక్క; అతిరేకంబునన్ = అతిశయముచేత; శోకంబున్ = దుఃఖము; ఒందించినన్ = చెందించగా.

భావము:
అలా రాకాసి మూకలు తన చెంతచేరి, నీవే దిక్కు అనే సరికి ఆ మాయలమారీ, దుర్మార్గుడూ అయిన మయుడు తన యోగబలంతో ఇనుము, వెండి, బంగారాలతో మూడు పురాలను సిద్దం చేశాడు. అవి రాకపోకలు తెలియరా నటువంటివీ; రహస్య మార్గాలూ, రక్షణగృహాలూ కలిగినట్టివి. తనను శరణువేడిన రాత్రించరులైన రక్కసులకు ఆ త్రిపురాలను ఇచ్చాడు. వారందరూ ఆ త్రిపురాలలో ప్రవేశించి యథేచ్ఛగా తిరుగసాగారు. తమ వెనుకటి శత్రుత్వం గుర్తుంచుకుని భయంకరమైన తమ పరాక్రమంతో లోకాలను, లోకనాయకులను దుఃఖాలపాలు చేయసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=392

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, February 27, 2017

కాళియుని సతుల కృష్ణస్తోత్రం - మంత్ర పూరితం

ముఖపుస్తకం@Usha Krishna Swamy:- కాళియ మర్దన ఘట్టంలోని ఈ నాగ సతుల ప్రార్థన పురుషసూక్తంతో సమానంగా ఉన్నది. ఎంత ఉపనిషత్ సార మున్నదో! నాకు వ్యథ కలిగినప్పుడు ఈ భాగాన్ని నేను చదువుతూ ఉంటాను, శ్రీకృష్ణ భగవాన్ చేసిన వారి ప్రార్థన స్వతసిద్ధంగా ధ్యాన, వేదసార సమృద్ధం; ఎంతో ధీశక్తి, స్వాంతనలను రూఢిగా ఇస్తుంది! 

త్రిపురాసుర సంహారం - 3:

7-391-క.
చక్రాయుధ బలయుతు లగు
శక్రాదుల కోహటించి శ్రమమున నసురుల్
సక్రోధంబున నరిగిర
విక్రమములు మాని మయుని వెనుకకు నధిపా!

టీకా:
చక్రాయుధ = విష్ణుమూర్తి యొక్క; బల = ప్రాపు, అండ; యుతులు = కలిగినవారు; అగు = అయిన; శక్ర = ఇంద్రుడు {శక్రుడు - దుష్టులను శిక్షించుట యందు శక్తిగలవాడు, ఇంద్రుడు}; ఆదులకున్ = మొదలగువారికి; ఓహటించి = ఓడి; శ్రమమునన్ = కష్టములో; అసురుల్ = రాక్షసులు; సక్రోధంబునన్ = కోపముతోటి; అరిగిరి = వెళ్ళిరి; విక్రమములు = ఎదుర్కొనుటలు; మాని = వదలి; మయుని = మయుని; వెనుక = చాటున, ప్రాపున; కున్ = కు; అధిప = రాజా.

భావము:
ఒకసారి చక్రము ఆయుధముగా కలిగిన శ్రీమహావిష్ణువు అండతో విజృంభిస్తున్న ఇంద్రుడు మొదలైనవారి ఉద్ధృతికి తట్టుకోలేక దానవులు ఓడి భయపడిపోయారు. దానవులకు కోపం వలన మనస్సులు మండిపోయాయి, కానీ దేవతలను ఎదుర్కోలేకపోయారు. వెళ్ళి మయాసురుని వెనుక చేరారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=391

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

కాళియమర్దనము – ఈతఁడు సర్వచరాచర

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:


10.1-670-క.
తఁడు సర్వచరాచర
భూతేశుండైన పరమపురుషుఁడు సేవా
ప్రీతుఁడు శ్రీహరి యగు" నని
భీతిన్ శరణంబు నొందె బిట్టలసి నృపా!
10.1-671-వ.
ఇట్లు క్రూరంబులయిన హరిచరణ ప్రహరంబులం బడగ లెడసి నొచ్చి చచ్చినక్రియం బడియున్న పతింజూచి నాగకాంతలు దురంతంబయిన చింతాభరంబున నివ్వటిల్లెడు నెవ్వగల నొల్లొంబోయి పల్లటిల్లిన యుల్లంబుల.

టీకా:
ఈతడు = ఇతను; సర్వ = సమస్తమైన; చర = కదలగల; అచర = కదలలేని; భూత = జీవులకు; ఈశుండు = ప్రభువు; ఐన = అగు; పరమ = అత్యుత్తమ; యోగి = యోగియైన; పురుషుడు = వాడు; సేవా = భక్తులయందు; ప్రీతుడు = ప్రీతిగలవాడు; శ్రీహరి = విష్ణుమూర్తి {హరి - సుషుప్తి మరియు ప్రళయ కాలములందు సర్వమును తన యందు లయము చేసుకొని సుఖరూపమున నుండువాడు, విష్ణువు}; అగును = అగును; అని = అని; భీతిన్ = భయముతో; శరణంబు = శరణు; ఒందెన్ = చొచ్చెను; బిట్టు = మిక్కిలి; అలసి = అలసిపోయి; నృపా = రాజా.
ఇట్లు = ఈ విధముగా; క్రూరంబులు = కఠినమైనవి; అయిన = ఐన; హరి = కృష్ణుని; చరణ = పాదముల; ప్రహరంబులన్ = తాకిడిచే; పడగలు = పడగలు; ఎడసి = భగ్నమై; నొచ్చి = నొప్పిని పొందినవాడై; చచ్చిన = చనిపోయినవాని; క్రియన్ = వలె; పడియున్న = పడి ఉన్నట్టి; పతిన్ = భర్తను; చూచి = చూసి; నాగకాంతలు = ఆ కాళియుని భార్యలు; దురంతంబు = అంతులేనిది; అయిన = ఐనట్టి; చింత = విచారము యొక్క; భరంబునన్ = అతిశయముచేత; నెఱ = మిక్కిలి; వగలన్ = దుఃఖముతో; ఒల్లంబోయి = తపించి; పల్లటిల్లిన = కలతపడిన; ఉల్లంబుల = మనసులతో.

భావము:
విష్ణుమూర్తి సమస్త చరాచర జీవులకు ప్రభువు, పరమ పురుషుడు, పరమయోగి, భక్తితోసేవిస్తే సంతోషించేవాడు. ఇంతటి ఈ పిల్లాడు ఆ శ్రీహరే అయ్యి ఉంటాడు.” అనుకున్నాడు కాళియుడు. రాజా! మిక్కలి భయంతో, అలసటతో అతడు కృష్ణుని శరణు కోరాడు.
ఈ విధంగా తాండవకృష్ణుడి దారుణమైన పాదాలతాకిడికి పడగలన్ని చితికిపోయి, చచ్చిపోయినవాడిలా పడి ఉన్న తమ భర్త కాళియుని చూసి, అతని భార్యలు ఎంతో శోకించారు. భరించలేని ఆ శోకభారంతో వారి మనస్సులు కలవరపడ్డాయి.

Sunday, February 26, 2017

కాళియమర్దనము – వేలుపులైన

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:
10.1-668-వ.
ఇట్లు దుష్టజన దండధరావతారుండైన హరి వడి గలిగిన పడగల మీఁదఁ దాండవంబు సలుప, బెండుపడి యొండొండ ముఖంబుల రక్తమాంసంబు లుమియుచుఁ గన్నుల విషంబు గ్రక్కుచు నుక్కుచెడి చిక్కి దిక్కులుచూచుచుఁ గంఠగతప్రాణుండై ఫణీంద్రుండు తన మనంబున.
10.1-669-ఉ.
"వేలుపులైన లావుచెడి వేదనఁ బొందుచు నా విషానల
జ్వాలు సోఁకినంతటన త్తురు; నేడిది యేమి చోద్య? మా
భీవిషాగ్ని హేతిచయపీడకు నోర్చియుఁ గ్రమ్మఱంగ నీ
బాలుఁడు మత్ఫణాశతము గ్నముగా వెసఁ ద్రొక్కి యాడెడున్.
టీకా:
ఇట్లు = ఇలాగున; దుష్ట = చెడ్డ; జన = వారి యెడల; దండధర = యముని; అవతారుండు = రూపుదాల్చినవాడు; ఐన = అయిన; హరి = కృష్ణుడు; వడి = బిగువు; కలిగిన = ఉన్న; పడగల = పాముపడగల; మీదన్ = పైన; తాండవంబు = ఉధృతమైన నాట్యమును; సలుపన్ = చేయుచుండగా; బెండుపడి = నిస్సారుడై; ఒండొండ = క్రమముగా; ముఖంబులన్ = ముఖములనుండి; రక్త = రక్తము; మాంసంబులు = మాంసములు; ఉమియుచున్ = కక్కుతు; కన్నులన్ = కన్నులనుండి; విషంబున్ = విషమును; క్రక్కుచున్ = కక్కుతు; ఉక్కుచెడి = బలహీనపడి; చిక్కి = కృశించి; దిక్కులు = ఇటునటు; చూచుచున్ = చూస్తు; కంఠ = కుత్తుకయందు; గత = ఉన్న; ప్రాణుండు = ప్రాణములు కలవాడు; ఐ = అయ్యి; ఫణీంద్రుడు = సర్పరాజు; తన = తన యొక్క; మనంబున = మనసులో.
వేలుపులు = దేవతలు; ఐనన్ = అయినను; లావు = శక్తి; చెడి = నశించి; వేదనన్ = సంకటమును; పొందుచున్ = పొందుచు; నా = నా యొక్క; విష = విషము అనెడి; అనల = అగని; జ్వాలలు = మంటలు; సోకినన్ = తాకిన; అంతటనన్ = మాత్రముచేతనే; చత్తురు = చనిపోయెదరు; నేడు = ఇవాళ; ఇది = ఇది; ఏమి = ఏమిటి; చోద్యము = విచిత్రము; ఆభీల = భయంకరమైన; విష = విషమనెడి; అగ్ని = అగ్నిచేత; హేతి = దెబ్బల; చయ = అనేకము యొక్క; పీడ = బాధ; కున్ = కు; ఓర్చియున్ = తట్టుకొనుటేకాక; క్రమ్మఱంగ = మరల; ఈ = ఈ యొక్క; బాలుడు = చిన్నపిల్లవాడు; మత్ = నా యొక్క; ఫణా = పడగల; శతమున్ = నూటిని, సమూహమును; భగ్నము = నలిగిపోయినవి; కాన్ = అగునట్లు; వెసన్ = వేగముగా; త్రొక్కి = తొక్కి; ఆడెడున్ = నృత్యముచేస్తున్నాడు.
భావము:
ఈ విధంగా దుర్మార్గుల పాలిటి కాలయముడైన కృష్ణుడు కాళియుడి బిగువైన పడగలపై ప్రచండ తాండవం చేసాడు; దానితో కాళియుడు బలహీనుడైపోయాడు. ఒక్కొక్క నోటినుండి రక్తమాంసాలు కక్కుతున్నాడు. కళ్ళల్లోంచి విషం ఉబుకుతోంది. పౌరుషం చెడిపోయింది. బాగా నీరసించిపోయాడు. ప్రాణాలు గొంతులోకి వెళ్ళుకొచ్చేశాయి. దిక్కులు చూస్తు కాళియుడు తనలో తాను ఇలా అనుకొన్నాడు.
 “నా విషాగ్ని జ్వాలలు సోకితే చాలు, దేవతలైనా సరే శక్తి నశించిపోయి గిలగిలకొట్టుకొని చచ్చిపోతారు. అలాంటిది ఇవేళ ఈ బాలుడు క్రూరమైన నావిషాగ్ని జ్వాలల తాకిడి ధాటికి తట్టుకొన్నాడు. పైగా నా నూరు పడగలను చితకతొక్కేస్తూ నాట్యంచేసేస్తున్నాడు కూడ. ఇదేమి విచిత్రమో?