Wednesday, January 18, 2017

వామన వైభవం - 89:

8-623-మ.
రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

టీకా:
రవిబింబంబున్ = సూర్యబింబము; ఉపమింపన్ = సరిపోల్చుటకు; పాత్రము = తగినది; అగు = అయిన; ఛత్రంబు = గొడుగు; ఐ = వలెనయ్యి; శిరోరత్నము = శిరసుపైని ఆభరణము; ఐ = వలెనయ్యి; శ్రవణ = చెవుల; అలంకృతి = అలంకారము; ఐ = వలెనయ్యి; గళ = కంఠమునందలి; ఆభరణము = ఆభరణము; ఐ = వలెనయ్యి; సౌవర్ణ = బంగారపు; కేయూరము = భుజకీర్తి; ఐ = వలెనయ్యి; ఛవిమత్ = మెరిసెడి; కంకణము = చేతికంకణము; ఐ = వలెనయ్యి; కటిస్థలిన్ = నడుమున; ఉదంచత్ = వేయబడిన; గంట = గంట; ఐ = వలెనయ్యి; నూపుర = కాలిఅందెల; ప్రవరంబు = పేరు; ఐ = వలెనయ్యి; పదపీఠంబు = పాదపీఠము; ఐ = అయ్యి; వటుడు = బ్రహ్మచారి; తాన్ = అతను; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; నిండుచోన్ = అంతవ్యాపించునప్పుడు.

భావము:
వామనుడు బ్రహ్మాండ మంతా నిండిపోతుంటే, మింట నుండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నాడట. అది ఎలాగంటే ఆ సమయంలో క్రమక్రమంగా త్రివిక్రమునికి గొడుగులా, తర్వాత శిరోమణిలా, తర్వాత మకరకుండలంలా, పిమ్మట కంఠాభరణంలా, ఆ పిమ్మట బంగారు భుజకీర్తులులా, ఆ పిమ్మట కాంతులీనే కంకణంలా, అపైన మొలలోని గంటలా, అనంతరం మేలైన కాలిఅందెలా, చివరికి పాదపీఠంలా పోల్చడానికి తగి ఉన్నాడట. 
అందంగా కళ్ళకు కట్టినట్లు అలవోకగా చెప్పడంలో సిద్దహస్తుడు అయిన మన పోతనామాత్యుల వారి త్రివిక్రమావతరణ అత్యద్భుతం తెలుగు సాహిత్యానికే మకుటాయమానమైన పద్యాలుగా ఎన్నదగ్గవి. ఉపమానం అని చెప్తు ఉపమానానికి గొప్పదనం అబ్బేలా చేయటం సామాన్య విషయం కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=623

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: