Thursday, January 12, 2017

వామన వైభవం - 83:

8-611-మ.
అమరారాతి కరాక్షతోజ్ఝిత పవిత్రాంభః కణశ్రేణికిం
గమలాధీశ్వరుఁ డొడ్డె ఖండిత దివౌకస్స్వామిజిన్మస్తముం
గమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకుచోపాస్తమున్
విమలశ్రీ కుచశాత చూచుక తటీవిన్యస్తమున్ హస్తమున్.
8-612-క.
మునిజన నియమాధారను
జనితాసుర యువతి నేత్రజలకణ ధారన్
దనుజేంద్ర నిరాధారను
వనజాక్షుఁడు గొనియె బలివివర్జితధారన్.

టీకా:
అమరారాతి = బలిచక్రవర్తి {అమరారాతి - దేవతల శత్రువు (బలి)}; కరా = చేతిలోని; అక్షత = అక్షతలతో; ఉజ్జిత = విడువబడిన; పవిత్ర = పవిత్రమైన; అంభస్ = నీటి; కణ = బిందువుల; శ్రేణి = వరుస; కిన్ = కు; కమలాధీశుడు = విష్ణువు {కమలాధీశుడు - కమలా (లక్ష్మీదేవి) అధీశుడు (భర్త), విష్ణువు}; ఒడ్డె = పట్టెను; ఖండిత = తెగగొట్టబడిన; దివౌకస్స్వామి = ఇంద్రుని {దివౌకస్స్వామి - దివౌకస్ (స్వర్గవాసుల) స్వామి (ప్రభువు), ఇంద్రుడు}; జిత్ = జయించువాని; మస్తమున్ = తల కలదానిని; కమల = లక్ష్మీదేవిని; ఆకర్షణ = పిలుచుటలో; సుప్రశస్తమున్ = మిక్కిలి ప్రసిద్దమైనదానిని; రమాకాంత = లక్ష్మీదేవి; కుచ = స్తనములమీద; అపాస్తమున్ = మర్యాదలుపొందుదానిని; విమల = నిర్మలమైన; శ్రీ = లక్ష్మీదేవి; కుచ = స్తనముల; చూచుక = అగ్రముల; తటీ = ప్రదేశమున; విన్యస్తమున్ = కదలెడిదానిని; హస్తమున్ = చేతిని.  ముని = మునుల; జన = సమూహముయొక్క; నియమ = నిష్ఠలకు; ఆధారను = ఆధారభూతమైన దానిని; జనిత = కలిగించబడిన; అసుర = రాక్షస; యువతి = స్త్రీల; నేత్రజల = కన్నీటి; కణ = బిందువుల; ధారన్ = ధారకలదానిని; దనుజేంద్ర = బలిచక్రవర్తిని; నిరాధారను = నిరాధారుని చేసెడిదానిని; వనజాక్షుడు = విష్ణువు; కొనియె = గ్రహించెను; బలి = బలిచేత; వివర్జిత = విడువబడిన; ధారన్ = దానజలధారను.

భావము:
ఆటంకం లేకుండా దైవవిద్వేషి బలిచక్రవర్తి చేతిలోని అక్షింతలతో పవిత్రమైన జలం ధారపోసాడు. పవిత్రమైన ఆ నీటిబిందువులకు ఆ లక్ష్మీపతి వామనుడు తన చెయ్యి ఒడ్డాడు. ఆ చెయ్యి ఎలాంటిది అంటే. రాక్షసుల శిరస్సులు ఖండించునది. లక్ష్మీదేవిని ఆకర్షించడంలో మేలైనది. లక్ష్మీదేవి శిరోజాలచే సేవించబడునది. నిర్మలమైన ఆమె కుచాగ్రముల మీద మర్యాదలు అనుభవించేది.
                                                బలిచక్రవర్తి అందించిన దానధారను పద్మాలవంటి కన్నులు గలస్వామి వామనుడు స్వీకరించాడు. ఆ జలధార మునుల నియమాలకు ఆధారమైనది. రాక్షసస్త్రీలను కన్నీటి పాలుచేసేది. రాక్షసరాజులను నిరాధారులుగా మార్చేది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=611

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: