Thursday, December 8, 2016

వామన వైభవం - 48:

8-547-ఆ.
వటుని పాద శౌచవారి శిరంబునఁ
బరమ భద్ర మనుచు బలి వహించె
నే జలము గిరీశుఁ డిందుజూటుఁడు దేవ
దేవుఁ డుద్వహించె ధృతి శిరమున.
8-548-వ.
మఱియు నయ్యజమానుం డభ్యాగతున కిట్లనియె.

టీకా:
వటుని = బ్రహ్మచారి; పాద = పాదములు; శౌచ = కడిగిన; వారిన్ = నీటిని; శిరంబునన్ = తలపైన; పరమ = మిక్కలి; భద్రము = శుభకరము; అనుచు = అనుచు; బలి = బలి; వహించెన్ = ధరించెను; ఏ = ఎట్టి; జలమున్ = నీటిని; గిరీశుండు = పరమశివుడు {గిరీశుడు - గిరి (కైలాసగిరిపైనున్న) ఈశుడు (ప్రభువు), శంకరుడు}; ఇందుజూటుండు = పరమశివుడు {ఇందుజూటుండు - ఇందు (చంద్రుని) జూటుండు (జటాజూటమున కలవాడు), శంకరుడు}; దేవదేవుడు = పరమశివుడు {దేవదేవుడు - మహాదేవుడు, శంకరుడు}; ఉద్వహించెన్ = చక్కగాధరించెను; ధృతిన్ = పూని; శిరమునన్ = తలపైన. మఱియున్ = అటుపిమ్మట; ఆ = ఆ; యజమానుండు = యజ్ఞముచేయువాడు; అభ్యాగతున్ = అతిథి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
జటాజూటంలో చంద్రుని ధరించిన మహాదేవుడైన శివుడు ఎల్లప్పుడూ ఏనీళ్ళను తలపై ధరిస్తాడో, అటువంటి వామనుని కాళ్లు కడిగిన నీళ్ళను బలిచక్రవర్తి మేలుకలిగించేవిగా తలచి తలపై చల్లుకున్నాడు. అలా కాళ్ళు కడిగి తలపై జల్లుకున్న ఆ చక్రవర్తి అతిథిగా వచ్చిన ఆ వామనునితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=547

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: