Tuesday, December 13, 2016

వామన వైభవం - 53:

8-555-వ.
తొల్లి మీ మూఁడవ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు జేసి గదాయుధుండై భూతలంబునఁ బ్రతివీరులం గానక సంచరింప విష్ణుండు వరాహరూపంబున నతని సమయించె; తద్భ్రాత యగు హిరణ్యకశిపుఁ డది విని హరిపరాక్రమంబునకు నాశ్చర్యంబు నొంది తన జయంబును బలంబునుం బరిహసించి గ్రద్దన నుద్దవిడి నద్దనుజమర్దను మందిరంబునకుం జనియె; అప్పుడు.
8-556-క.
శూలాయుధహస్తుండై
కాలాకృతి వచ్చు దనుజుఁ గని విష్ణుండుం
గాలజ్ఞత మాయాగుణ
శీలత నిట్లని తలంచెఁ జిత్తములోనన్.

టీకా:
తొల్లి = పూర్వము; మీ = మీ యొక్క; మూడవతాత = ముత్తాత; హిరణ్యాక్షుండు = హిరణ్యాక్షుడు; విశ్వ = జగత్తంతటిని; జయంబుచేసి = జయించి; గదాయుధుండు = గదాయుధమువాడు; భూతలంబునన్ = భూమండలముమీద; ప్రతివీరులన్ = ఎదిరించగలశూరులను; కానక = కనపడనివిధముగ; సంచరింపన్ = తిరుగుతుండగ; విష్ణుండు = నారాయణుడు; వరాహ = వరాహ; రూపంబునన్ = అవతారముతో; అతనిన్ = అతడిని; సమయించె = సంహరించెను; తత్ = అతని; భ్రాత = సహోదరుడు; అగు = అయిన; హిరణ్యకశిపుడు = హిరణ్యకశిపుడు; అది = ఆ విషయమును; విని = విని; హరి = నారాయణుని; పరాక్రమంబున్ = పరాక్రమమునకు; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; తన = అతని; జయంబును = జయశీలమును; బలంబునున్ = శక్తిని; పరుహరించి = తూలనాడి; గ్రద్దనన్ = వెంటనే; ఉద్దవిడిన్ = దండెత్తి; ఆ = ఆ; దనుజమర్దను = వైకుంఠుని; మందిరమున్ = వైకుంఠమున; కున్ = కు; చనియె = వెళ్ళెను; అప్పుడు = ఆ సమయమునందు.
శూలా = శూలము యనెడి; ఆయుధ = ఆయుధము; హస్తుండు = చేతగలవాడు; ఐ = అయ్యి; కాలా = యముని; ఆకృతిన్ = వలె; వచ్చు = వచ్చెడి; దనుజున్ = రాక్షసుని; కని = చూసి; విష్ణుండున్ = నారాయణుడు; కాలజ్ఞతన్ = సమయజ్ఞతతో; మాయా = మాయగల; గుణశీలతన్ = లక్షణములతో; ఇట్లు = ఇలా; అ = అని; తలచెన్ = భావించెను; చిత్తము = మనసు; లోనన్ = అందు.



భావము:
పూర్వం మీ మూడవ తరం తాత అయిన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదా దండాన్ని ధరించి భూలోకం అంతా తిరిగాడు. ఎక్కడా పగవాడు కనిపించలేదు. చివరకు అతనిని విష్ణువు వరాహరూపంలో పరిమార్చాడు. ఆ సంగతిని హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు విన్నాడు. విష్ణువు పరాక్రమానికి ఆశ్చర్యపడ్డాడు. విష్ణువు విజయాన్ని బలాన్ని తూలనాడాడు. వెంటనే అసురమర్దనుడు విష్ణువు యొక్క పట్టణమైన వైకుంఠంపై దండెత్తాడు. అప్పుడు శూలాన్ని ధరించి ప్రళయకాల యమునివలె వస్తున్న హిరణ్యకశిపుణ్ణి చూసి, సమయాసమయములు గుర్తించగల మాయలమారి కనుక, విష్ణువు తన మనస్సులో ఇలా ఆలోచించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=74&Padyam=556

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: