Sunday, January 8, 2017

వామన వైభవం - 79:

8-603-వ.
అనిన విని
8-604-మ.
బలి దైత్యేంద్ర కరద్వయీ కృత జలప్రక్షాళనవ్యాప్తికిన్
జలజాతాక్షుఁడు చాఁచె యోగి సుమనస్సంప్రార్థితశ్రీదముం
గలితానమ్ర రమా లలాటపదవీ కస్తూరికా శాదమున్
నలినామోదము రత్ననూపురిత నానావేదముం బాదమున్.

టీకా:
అనిన = అనగా; విని = విని.  బలిదైత్యేంద్ర = బలిచక్రవర్తి; కర = చేతుల; ద్వయీ = రెంటి (2) చేతను; కృత = చేయబడెడి; జల = నీటితో; ప్రక్షాళన = కడుగుట; వ్యాప్తికిన్ = నడచుటకు; జలజాతాక్షుడు = విష్ణువు {జలజాతాక్షుడు - జలజాత (పద్మములవంటి) అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; చాచెన్ = చాచెను; యోగి = యోగులయొక్క; సుమనస్ = మంచి మనసులచే; సంప్రార్థిత = చక్కగా సేవింపబడెడి; శ్రీ = శుభములను; దమున్ = కలిగించెడిది; కలిత = కలిగిన; ఆనమ్ర = వంగినట్టి; రమా = లక్ష్మీదేవి; లలాట = నుదుట; పదవీ = ఉన్న; కస్తూరికా = కస్తూరితిలకము; శాదము = పంకముకలది; నలినా = పద్మముల; ఆమోదమున్ = పరిమళము కలది; రత్న = మణులుపొదిగిన; నూపురిత = అందెలు కలగిన; నానా = సమస్త; వేదమున్ = వేదములునునైనది; పాదమున్ = పాదమును.

భావము:
బలిచక్రవర్తి పిలుపును విని.... బలిచక్రవర్తి తన రెండు చేతులతోనూ కడగడానికి అనువుగా వామనుడు తన కుడిపాదాన్ని సాచాడు. ఆ పాదం యోగులూ, దేవతలూ కోరుకొనే సంపదలను సమకూర్చునది; భక్తితో వంగిన లక్ష్మిదేవి నొసటి మీది కస్తూరి కుంకుమతో కూడినది; పద్మాల పరిమళం గుబాళించునది; ఆ పాదం వేదాలరాశి అనే మణిమంజీరాలు అలంకరించుకున్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=78&Padyam=604

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: