Thursday, December 15, 2016

వామన వైభవం - 55:

8-559-క.
"పగవాఁడు మడియ నోపును
దెగడేనియు నెదురుపడఁడె? దేహధరులకుం
దెగిన యెడఁ బగఱ మీఁదనుఁ
బగఁ గొనఁ దగ ద నుచు నుడిగెఁ బ్రాభవశక్తిన్. "
8-560-వ.
అతండు మీ ప్రపితామహుం; డతని గుణంబు లనేకంబులు గలవు; అవి యట్లుండనిమ్ము.

టీకా:
పగవాడు = శత్రువు; మడియన్ = మరణించియుండి; ఓపున్ = ఉండవచ్చును; తెగడు = మరణించక ఉన్నవాడు; ఏనియున్ = అయినచో; ఎదురుపడడె = ఎదుర్కొనెడివాడేకదా; దేహధరుల్ = జీవుల; కున్ = కు; తెగిన = మరణించిన; ఎడన్ = తరువాత; పగఱ = శత్రువుల; మీదనున్ = పైన; పగగొన = పగబూనుట; తగదు = యుక్తముకాదు; అనుచునున్ = అనుచు; ఉడిగెన్ = విడిచెను; ప్రాభవశక్తిన్ = దండయాత్రను;


                                                      అతండు = అటువంటివాడు; మీ = మీ యొక్క; ప్రపితామహుండు = ముత్తాత; అతని = అతని యొక్క; గుణంబుల్ = గొప్పగుణములు; అనేకంబులు = చాలా; కలవు = ఉన్నాయి; అవి = వానిని; అట్లు = అలా; ఉండనిమ్ము = ఉండనియ్యి.

భావము:
నా శత్రువు మరణించి ఉండవచ్చు. మరణించకుండా ఉండి ఉంటే నన్ను ఎదుర్కొనేవాడే కదా. మరణించిన పగవారిపై పగబూనడం తగదు. ఈ విధంగా అనుకొని దండయాత్ర ఆపేసాడు. అలాంటి మీ ముత్తాత హిరణ్యకశిపుడు గుణాలు లెక్కలేనన్ని ఉన్నాయి అనుకో. వాటిని అలా ఉండనీ.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=74&Padyam=559

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: