Tuesday, January 17, 2017

వామన వైభవం - 88:

8-622-శా.
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

టీకా:
ఇంతింత = కొంచముమరికొంచము; ఐ = అయ్యి; వటుడు = బ్రహ్మచారి; ఇంత = మరికొంచము; ఐ = అయ్యి; మఱియున్ = ఇంకను; తాను = అతను; ఇంత = ఇంకొచము; ఐ = అయ్యి; నభోవీథి = ఆకాశము; పైన్ = మీద; అంత = అంత; ఐ = అయ్యి; తోయద = మేఘ; మండల = మండలమునకు; అగ్రమున్ = పైకొస; కున్ = కు; అల్లంత = ఆవతలంత; ఐ = అయ్యి; ప్రభారాశి = వెలుగులరాశి, పాలపుంత; పైన్ = కంటెఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; అంత = అంత; ఐ = అయ్యి; ధ్రువుని = ధ్రువుడికంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; మహర్వాటిన్ = మహర్లోకముకంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; సత్యపద = బ్రహ్మలోకముకంటె; ఉన్నతుండు = ఎక్కువ ఎత్తు కలవాడు; అగుచున్ = అగుచు; బ్రహ్మాండ = బ్రహ్మాండము; అంత = చివరవరకు; సంవర్ధి = నిండాపెరిగినవాడు; ఐ = అయ్యి.

భావము:
బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే ఇంత పొట్టి బ్రహ్మచారీ, కొంచం కొంచం ఎదగటం మొదలెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు; మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. చూడండి అప్పుడే మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79&Padyam=622

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: