Saturday, December 31, 2016

వామన వైభవం - 71:


8-587-వ.
అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండయి యశస్వి యిట్లనియె.
8-588-సీ.
"నిజ మానతిచ్చితి వీవు మహాత్మక! ;
మహిని గృహస్థధర్మంబు నిదియ
యర్థంబుఁ గామంబు యశమును వృత్తియు;
నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు
నర్థ లోభంబున నర్థిఁ బొమ్మను టెట్లు? ;
పలికి లే దనుకంటెఁ బాప మెద్ది?
యెట్టి దుష్కర్ముని నే భరించెదఁ గాని;
సత్యహీనుని మోవఁ జాల ననచుఁ
8-588.1-తే.
పలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ
సమరముననుండి తిరుగక చచ్చుకంటె
బలికి బొంకక నిజమునఁ బరఁగుకంటె
మానధనులకు భద్రంబు మఱియుఁ గలదె.

టీకా:
అని = అని; ఇట్లు = ఇలా; హితంబు = మేలుకోరి; పలుకుచున్న = చెప్పుతున్న; కుల = వంశ; ఆచార్యున్ = గురువున; కున్ = కు; క్షణమాత్ర = కొంచముసేపు; నిమీలిత = అరమూసిన; లోచనుండు = కన్నులు కలవాడు; అయి = అయ్యి; యశస్వి = కీర్తిగలవాడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. నిజమున్ = సత్యమును; ఆనతిచ్చితివి = చెప్పితివి; ఈవు = నీవు; మహాత్మక = గొప్ప ఆత్మ కలవాడ; మహిని = భూమిపైన; గృహస్థ = గృహస్థులయొక్క; ధర్మంబున్ = ధర్మము; ఇదియ = ఇదె; అర్థంబున్ = అర్థము; కామంబు = కామము; యశము = కీర్తి; వృత్తియున్ = జీవనోపాయము; ఎయ్యదిన్ = దేనికోసము; ప్రార్థింపన్ = కోరినా; ఇత్తును = ఇచ్చెదను; అనియు = అని; అర్థ = సంపదలపై; లోభంబునన్ = లోభముతో; అర్థిన్ = అడిగినవానిని; పొమ్ము = వెళ్ళిపొమ్ము; అనుట = అనుట; ఎట్లు = ఎలాకుదురుతుంది; పలికి = మాట యిచ్చి; లేదు = లేదు; అనుట = అనుట; కంటెన్ = కంటె; పాపము = పాపము; ఏద్ది = ఏముంది; ఎట్టి = ఎలాంటి; దుష్కర్ముని = చెడ్డపనిచేసినవానినైన; నేన్ = నేను; భరించెదన్ = మోయగలను; కాని = కాని; సత్యహీనును = ఆడితప్పువానిని; మోవజాలన్ = మోయలేను; అనుచున్ = అని. పలుకదే = అన్నదికదా; తొల్లి = పూర్వము; భూదేవి = భూదేవి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; తోడన్ = తోటి; సమరమున = యుద్దము; నుండి = నుండి; తిరుగక = వెనుతిరగక; చచ్చు = మరణించుట; కంటెన్ = కంటె; పలికి = మాట యిచ్చి; బొంకక = పలుకలేదనకుండ; నిజమునన్ = సత్యమునందు; పరగు = వర్తిల్లెడి; కంటెన్ = కంటె; మాన = అభిమానము యనెడి; ధనుల = సంపదలుగలవార; కున్ = కి; భద్రంబు = శుభమైనది; మఱియున్ = మరింకొకటి; కలదె = ఉన్నదా, లేదు.

భావము:
ఇలా తమ మేలు కోరి, గురువు శుక్రుడు చెప్పగా, గొప్ప యశస్సు గల బలి ఒక క్షణం పాటు కన్నులు మూసుకుని ఇలా అన్నాడు.
                   “ఓ మహాత్మా! శుక్రాచార్యా! నీవు చెప్పింది నిజమే. లోకంలో ఇదే గృహధర్మం కూడా. అర్ధమూ, కామమూ, కీర్తి, జీవనోపాయము వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను. ధనంపై దురాశతో అడిగినవానికి లేదని చెప్పి త్రిప్పి పంపించలేను. ఇచ్చిన మాట తప్పడం కంటే పాపం లేదు. పూర్వం భూదేవి “ఎంతటి చెడ్డ పనిచేసిన వాడిని అయినా మోస్తాను కానీ ఆడినమాట తప్పిన వాడిని మాత్రం మోయలేను. ” అని చెప్పింది కదా. యుద్ధంలో వెనుతిరగకుండా వీరమరణం పొందడం, మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం మానధనులు అయిన వారికి మేలైన మార్గాలు కదా.


http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76&Padyam=588

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : : 

Friday, December 30, 2016

వామన వైభవం - 70:

8-585-ఆ.
వారిజాక్షులందు వైవాహికము లందుఁ
బ్రాణవిత్తమానభంగమందుఁ
జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు
బొంకవచ్చు నఘము పొందఁ దధిప!
8-586-మ.
కులమున్ రాజ్యముఁ దేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం
డలతిం బోఁడు; త్రివిక్రమస్ఫురణ వాఁడై నిండు బ్రహ్మాండముం;
గలఁడే మాన్ప నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్;
వలదీ దానము గీనముం బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా! "



టీకా:
వారిజాక్షుల = ఆడవారివిషయము {వారిజాక్షులు - వారిజ (పద్మముల)వంటి అక్షులు (కన్నులు కలవారు), స్త్రీలు}; అందున్ = లోను; వైవాహికములు = పెండ్లికిసంబంధించినవాని; అందున్ = లోను; ప్రాణ = ప్రాణములు; విత్త = ధనములు; మాన = గౌరవము; భంగము = పోయెడిసందర్భముల; అందున్ = లోను; చకిత = భీతిల్లిన; గో = గోవుల; కుల = సమూహములను; అగ్రజన్మ = బ్రాహ్మణులను; రక్షణము = కాపాడుట; అందున్ = లోను; బొంకవచ్చు = అబద్దమాడవచ్చును; అఘము = పాపము; పొందదు = అంటదు; అధిప = రాజా.
కులమునున్ = వంశమును; రాజ్యమున్ = రాజ్యమును; తేజమున్ = తేజస్సును; నిలుపుము = నిలబెట్టుము; ఈ = ఈ; కుబ్జుండు = వామనుడు; విశ్వంభరుండు = విష్ణుమూర్తి {విశ్వంభరుడు - జగత్తును భరించువాడు, హరి}; అలతిన్ = అంతతేలికగా; పోడు = వదలిపెట్టడు; త్రివిక్రమ = ముల్లోకములను ఆక్రమించెడి; స్పురణన్ = స్పూర్తికల; వాడు = వాడు; ఐ = అయ్యి; నిండున్ = నిండిపోవును; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; కలడే = సమర్థుడు ఉన్నాడా; మాన్పన్ = ఆపుటకు; ఒకండు = ఒకడైన; నా = నా యొక్క; పలుకులున్ = మాటలను; ఆకర్ణింపుము = వినుము; కర్ణంబులన్ = చెవులారా; వలదు = వద్దు; ఈ = ఈ; దానమున్ = దానము; గీనమున్ = గీనము; పనుపుమా = పంపివేయుము; వర్ణిన్ = బ్రహ్మచారిని; వదాన్య = దాతలలో; ఉత్తమా = శ్రేష్ఠుడా.

భావము:
ఓ బలిచక్రవర్తి! ఆడువారి విషయంలో కాని; పెళ్ళిళ్ల సందర్భంలో కాని; ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కాని; భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడే టప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల ఏ పాపం రాదు. దాతలలోకెల్లా అగ్రేశ్వరుడా! బలీ! ఈ పొట్టివాడు సాక్షాత్తు విశ్వభర్త, విష్ణువు. అంత తేలికగా ఇతను ఇక్కడ నుండి వెళ్ళడు. మూడు లోకాలనూ, మూడు అడుగులుగా కొలిచే త్రివిక్రమ రూపం ధరించి, బ్రహ్మాండం అంతా నిండిపోతాడు. అప్పుడు అతనిని ఎవ్వరూ ఆపలేరు తెలుసా. దానం వద్దు, గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని పంపిచెయ్యి. నీ కులాన్నీ, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ నిలబెట్టుకో"
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76&Padyam=586

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం :

Thursday, December 29, 2016

వామన వైభవం - 69:

8-583-ఆ.
సర్వమయినచోట సర్వధనంబులు
నడుగ లే దటంచు ననృతమాడు
చెనటి పందనేమి చెప్పఁ బ్రాణము తోడి
శవము వాఁడు; వాని జన్మ మేల?
8-584-వ.
మఱియు నిం దొక్క విశేషంబు గలదు; వివరించెద.



టీకా:
సర్వము = సమస్తము; అయిన = అదే అయిన; చోట = అప్పుడు; సర్వ = సమస్తమైన; ధనంబులు = సంపదలు; అడుగ = కోర; లేదు = లేదు; అట = అని; అంచున్ = అనుచు; అనృతము = అబద్దము; ఆడు = ఆడెడి; చెనటిపంద = మోసగానిని; ఏమి = ఏమని; చెప్ప = చెప్పవలెను; ప్రాణము = జీవము; తోడి = తో ఉన్న; శవము = శవము; వాడు = అతడు; వాని = అతడి; జన్మము = పుట్టుక; ఏల = ఎందుకు. మఱియున్ = ఇంతేకాక; ఇందున్ = దీనిలో; ఒక్క = మరొక; విశేషంబు = ముఖ్యమైనవిషయము; కలదు = ఉన్నది; వివరించెద = వివరముగా తెలిపెదను.

భావము:
ఏ దానం దాత సంపద అంతటికి సమానమో, ఒక ప్రక్క అది అడుగుతూ; నేను అడిగేది స్వల్పమే సమస్త సంపదలూ కాదు అంటూ అబద్దం చెప్పరాదు కదా. ఆ విధంగా చెప్పేవాడు నీచుడు, పిరికివాడు; వాడు ప్రాణమున్న పీనుగ; వాడి బ్రతుకు వ్యర్ధము. దీనిలో ఇంకొక విశేషం ఉంది వివరిస్తాను విను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76&Padyam=583

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : : 

Wednesday, December 28, 2016

వామన వైభవం - 68:


8-581-వ.
అదియునుం గాక యీ యర్థంబునందు బహుభంగి బహ్వృచ గీతా ర్థంబుఁ గల దొక్కటి; సావధానుండవై యాకర్ణింపుము.
8-582-సీ.
అంగీకరించిన నఖిలంబుఁ బోవుచో;
ననృతంబుఁగాదు లే దనిన నధిప!
యాత్మ వృక్షము మూల మనృతంబు నిశ్చయ;
మనృత మూలముఁ గల్గ నాత్మ చెడదు;
పుష్పఫలము లాత్మ భూజంబునకు సత్య;
మామ్రాను బ్రతుకమి నదియుఁ జెడును;
ఫలపుష్పములు లేక పస చెడి వృక్షంబు;
మూలంబుతో వృద్ధిఁ బొందుఁ గాదె?
8-582.1-తే.
చేటుఁ గొఱతయు లఘిమయుఁ జెందకుండ
నిచ్చు పురుషుండు చెడకుండు నిద్ధచరిత!
కాక యంచిత సత్య సంగతి నటంచు
నిజధనం బర్థి కిచ్చిన నీకు లేదు.

టీకా:
అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఈ = ఈ; అర్థంబు = విషయము; అందున్ = లో; బహు = అనేక; భంగిన్ = విధములుగ; బహ్వృచ = ఋగ్వేద; గీతార్థంబు = సూక్తి; కలదు = ఉన్నది; ఒకటి = ఒకటి; సావధానుండవు = శ్రద్ధ గలవాడవు; ఐ = అయ్యి; ఆకర్ణింపుము = వినుము. అంగీకరించినన్ = ఒప్పుకొనినచో; అఖిలంబున్ = సమస్తము; పోవుచోన్ = పోవునప్పుడు; అనృతంబు = అబద్దము; కాదు = కాదు; లేదు = లేదు; అనినన్ = అన్నప్పటికిని; అధిప = రాజా; ఆత్మ = దేహము యనెడి; వృక్షమున్ = చెట్టునకు; మూలము = మూలము, వేళ్ళు; అనృతంబు = అబద్దము; నిశ్చయము = తథ్యముగా; అనృత = అబద్దము; మూలమునన్ = కాండము; కల్గన్ = బాగున్నచో; ఆత్మ = దేహము; చెడదు = పాడైపోదు; పుష్ప = పూలు; ఫలముల్ = పండ్లు; ఆత్మన్ = దేహము యనెడి; భూజంబున్ = చెట్టున; కున్ = కు; సత్యము = సత్యము; ఆ = ఆ; మ్రాను = కాండము; బ్రతుకమి = జీవములేకపోయినచో; అదియున్ = అదికూడ; చెడును = నశించును; ఫల = పండ్లు; పుష్పములున్ = పూలు; లేక = లేకుండ; పస = అందము; చెడి = పాడైపోయినను; వృక్షంబు = చెట్టు; మూలంబు = కాండము, మొదలు; తోన్ = ద్వారా; వృద్దిన్ = అభివృద్దిని; పొందున్ = పొందును; కాదె = కదా.  చేటు = నాశనము; కొఱత = లోటు; లఘిమ = తక్కువగుట; చెందకుండ = పొందకుండగ; ఇచ్చు = దానముచేసెడి; పురుషుండు = మానవుడు; చెడక = నాశనముకాకుండ; ఉండున్ = ఉండును; ఇద్దచరిత = ప్రసిద్దమైన నడవడిక కలవాడా; కాక = అలాకాకండ; అంచిత = అచ్చమైన; సత్య = సత్యము; సంగతిన్ = కోసము; అటంచున్ = అనుచు; నిజ = తన; ధనంబున్ = సంపదలను; అర్థి = అడిగినవాని; కిన్ = కి; ఇచ్చిన = ఇచ్చివేసినచో; నీకు = నీకు; లేదు = ఏమీఉండదు.

భావము:
అంతేకాకుండా, ఈ విషయంలో పెక్కువిధాలుగా ప్రసిద్ధమైన ఒక ఋగ్వేదసూక్తి ఉన్నది. దాన్ని చెబుతాను శ్రద్ధగా విను. రాజా! సచ్చరిత్రా! దేనిని ఇవ్వడం వలన సమస్తమూ నష్టము అవుతుందో ఆ దానము ఇవ్వరాదు. ఇస్తానని మాట ఇచ్చినాసరే. దానివల్ల అసత్య దోషం అంటదు. ఆత్మ అనే చెట్టుకు అసత్యమే మూలం కదా. అటువంటి ఆత్మ వృక్షానికి సత్యం పూలు పండ్లుగా ఉంటుంది. అసత్యం అనే మూలం బాగుంటే ఆత్మ అనే వృక్షం చెడదు. మొదలు చెడితే చెట్టు పూలూ పండ్లు చెడతాయి. పండ్లు పూలు లేకపోయినా మొదలు బాగా ఉంటే వృక్షం వృద్ధి చెందుతుంది. కాబట్టి మొదటికి చేటు వాటిల్లకుండా; లోటు రాకుండా; పదుగురలో పలుచన కాకుండా దానం చేసే దాత చెడిపోడు. అందుచేత, సత్యంకోసం నీవు ఇతనికి దానమిస్తే నీకు మిగిలేది ఏమీ ఉండదు

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76&Padyam=582

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, December 27, 2016

వామన వైభవం - 67:

8-580-సీ.
ఇచ్చెద నని పల్కి యీకున్న నరకంబు;
ద్రోవ నీవును సమర్థుఁడవుఁ గావ;
యే దానమున నాశ మేతెంచు నదియును;
దానంబుఁ గా దండ్రు తత్త్వవిదులు;
దానంబు యజ్ఞంబుఁ దపముఁ గర్మంబును;
దా విత్తవంతుఁడై తలఁపవలయుఁ;
దన యింటఁ గల సర్వధనమును నైదు భా;
గములుగా విభజించి కామమునకు
8-580.1-ఆ.
నర్థమునకు ధర్మయశముల కాశ్రిత
బృందములకు సమతఁ బెట్టునట్టి
పురుషుఁ డిందు నందు బూర్ణుఁడై మోదించుఁ
దన్ను మాని చేఁత దగవుఁ గాదు.

టీకా:
ఇచ్చెదన్ = ఇస్తాను; అని = అని; పల్కి = పలికి; ఈకున్న = ఇవ్వకపోతే; నరకంబు = నరకమునకుపోవుటను; త్రోవన్ = తోసిపుచ్చుటకు; నీవును = నీవుకూడ; సమర్థుండవు = శక్తిమంతుడవు; కావ = కావా, అవును; ఏ = ఎట్టి; దానమునన్ = దానమువలన; నాశమున్ = నాశనము; ఏతెంచు = కలుగునో; అదియునున్ = అది; దానంబున్ = దానము; కాదు = కాదు; అండ్రున్ = అనెదరు; తత్త్వవిదులు = విజ్ఞానులు; దానంబున్ = దానము; యజ్ఞంబున్ = యాగము; తపమున్ = తపస్సు; కర్మంబున్ = కార్యక్రమములను; తాన్ = తను; విత్తవంతుడు = ధనముకలవాడు; ఐ = అయ్యి; తలపవలయున్ = సంకల్పించవలెను; తన = తన యొక్క; ఇంటన్ = ఇంటిలో; కల = ఉన్నట్టి; సర్వ = సమస్తమైన; ధనమున్ = సంపదలను; ఐదు = అయిదు; భాగములు = విభాగములుగా; విభజించి = విడదీసి; కామమున్ = కామమున; కున్ = కు; అర్థమున్ = అర్థమున; కున్ = కు.
                          ధర్మ = ధర్మమునకు; యశముల్ = కీర్తి; కిన్ = కి; ఆశ్రిత = ఆశ్రయించినవారి; బృందముల్ = సమూహముల; కున్ = కు; సమతన్ = సరిగా; పెట్టున్ = ఉపయోగించు; అట్టి = అటువంటి; పురుషుండు = మానవుడు; ఇందున్ = ఇహమున; అందున్ = పరమున; పూర్ణుడు = సార్థకుడు; ఐ = అయ్యి; మోదించున్ = ఆనందించును; తన్ను = తనకు; మాని = మించిన; చేతన్ = చేయుట; తగవు = తగినది; కాదు = కాదు.



భావము:
ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే, వచ్చే నరకాన్ని త్రోసిపుచ్చడానికి నీకు శక్తి ఉంది. “దాతకు నాశనం తెచ్చే దానం దానమే కాదు” అని పెద్దలు చెప్తారు. తాను ధనవంతుడుగా ఉంటూ దానాన్ని యజ్ఞాన్ని తపస్సునూ గురించి ఆలోచించాలి. ఉత్తముడైన పురుషుడు తన ధనమంతా ఐదు భాగాలు చేసి కామానికి, అర్ధానికి, ధర్మానికి, కీర్తికి, ఆశ్రయించినవారికీ సమానంగా పంచాలి. ఆ విధంగా చేసేవాడు, ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ కృతార్థుడు అయి సుఖపడతాడు. తనకు మించిన ధర్మం న్యాయం కాదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76&Padyam=580

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం :

Monday, December 26, 2016

వామన వైభవం - 66:

8-579-క.
ఒక్కపదంబున భూమియు
నొక్కటఁ ద్రిదివంబు ద్రొక్కి యున్నతమూర్తిన్
దిక్కులు గగనముఁ దానై
వెక్కసమై యున్న నెందు వెడలెదు? చెపుమా!



టీకా:
ఒక్క = ఒక; పదంబునన్ = అడుగుతో; భూమియున్ = భూలోకమును; ఒక్కటన్ = ఒకదానితో; త్రిదివంబున్ = స్వర్గలోకమును; త్రొక్కి = ఆక్రమించేసి; ఉన్నత = పెద్ద; మూర్తిన్ = స్వరూపముతో; దిక్కులున్ = దిక్కులు; గగనమున్ = ఆకాశము; తాను = తనే; ఐ = అయ్యి; వెక్కసము = నిండిపోయినవాడు; ఐ = అయ్యి; ఉన్నన్ = అయిపోయినచో; ఎందున్ = ఎక్కడకు; వెడలెదు = పోయెదవు; చెపుమా = చెప్పు.

భావము:
ఇతడు ఒకపాదంతో భూలోకాన్నీ, ఇంకొకపాదంతో స్వర్గలోకాన్నీ కప్పివేస్తాడు. బాగా పెద్ద ఆకారం ధరించి, దిక్కులూ, ఆకాశం పిక్కటిల్లేటట్లు పెరిగి, అంతా తానై నిండిపోతాడు. అప్పుడు నీవు ఎక్కడికి పోతావు చెప్పు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76&Padyam=579

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, December 25, 2016

వామన వైభవం - 65:

8-577-వ.
అని యిట్లు పలుకుచున్న ఖర్వునకు నుర్వీదానంబు చేయం దలంచి కరకలిత సలిల కలశుండైన య వ్వితరణగుణముఖరునిం గని, నిజ విచారయుక్త దనుజ రాజ్య చక్రుండగు శుక్రుం డిట్లనియె.
8-578-సీ.
"దనుజేంద్ర! యీతఁడు ధరణీసురుఁడుఁ గాడు;
దేవకార్యంబు సాధించుకొఱకు
హరి విష్ణుఁ డవ్యయుం డదితి గర్భంబునఁ;
గశ్యపసూనుఁడై కలిఁగె; నకట!
యెఱుగ కీతని కోర్కి నిచ్చెద నంటివి;
దైత్య సంతతి కుపద్రవము వచ్చు
నీ లక్ష్మిఁ దేజంబు నెలవు నైశ్వర్యంబు;
వంచించి యిచ్చుఁ దా వాసవునకు;
8-578.1-ఆ.
మొనసి జగము లెల్ల మూఁడు పాదంబుల
నఖిలకాయుఁ డగుచు నాక్రమించు
సర్వ ధనము విష్ణు సంసర్జనము చేసి
బడుగు పగిది నెట్లు బ్రతికె దీవు?



టీకా:
అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలుకుచున్న = అనుచున్న; ఖర్వున్ = పొట్టవాని; కును = కి; ఉర్వీదానంబు = భూదానము; చేయన్ = చేయవలెనని; తలచి = అనుకొని; కర = చేతిలో; కలిత = ఉన్న; సలిల = నీటి; కలశుండు = కలశముకలవాడు; ఐన = అయినట్టి; ఆ = ఆ; వితరణ = దానముచేసెడి; గుణ = లక్షణములతో; ముఖరునిన్ = ముఖ్యమైనవానిని; కని = చూసి; నిజ = సరియగు; విచార = ఆలోచనలో; యుక్త = కూడిన; దనుజ = రాక్షస; రాజ్య = రాజ్యమును; చక్రుండు = నడపువాడు; అగు = అయిన; శుక్రుండు = శుక్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
దనుజేంద్ర = రాక్షసచక్రవర్తి; ఈతడు = ఇతగాడు; ధరణీసురుడు = బ్రాహ్మణుడు; కాడు = కాడు; దేవ = దేవతల; కార్యంబు = పని; సాధించు = సాధించుట; కొఱకు = కోసము; హరి = నారాయణుడు; విష్ణుడు = నారాయణుడు; అవ్యయుండు = నారాయణుడు; అదితి = అదితి యొక్క; గర్భంబునన్ = కడుపులో; కశ్యప = కశ్యపునియొక్క; సూనుడు = పుత్రుడు; ఐ = అయ్యి; కలిగెన్ = పుట్టెను; అకట = అయ్యో; ఎఱుగక = తెలియక; ఈతని = ఇతని యొక్క; కోర్కిన్ = కోరికను; ఇచ్చెదన్ = ఇస్తాను; అంటివి = అన్నావు; దైత్య = రాక్షస; సంతతి = కులమున; కున్ = కు; ఉపద్రవము = పెనుముప్పు; వచ్చున్ = వచ్చును; నీ = నీ యొక్క; లక్ష్మిన్ = సంపదలను; తేజంబున్ = తేజస్సును; నెలవున్ = స్థానమును; ఐశ్వర్యంబున్ = ఐశ్వర్యమును; వంచించి = దొంగిలించి; ఇచ్చున్ = ఇచ్చును; తాన్ = అతడు; వాసవున్ = ఇంద్రుని; కు = కి.
                       మొనసి = వ్యూహముపన్ని; జగములు = లోకములు; ఎల్లన్ = అన్నిటిని; మూడు = మూడు (3); పాదంబులన్ = అడుగులతోటి; అఖిలకాయుండు = విశ్వరూపుడు; అగుచున్ = అగుచు; ఆక్రమించున్ = అలముకొనును; సర్వ = సమస్తమైన; ధనమున్ = సంపదలను; విష్ణు = నారాయణునికి; సంసర్జనంబు = అప్పజెప్పుట; చేసి = చేసి; బడుగు = బీదవాని; పగిదిన్ = వలె; ఎట్లు = ఎలా; బ్రతికెదవు = జీవించగలవు; ఈవు = నీవు.

భావము:
ఇలా చాలంటూ పలికిన వామనునికి మూడు అడుగుల భూదానం ఇవ్వడానికి బలిచక్రవర్తి జలకలశం చేతిలోనికి తీసుకుని సమాత్తం అవుతున్నాడు. అంతలో రాక్షసరాజ్య నిర్వాహణా శూరుడు అయిన శుక్రాచార్యుడు దానశీలుడైన దానవచక్రవర్తి బలితో ఇలాఅన్నాడు. “రాక్షసేశ్వరా! బలీ! ఇతడు బ్రాహ్మణుడు కాదు. అనంతాత్ము డైన హరి, విష్ణువు. దేవతల కార్యాన్ని సాధించడానికి కశ్యపుని కొడుకుగా అదితి గర్భంలో పుట్టినవాడు. అయ్యో తెలియకుండా ఇతనికి దానం ఇస్తానని ఒప్పుకున్నావు. దీని వలన రాక్షసులకు కష్టం వస్తుంది. ఇతడు నిన్ను మోసగించి నీ సంపదనూ తేజస్సునూ రాజ్యాన్నీ ఇంద్రునికి ఇస్తాడు. విశ్వరూపం ధరించి మూడడుగులతో లోకాలు అన్నిటినీ ఆక్రమిస్తాడు. నీ ఐశ్వర్యమంతా ధారపోసి నీవు నిరుపేదగా ఎలా బ్రతుకుతావు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=76&Padyam=578

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, December 24, 2016

వామన వైభవం - 64:


8-576-సీ.
సంతుష్టుఁడీ మూఁడు జగములఁ బూజ్యుండు;
సంతోషి కెప్పుడుఁ జరఁగు సుఖము
సంతోషిఁ గాకుంట సంసార హేతువు;
సంతసంబున ముక్తిసతియు దొరకుఁ
బూఁటపూఁటకు జగంబుల యదృచ్ఛాలాభ;
తుష్టిని దేజంబు తోన పెరుఁగుఁ
బరితోష హీనతఁ బ్రభ చెడిపోవును;
జలధార ననలంబు సమయునట్లు
8-576.1-ఆ.
నీవు రాజ వనుచు నిఖిలంబు నడుగుట
దగవు గాదు నాకుఁ; దగిన కొలఁది
యేను వేఁడికొనిన యీ పదత్రయమునుఁ
జాల దనక యిమ్ము; చాలుఁజాలు. "

టీకా:
సంతుష్టుడు = తృప్తిపడువాడు; ఈ = ఈ; మూడుజగములన్ = ముజ్జగములందును; పూజ్యుండు = గౌరవింపదగినవాడు; సంతోషి = తృప్తిపడువాని; కిన్ = కి; ఎప్పుడున్ = ఎప్పటికిని; జరుగు = కలుగుతుండును; సుఖము = సౌఖ్యము; సంతోషి = సంతృప్తి; కాకుంటన్ = చెందకపోవుట; సంసార = సంసార బంధనములకు; హేతువు = కారణము; సంతసంబునన్ = సంతృప్తివలన; ముక్తి = మోక్షము యనెడి; సతియున్ = కాంతకూడ; దొరకున్ = లభించును; పూటపూట = ప్రతి దినమున; కు = కు; జగంబులన్ = లోకములందు; అదృచ్చా = తనకితానుగా; లాభ = దొరకినదానితో; తుష్టినిన్ = తృప్తివలన; తేజంబున్ = తేజస్సు; తోనన్ = తోపాటు; పెరుగున్ = అభివృద్దికలుగును; పరితోష = సంతృప్తి; హీనతన్ = లేకపోవుటచేత; ప్రభ = తేజస్సు; చెడిపోవును = పాడైపోవును; జల = నీటి; దారన్ = దారలవలన; అనలంబు = అగ్ని; సమయున్ = ఆరిపోవు; అట్లు = విధముగా.
                  నీవున్ = నీవు; రాజవు = రాజువుకదా; అనుచున్ = అని; నిఖిలంబున్ = సమస్తమును; అడుగుట = కోరుట; తగవు = తగినది; కాదు = కాదు; నా = నా; కున్ = కు; తగిన = సరిపడిన; కొలది = అంత; ఏనున్ = నేను; వేడికొనిన = కోరుకొన్న; ఈ = ఈ; పద = అడుగులు; త్రయమును = మూడింటిని (3); చాలదు = వీలుకాదు; అనక = అనకుండగ; ఇమ్ము = ఇమ్ము; చాలుజాలు = ఇంకచాలు.

భావము:
తృప్తిపడేవాడు ముల్లోకాల్లోనూ గౌరవింపబడతాడు. తృప్తునికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవడమే తిరిగి పుట్టడానికి కారణం. సంతోషంవల్ల మోక్షం కూడా సమకూరుతుంది. పూటపూటకూ తనంతతానుగా దొరికినదానితో సంతోషపడుతుంటే తేజస్సు పెరుగుతుంది. నీళ్ళ వలన నిప్పు చల్లారినట్లుగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజువు కదా అని అవి ఇవి అన్నీ అడగడం భావ్యం కాదు. నాకు తగినట్లుగా నేను అడిగిన మూడుఅడుగులూ కాదనకుండా ఇమ్ము. అంతే చాలు. అదే చాలు. ”
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=75&Padyam=576

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, December 23, 2016

పోతనగారి వచన వైభవం


పోతనగారి వచన వైభవం ఇంతింతని చెప్పనలవి కాదు.
గోపికలు విరహం మన్మథబాణాలు అంటూ తెలుగు భాగవతం దశమ స్కంధ పూర్వ భాగం లోని గోపికల వేణునాధుని వర్ణన ఘట్టం అందలి 10.1-189 వచనం చిన్న ఉదాహరణ. సరదాగా తలచుకుందాం దీనిని.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=96&Padyam=798
గోపికల వేణునాధుని వర్ణనలోని 10.1-189-వ.
బృందావనంలో విహరిస్తున్న మాధవుడిని చూసి మదనుడి భాణ పరంపరలచే పీడింపబడే మనసులతో ఏకాంతంలో చింతిస్తూ తదేక ధ్యానపరాయణులు అయ్యారట. ఈ భావం స్పురించే ఆ భాగవత వచనంలోని పదాల కూర్పు చూడండి.
తత్పరాయణులు అయినవారు వల్లవకాంతలుట. వల్లవ అంటే గొల్ల అనీ భీమ అని నిఘంటువు, వల్లవుము అంటే అనుకూలించు అని అర్థం, మరి వల్లవ కాంతలు అంటే గొల్ల భామలా, బలమైన స్థిరమైన కాంచుట కలవారా, అనుకూల దృక్పదం కలవారా?
ఎందుకు అంతటి ఏకాంతాలు అంటే పంచభాణభల్ల. మరి పంచబాణ మన్మథుడి 1అరవిందము 2అశోకము 3చూతము 4నవమల్లిక 5నీలోత్పలము అనెడి ఐదు బాణాలచేతనా, 1 మోహము, 2 మహామోహము, 3 అంధతామిశ్రమము, 4 తామిశ్రమము, 5 చిత్తభ్రమ అనే అజ్ఞాన పంచకములనే బాణములచేతనా. మరి రెండోవి అయితే గోవిందుడు - గోవులకు ఒడయుడు, జ్ఞానులకు ప్రభువు పై ఏంకాత భక్తి తప్ప మరొక దారి లేదు కదా. అదేనా ఈ బృందావన విహారం.. . .
 - -
అవిద్యా పంచకం

వామన వైభవం - 63:

8-575-శా.
ఆశాపాశము దాఁ గడున్ నిడుపు; లే దంతంబు రాజేంద్ర! వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసిం బొందిరిఁ గాక వైన్య గయ భూకాంతాదులున్నర్థకా
మాశం బాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే.

టీకా:
ఆశా = ఆశ యనెడి; పాశంబు = తాడు; తాన్ = అది; కడున్ = మిక్కిలి; నిడుపు = పొడవైనది; లేదు = లేదు; అంతంబు = అంతు; రాజేంద్రా = చక్రవర్తి; వారాశి = సముద్రముచే {వారాశి - నీటికికుప్ప, కడలి}; ప్రావృత = చుట్టబడిన; మేదినీ = భూ; వలయ = మండల; సామ్రాజ్యంబున్ = సామ్రాజ్యములు; చేకుడియున్ = సమకూరినప్పటికి; గాసిన్ = శ్రమను; పొందిరి = పడిరి; కాక = కావచ్చుకాని; వైన్య = పృథుడు; గయ = గయుడు యనెడి; భూకాంతులున్ = చక్రవర్తులుకూడ; అర్థ = సంపదలపైన; కామ = కామములపైన; ఆశన్ = ఆశను; పాయగన్ = వదలుట; నేర్చిరే = చేయగలిగిరా, లేదు; మును = ఇంతకుముందు; నిజ = తమ; ఆశ = ఆశలకు; అంతంబున్ = అంతును; చూచిరే = కనుగొనగలిగిరా, లేదు.

భావము:
బలి రాక్షస మహారాజా! ఆశ మిక్కిలి పొడవైన త్రాడు వంటిది. దానికి అంతు అన్నది ఉండదు. పూర్వకాలంలో పృధుచక్రవర్తీ గయుడూ మొదలైన రాజులు సముద్రాల దాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించారు. వారు సైతం వృధాగా కష్టపడినవారే కానీ అర్థంమీదా కామంమీదా ఆశలను వదలుకోలేదు. అంతటి వారు కూడా ఆశల అంతు చూడలేదు కదా.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=75&Padyam=575

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, December 22, 2016

'భాగవతం' ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ ఆప్......

అందరికీ నమస్కారం!!!

9000 వేల పైచిలుకు పద్యాలతో, దాదాపు సగానికి పైగా పద్యాలకు భావాలతో సరికొత్తగా తెలుగు భాగవతం.ఆర్గ్ ( www.telugubhagavatam.org ) సగర్వంగా మీ ముందుకు తీసొకొచ్చింది 'భాగవతం' ఆండ్రాయిడ్ ఆప్ ని ( చరణీ గ్రంథం ). బృహద్ గ్రంథమైన తెలుగు భాగవతాన్ని బహు సూక్ష్మంగా అందరికీ అనుకూలంగా మలచి అందించడమే మా ఈ చరణి భాగవతం ఆప్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నారాయణుడి లీలా విశేషాలను ఆస్వాదించి ఆనందించడానికి వెంటనే క్రింది లింకుని నొక్కి ఆప్ ని డౌన్లోడ్ చేసుకోండి..... ధన్యవాదాలు....
https://play.google.com/store/apps/details?id=com.fani.tb.pradama

http://telugubhagavatam.org/?library&Branch=AndroidApps&Fruit=telugu-bhagvatam-charaNiGrandham-Android-IOS

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

వామన వైభవం - 62:

8-573-వ.
అదియునుంగాక.
8-574-క.
వ్యాప్తిం బొందక వగవక
ప్రాప్తంబగు లేశమైనఁ బదివే లనుచుం
దృప్తిం జెందని మనుజుఁడు
సప్తద్వీపముల నయినఁ జక్కంబడునే?



టీకా:
అదియునున్ = అంతే; కాక = కాకుండగ. వ్యాప్తిన్ = ఉబ్బిపోవుట; పొందక = పొందకుండగ; వగవక = విచారించకుండ; ప్రాప్తంబు = దొరికినది; అగు = అయిన; లేశము = కొంచము; ఐనన్ = అయినప్పటికిని; పదివేలు = అధికమైనది; అనుచున్ = అనుకొని; తృప్తిన్ = తృప్తి; చెందని = పడని; మనుజుడు = మానవుడు; సప్తద్వీపములన్ = సప్తద్వీపములసంపదతో {సప్తద్వీపములు - 1జంబూ 2ప్లక్ష 3శాల్మల 4కుశ 5క్రౌంచ 6శాక 7పుష్కర యనెడి 7 ద్వీపములు}; అయినన్ = అయినప్పటికిని; చక్కంబడునే = సరిగా అగునా కాడు.

భావము:
అంతేకాకుండా.... లభించినది ఎంత కొంచం అయినాసరే ఉబ్బితబ్బిబ్బు పడకుండా, అదే పదివేలుగా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తిపడనివారికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి తీరదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=75&Padyam=574

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday, December 21, 2016

వామన వైభవం - 61:

8-571-వ.
అనిన మొగంబునం జిఱునగవు మొలకలెత్త గృహమేథికి మేధావి యి ట్లనియె.
8-572-మ.
"గొడుగో. జన్నిదమో, కమండలువొ. నాకున్ ముంజియో, దండమో,
వడుఁ గే నెక్కడ భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్.

టీకా:
అనినన్ = అనగా; మొగంబునన్ = ముఖమునందు; చిఱునగవు = చిరునవ్వు; మొలకలెత్త = ఉదయించగా; గృహమేధి = గృహస్థున; కిన్ = కు; మేధావి = విజ్ఞాని; ఇట్లు = ఇలా; అనియె = చెప్పెను.
                  గొడుగొ = గొడుగుకాని; జన్నిదమో = జంధ్యముకాని; కమండులువో = కమండలముకాని; నా = నా; కున్ = కు; ముంజియో = మొలత్రాడుకాని; దండమో = యోగదండముకాని; వడుగున్ = బ్రహ్మచారిని; ఏన్ = నేను; ఎక్కడ = ఎక్కడ; భూములు = భూభాగములు; ఎక్కడ = ఎక్కడ; కరుల్ = ఏనుగులు; వామాక్షులు = జవరాండ్రు; అశ్వంబులున్ = గుర్రములు; ఎక్కడ = ఎక్కడ; నిత్యోచితకర్మము = నిత్యకృత్యములు; ఎక్కడ = ఎక్కడ; మత్ = నాచేత; కాంక్షితంబు = కోరబడినది; ఐన = అయిన; మూడు = మూడు (3); అడుగుల్ = అడుగుల; మేరయ = పాటిది; త్రోవకన్ = కాదనక; ఇచ్చుట = దానముచేయుట; అది = అదే; బ్రహ్మాండంబు = బ్రహ్మాండము; నా = నా; పాలికిన్ = పాలిటికి, మట్టుకు.

భావము:
ఇలా ఇంత చిన్నదానమా అంటున్న యాగ యజమాని బలిచక్రవర్తితో మేధావి అయిన వామనుడు ఇలా అంటున్నాడు. “అయ్యా! నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు కాని, యజ్ఞోపవీతం కాని, కమండలం కాని, మొలతాడు కాని ఉపయోగిస్తాయి. అంతేకాని బ్రహ్మచారి నైన నా కెందుకు భూములు, ఏనుగులు, గుర్రాలు, స్త్రీలు. నా నిత్యకృత్యాలకి వాటితో పనిలేదు కదా. కాదని తోసేయకుండ నే కోరిన ఆ మూడు అడగుల చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=75&Padyam=572

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, December 20, 2016

వామన వైభవం - 60:

8-569-వ.
అని మఱియు ని ట్లనియె.
8-570-మ.
వసుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్
వెసనూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో?
పసి బాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటి గా
కసురేంద్రుండు పదత్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే? "

టీకా:
అని = అని; మఱియున్ = ఇంకా; ఇట్లు = ఇలా; అనియె = పలికెను. వసుధాఖండము = భూభాగమును; వేడితో = అడుగుటకాని; గజములన్ = ఏనుగులను; వాంఛించితో = కోరుటకాని; వాజులన్ = గుర్రములను; వెసన్ = మిక్కిలి; ఊహించితో = అనుకొనుటకాని; కోరితో = కావాలనుటకాని; యువతులన్ = జవరాండ్రను; వీక్షించి = చూసి; కాంక్షించితో = కోరుటకాని; పసి = బాగాచిన్న; బాలుండవు = పిల్లవాడవు; నేరవు = తెలియనివాడవు; అడుగ = అడుగుట; నీ = నీయొక్క; భాగ్యంబుల్ = అదృష్టములు; ఈపాటి = ఈమాత్రమే; కాక = అయినప్పటికిని; అసురేంద్రుండు = రాక్షసచక్రవర్తి; పదత్రయంబు = మూడడుగులే; అడుగన్ = అడిగినని; ఈ = ఇంత; అల్పంబున్ = కొంచమును; ఈన్ = ఇచ్చుట; నేర్చునే = చేయకలడా.



భావము:
అని బలిచక్రవర్తి మరల ఇలా అన్నాడు. “భూభాగం కోరుకోవాలి లేదా ఏనుగులు కోరుకోవాలి లేదా గుర్రాలను కోరాలి లేదా అందగత్తెలను చూసి కాంక్షపుడితే జవరాండ్రను కోరుకోవాలి; కాని చిన్నపిల్లాడివి కదా అడగటం తెలియదు; నీ సిరి / సామర్థ్యం ఇంత అల్పమైందే. కనుకే మూడడుగులు మాత్రమే అడిగావు; ఐనా ఇంతటి రాక్షస చక్రవర్తిని ఇంత అల్పం ఎలా ఇస్తాను. ” అని అంటున్నాడు బలిచక్రవర్తి మూడడుగుల మేర దానం అడిగిన వామనునితో.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=75&Padyam=570

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, December 19, 2016

వామన వైభవం - 59:


8-567-వ.
అనిన బరమయాచకునకుఁ బ్రదాత యిట్లనియె.
8-568-ఆ.
"ఉన్నమాటలెల్ల నొప్పును విప్రుండ!
సత్య గతులు వృద్ధ సమ్మతంబు;
లడుగఁ దలఁచి కొంచె మడిగితివో చెల్ల;
దాత పెంపు సొంపుఁ దలఁపవలదె. "

టీకా:
అనినన్ = అనగా; పరమ = మహా; యాచకున్ = బిక్షుని; కున్ = కి; ప్రదాత = గొప్పదాత; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను. ఉన్నమాటలు = చెప్పినవి; ఎల్లన్ = అన్ని; ఒప్పును = తగును; విప్రుండ = బ్రాహ్మణుడా; సత్య = యదార్థముమైన; గతులు = విధములు; వృద్ధ = పెద్దలచే; సమ్మతంబులు = అంగీకరింపబడునవి; అడుగన్ = అడగవలెనని; తలచి = అనుకొని; కొంచము = కొద్దిగానే; అడిగితివో = అడిగితివేమి; చెల్ల = అరె; దాత = దాతయొక్క; పెంపు = గొప్పదనమును; సొంపున్ = మంచితనమును; తలపన్ = భావించ; వలదె = వద్దా.

భావము:
ఇలా మూడు అడుగుల నేల అడిగిన ఉత్కృష్ట బిక్షుకుడైన వామనుడితో, బహు దొడ్డ దాత అయిన బలిచక్రవర్తి ఇలా అన్నాడు. “ఓ బ్రాహ్మణుడా! నీ మాటలన్నీ ఉన్నమాటలే. వాటిని ఒప్పుకోవలసిందే. ముమాటికీ సత్యములే. అందుకు పెద్దలు కూడా కాదనరు. కానీ పాపం అడక్క అడక్క అడిగి ఇంత కొంచెమే అడిగావు. చాలా బాగుంది. కానీ అడిగే టప్పుడు దాత గొప్ప దనాన్నీ అతని గొప్ప గుణాన్ని తలచాలి కదా!. ”
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=75&Padyam=568

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, December 18, 2016

వామన వైభవం - 58:

8-565-క.
మున్నెన్నుదురు వదాన్యుల
నెన్నెడుచో నిన్నుఁ ద్రిభువనేశుం డనుచున్;
ఇన్ని దినంబుల నుండియు
నెన్నఁడు నినుఁ బెట్టు మనుచు నీండ్రము జేయన్.
8-566-ఆ.
ఒంటివాఁడ నాకుఁ నొకటి రెం డడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల;
గోర్కిఁదీర బ్రహ్మకూకటి ముట్టెద
దానకుతుకసాంద్ర! దానవేంద్ర! "



టీకా:
మున్ను = ముందుగ; ఎన్నుదురు = లెక్కించెదరు; వదాన్యులన్ = దాతలను; ఎన్నెడుచో = లెక్కించునప్పుడు; నిన్నున్ = నిన్ను; త్రిభువన = ముల్లోకములకు; ఈశుండు = ప్రభువు; అనుచున్ = అనుచు; ఇన్ని = ఇన్ని; దినంబుల = రోజుల; నుండియున్ = నుంచి; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; నినున్ = నిన్ను; పెట్టుము = ఇమ్ము; అనుచున్ = అనుచు; ఈండ్రము = పీడించుట; చేయన్ = చేయలేదు.
                      ఒంటివాడన్ = ఒక్కడను; నా = నా; కున్ = కు; ఒకటిరెండు = మూడు (3); అడుగుల = అడుగుల; మేర = కొలత కల భూమి; ఇమ్ము = ఇమ్ము; సొమ్ము = సంపదలు; మేర = ఎల్లను; ఒల్ల = అంగీకరించను; కోర్కిన్ = కోరిక; తీరన్ = తీరినచో; బ్రహ్మకూకటిముట్టెదన్ = మిక్కిలి సంతోషించెదను {బ్రహ్మకూకటిముట్టెదను - బ్రహ్మయొక్క జుట్టును అందుకొనెదను, మహానందపడెదను}; దాన = దానముచేసెడి; కుతుక = కుతూహలము; సాంద్ర = అధికముగా కలవాడ; దానవేంద్ర = రాక్షసరాజా.

భావము:
దాతలను లెక్కించేటప్పుడు ముల్లోకాలలోనూ గొప్పవాడుగా మొట్టమొదట నిన్నె ఎన్నిక చేస్తారు. ఇంతవాడవు అయినా ఇంతవరకూ నిన్ను ఇమ్మంటూ ఏనాడూ నేను పీడించలేదు.
ఓ దానవరాజా! దానం చేయలనే చిక్కని కుతూహలం కలవాడా! బలిచక్రవర్తీ! నేను ఒంటరివాడిని. నాకు సొమ్ములూ భూములూ అక్కరలేదు. మూడడుగుల నేల మాత్రము ఇమ్ము. దానితో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను. ”
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=75&Padyam=566

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, December 17, 2016

తప్పులెన్ను వారు ధన్యులు సుమతీ

భాగవతులకు ముఖ్య సూచన
ఇప్పుడు భాగవతం చదివతే పుణ్యంతో పాటు పురుషార్ధం కూడా... 
ఎలాగంటే, మీరు http://telugubhagavatam.org లో పోతన తెలుగు భాగవతం చదివి అందులో మీకు తప్పు అనిపించినవాటిని bhagavatapracharasamiti@gmail.com కి పంపాలి. 
అత్యధిక తప్పులు పంపినవారికి 5000/- రూపాయలతో పాటు అదనంగా ప్రతి ఒక తప్పుకు ఒక రూపాయి చొప్పున బహుమతి ఇవ్వబడును.
మరిన్ని వివరాలకు http://telugubhagavatam.org హోం పేజీలో చూడగలరు.
ముంగలి : తెలుగు భాగవతం పద్యగద్యాలు, శ్రవణ దస్త్రములు మొదలైన వాటన్నటిని తెలుగులో సంకలనం జేసి ఒకే చోట అందిస్తోంది.
TELUGUBHAGAVATAM.ORG|శ్రీ ఊలపల్లి సాంబశివరావు ద్వారా

వామన వైభవం - 57:

8-563-వ.
అదియునుం గాక
8-564-క.
రాజ్యంబు గలిగె నేనిం
బూజ్యులకును యాచకులకు భూమిసురులకున్
భాజ్యముగ బ్రతుక డేనిం
ద్యాజ్యంబులు వాని జన్మ ధన గేహంబుల్.




టీకా:
అదియునున్ = అంతే; కాక = కాకుండగ. రాజ్యంబున్ = రాజ్యాధికారము; కలిగెన్ = లభించిన; ఏనిన్ = ఎడల; పూజ్యుల = గౌరవింపదగినవారి; కునున్ = కి; యాచకుల = బిక్షుల; కున్ = కు; భూమిసురుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; భాజ్యముగన్ = పంచిపెట్టెడి విధముగ; బ్రతుకడేనిన్ = జీవించకపోయినచో; త్యాజ్యంబులున్ = త్యజింపదగినవి; వాని = అతని; జన్మ = పుట్టుక; ధన = సంపద; గేహంబుల్ = మేడలు.

భావము:
అంతే కాకుండా. రాజ్యాధికారం కలిగినప్పుడు గౌరవింపదగినవారికీ, బ్రాహ్మణులకూ బిక్షగాళ్ళకూ ధనాన్ని పంచిపెడుతూ బ్రతకాలి. అలా చేయనివాడి బ్రతుకూ, ధనమూ, మేడలు నిరర్ధకాలు. అవి పరిత్యజింప తగినవి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=75&Padyam=564

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, December 16, 2016

వామన వైభవం - 56:

8-561-క.
ఆతుర భూసురగతిఁ బురు
హూతాదులుఁ దన్ను వేఁడ నొగిఁ గొం డనుచున్
మీ తండ్రి యిచ్చె నాయువు
నేతన్మాత్రుఁడవె నీవు నీలోకమునన్?
8-562-క.
ఏలితివి మూఁడు జగములుఁ;
దోలితి వింద్రాది సురలఁ; దొల్లిటివారిం
బోలితివి దానగుణముల;
సోలితివి పిశాచరాక్షసుల రక్షింపన్.



టీకా:
ఆతుర = ఆపదలోనున్న; భూసుర = బ్రాహ్మణుల; గతిన్ = వలె; పురుహూత = ఇంద్రుడు {పురుహూతుడు - యజ్ఞములందు ప్రచురమైన పిలుపు కలవాడు, ఇంద్రుడు}; ఆదులున్ = మొదలగువారు; తన్ను = తనను; వేడన్ = అర్థించగా; ఒగిన్ = ఒప్పుకొని; కొండు = తీసుకొనండి; అనుచున్ = అనుచు; మీ = మీ యొక్క; తండ్రి = నాన్న; ఇచ్చెన్ = ఇచ్చివేసెను; ఆయువున్ = ఆయుష్షును; ఏతన్మాత్రుడవె = వారికి తీసిపోని వాడవేకదా; నీవున్ = నీవుకూడ; ఈ = ఈ; లోకమునన్ = లోకములో. ఏలితివి = పరిపాలించితివి; మూడుజగములున్ = ముల్లోకములను; తోలితివి = పారదోలితివి; ఇంద్ర = ఇంద్రుడు; ఆది = మున్నగు; సురలన్ = దేవతలను; తొల్లిటివారిన్ = పూర్వులను; పోలితివి = సరిపోలితివి; దాన = దానముచేసెడి; గుణములన్ = లక్షణములతో; సోలితివి = పారవశ్యము పొందితివి; పిశాచ = భీకరులైన; రాక్షసులన్ = రాక్షసులను; రక్షింపన్ = కాపాడుటయందు.

భావము:
ఇక మీ తండ్రి మాత్రం సామాన్యుడా ఇంద్రాదులు బ్రహ్మణులవలె బాధ నటిస్తూ అడుగుకొనగా సరే తీనుకోండి అంటూ మీ తండ్రి వారికి తన ఆయుస్సును దావమిచ్చేసాడు. నీవు కూడా వారికి ఏమాత్రం తీసిపోవు. నీవు ముల్లోకాలనూ పాలించావు. ఇంద్రాది దేవతలను ఓడించావు. దానమివ్వడంలోనూ సుగుణాలలోనూ మీ పెద్దలకు సమానమైన వాడవు అయ్యావు. రాక్షసులను రక్షించడంలో సమర్ధుడవు అయ్యావు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=74&Padyam=562

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, December 15, 2016

వామన వైభవం - 55:

8-559-క.
"పగవాఁడు మడియ నోపును
దెగడేనియు నెదురుపడఁడె? దేహధరులకుం
దెగిన యెడఁ బగఱ మీఁదనుఁ
బగఁ గొనఁ దగ ద నుచు నుడిగెఁ బ్రాభవశక్తిన్. "
8-560-వ.
అతండు మీ ప్రపితామహుం; డతని గుణంబు లనేకంబులు గలవు; అవి యట్లుండనిమ్ము.

టీకా:
పగవాడు = శత్రువు; మడియన్ = మరణించియుండి; ఓపున్ = ఉండవచ్చును; తెగడు = మరణించక ఉన్నవాడు; ఏనియున్ = అయినచో; ఎదురుపడడె = ఎదుర్కొనెడివాడేకదా; దేహధరుల్ = జీవుల; కున్ = కు; తెగిన = మరణించిన; ఎడన్ = తరువాత; పగఱ = శత్రువుల; మీదనున్ = పైన; పగగొన = పగబూనుట; తగదు = యుక్తముకాదు; అనుచునున్ = అనుచు; ఉడిగెన్ = విడిచెను; ప్రాభవశక్తిన్ = దండయాత్రను;


                                                      అతండు = అటువంటివాడు; మీ = మీ యొక్క; ప్రపితామహుండు = ముత్తాత; అతని = అతని యొక్క; గుణంబుల్ = గొప్పగుణములు; అనేకంబులు = చాలా; కలవు = ఉన్నాయి; అవి = వానిని; అట్లు = అలా; ఉండనిమ్ము = ఉండనియ్యి.

భావము:
నా శత్రువు మరణించి ఉండవచ్చు. మరణించకుండా ఉండి ఉంటే నన్ను ఎదుర్కొనేవాడే కదా. మరణించిన పగవారిపై పగబూనడం తగదు. ఈ విధంగా అనుకొని దండయాత్ర ఆపేసాడు. అలాంటి మీ ముత్తాత హిరణ్యకశిపుడు గుణాలు లెక్కలేనన్ని ఉన్నాయి అనుకో. వాటిని అలా ఉండనీ.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=74&Padyam=559

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday, December 14, 2016

వామన వైభవం - 54:

8-557-మ.
ఎదురై పోర జయింప రా దితనిఁ; గా కెందేనియుం బోవ భీ
ప్రదుఁడై ప్రాణులఁ దోలు మృత్యువు క్రియం బైవచ్చు నంచుం గ్రియా
విదుఁ డబ్జాక్షుఁడు సూక్ష్మరూపమున నావేశించె నిశ్శ్వాస రం
ధ్ర దిశన్ దైత్యు హృదంతరాళమునఁ బ్రత్యక్షక్రియాభీరుఁడై.
8-558-వ.
అంత నద్దైత్యవల్లభుండు వైష్ణవాలయంబు జొచ్చి వెదకి హరిం గానక కోపంబు మానక మిన్ను మన్ను నన్వేషించి త్రిదివంబు నరసి, దిశలం బరికించి, భూ వివరంబులు వీక్షించి, సముద్రంబులు వెదకి, పురంబులు శోధించి, వనంబులు విమర్శించి, పాతాళంబు పరీక్షించి, జగంబున నదృష్టశత్రుండై మార్గణంబు చాలించి, తనలో నిట్లనియె.



టీకా:
ఎదురై = ఎదిరించి; పోర = యుద్ధము చేయుటకు; జయింపన్ = జయించుటకు; రాదు = వీలుకాదు; ఇతనిన్ = ఇతనిని; కాక = అలాకాకుండగ; ఎందేనియున్ = ఎక్కడకైనను; పోవన్ = పోయినచో; భీప్రదుడు = భయముకలిగించెడివాడు; ఐ = అయ్యి; ప్రాణులన్ = జీవులను; తోలున్ = తరుమును; మృత్యువు = మరణము; క్రియన్ = వలె; పైవచ్చు = మీదికివచ్చును; అంచున్ = అనుచు; క్రియా = ఉపాయము; విదుడు = తెలిసినవాడు; అబ్జాక్షుడు = నారాయణుడు; సూక్ష్మ = చాలాచిన్న; రూపమునన్ = రూపముతో; ఆవేశించె = ప్రవేశించెను; నిశ్వాసరంధ్ర = ముక్కు; దిశన్ = ద్వారా; దైత్యు = రాక్షసుని; హృదయ = హృదయము; అంతరాళమునన్ = లోనికి; ప్రత్యక్షక్రియా = ఎదుర్కొనుటకు; భీరుడు = బెదరినవాడు; ఐ = అయ్యి. అంతన్ = అంతట; ఆ = ఆ; దైత్య = రాక్షస; వల్లభుండు = రాజు; వైష్ణవాలయంబున్ = వైకుంఠమును {వైష్ణవాలయము -విష్ణువు యొక్క నివాసము, వైకుంఠము}; చొచ్చి = ప్రవేశించి; వెదకి = అన్వేషించి; హరిన్ = విష్ణుని; కానక = కనుగొనలేక; కోపంబు = కోపము; మానక = వదలకుండ; మిన్ను = ఆకాశము; మన్ను = నేల; అన్వేషించి = వెతికి; త్రిదివంబున్ = స్వర్గమును {త్రిదివము - భూర్భువస్సువః త్రిలోకములలోని మూడవది, స్వర్గము}; అరసి = గాలించి; దిశలన్ = దిక్కులను; పరికించి = పరిశీలించిచూసి; భూవివరంబులున్ = బొరియ గుహాదులందు; వీక్షించి = చూసి; సముద్రంబులు = సముద్రములలో; వెదకి = అన్వేషించి; పురంబులు = పట్టణములు; శోధించి = వెతికి; వనంబులున్ = అడవులను; విమర్శించి = గాలించి; పాతాళంబున్ = పాతాళమును; పరీక్షించి = వెతికి; జగంబునన్ = జగత్తునందు; అదృష్ట = కనబడని; శత్రుండు = శత్రువు కలవాడు; ఐ = అయ్యి; మార్గణంబు = వెతకుట; చాలించి = ఆపివేసి; తన = తన; లోనన్ = మనసులో; ఇట్లు = ఇలా; అనియె = అనుకొనెను.

భావము:
ఈ హిరణ్యకశిపుడిని యుద్ధంలో ఎదిరించి జయించడానికి వీలుకాదు. అలాకాకుండా నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇక లోకంలోని ప్రాణులపైకి మృత్యువు మాదిరిగా దండెత్తి భయపెట్టి పారద్రోలుతాడు అనుకొని విష్ణువు ఉపాయాన్ని ఆలోచించాడు. సూక్ష్మరూపంతో ముక్కురంధ్రం గుండా హిరణ్యకశిపుని గుండెలో ప్రవేశించాడు. ఆ తరువాత ఆ రాక్షసేంద్రుడు హిరణ్యకశిపుడి వైకుంఠం ప్రవేశించి, విష్ణువు కోసం వెదకాడు. కానీ పగవాడు కనిపించ లేదు. కోపంతో ఆ రాక్షసుడు విష్ణువు కోసం ఆకాశాన్ని, భూలోకాన్ని, స్వర్గలోకాన్ని గాలించాడు. సకల దిక్కులనూ, భూగర్భాలనూ, సముద్రాలనూ, పట్టణాలనూ, అడవులనూ అంతటా వెదకాడు. లోకంలో విష్ణువుజాడ ఎక్కడా చిక్కలేదు. కడకు వెతుకుట ఆపి ఇలా అనుకున్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=74&Padyam=557

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, December 13, 2016

వామన వైభవం - 53:

8-555-వ.
తొల్లి మీ మూఁడవ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు జేసి గదాయుధుండై భూతలంబునఁ బ్రతివీరులం గానక సంచరింప విష్ణుండు వరాహరూపంబున నతని సమయించె; తద్భ్రాత యగు హిరణ్యకశిపుఁ డది విని హరిపరాక్రమంబునకు నాశ్చర్యంబు నొంది తన జయంబును బలంబునుం బరిహసించి గ్రద్దన నుద్దవిడి నద్దనుజమర్దను మందిరంబునకుం జనియె; అప్పుడు.
8-556-క.
శూలాయుధహస్తుండై
కాలాకృతి వచ్చు దనుజుఁ గని విష్ణుండుం
గాలజ్ఞత మాయాగుణ
శీలత నిట్లని తలంచెఁ జిత్తములోనన్.

టీకా:
తొల్లి = పూర్వము; మీ = మీ యొక్క; మూడవతాత = ముత్తాత; హిరణ్యాక్షుండు = హిరణ్యాక్షుడు; విశ్వ = జగత్తంతటిని; జయంబుచేసి = జయించి; గదాయుధుండు = గదాయుధమువాడు; భూతలంబునన్ = భూమండలముమీద; ప్రతివీరులన్ = ఎదిరించగలశూరులను; కానక = కనపడనివిధముగ; సంచరింపన్ = తిరుగుతుండగ; విష్ణుండు = నారాయణుడు; వరాహ = వరాహ; రూపంబునన్ = అవతారముతో; అతనిన్ = అతడిని; సమయించె = సంహరించెను; తత్ = అతని; భ్రాత = సహోదరుడు; అగు = అయిన; హిరణ్యకశిపుడు = హిరణ్యకశిపుడు; అది = ఆ విషయమును; విని = విని; హరి = నారాయణుని; పరాక్రమంబున్ = పరాక్రమమునకు; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; ఒంది = పొంది; తన = అతని; జయంబును = జయశీలమును; బలంబునున్ = శక్తిని; పరుహరించి = తూలనాడి; గ్రద్దనన్ = వెంటనే; ఉద్దవిడిన్ = దండెత్తి; ఆ = ఆ; దనుజమర్దను = వైకుంఠుని; మందిరమున్ = వైకుంఠమున; కున్ = కు; చనియె = వెళ్ళెను; అప్పుడు = ఆ సమయమునందు.
శూలా = శూలము యనెడి; ఆయుధ = ఆయుధము; హస్తుండు = చేతగలవాడు; ఐ = అయ్యి; కాలా = యముని; ఆకృతిన్ = వలె; వచ్చు = వచ్చెడి; దనుజున్ = రాక్షసుని; కని = చూసి; విష్ణుండున్ = నారాయణుడు; కాలజ్ఞతన్ = సమయజ్ఞతతో; మాయా = మాయగల; గుణశీలతన్ = లక్షణములతో; ఇట్లు = ఇలా; అ = అని; తలచెన్ = భావించెను; చిత్తము = మనసు; లోనన్ = అందు.



భావము:
పూర్వం మీ మూడవ తరం తాత అయిన హిరణ్యాక్షుడు విశ్వాన్ని జయించి గదా దండాన్ని ధరించి భూలోకం అంతా తిరిగాడు. ఎక్కడా పగవాడు కనిపించలేదు. చివరకు అతనిని విష్ణువు వరాహరూపంలో పరిమార్చాడు. ఆ సంగతిని హిరణ్యాక్షుని సోదరుడైన హిరణ్యకశిపుడు విన్నాడు. విష్ణువు పరాక్రమానికి ఆశ్చర్యపడ్డాడు. విష్ణువు విజయాన్ని బలాన్ని తూలనాడాడు. వెంటనే అసురమర్దనుడు విష్ణువు యొక్క పట్టణమైన వైకుంఠంపై దండెత్తాడు. అప్పుడు శూలాన్ని ధరించి ప్రళయకాల యమునివలె వస్తున్న హిరణ్యకశిపుణ్ణి చూసి, సమయాసమయములు గుర్తించగల మాయలమారి కనుక, విష్ణువు తన మనస్సులో ఇలా ఆలోచించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=74&Padyam=556

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, December 12, 2016

వామన వైభవం - 52:

8-554-సీ.
జననాథ! నీ మాట సత్యంబు సత్కీర్తి;
దంబు గులార్హంబు ధర్మయుతముఁ
గరుణానువర్తులు ఘనసత్త్వమూర్తులు;
కాని మీ కులమందుఁ గలుగ రొరులు
రణభీరువులు వితరణభీరువులు లేరు;
ప్రత్యర్థు లర్థులు ప్రబ్బికొనిన
దానశౌండిమమునఁ దనుపుదు రధికులై;
మీ తాత లందఱు మేటిమగలు
8-554.1-ఆ.
మీ కులంబునందు మెఱయుఁ బ్రహ్లాదుండు
మింటి చంద్రుమాడ్కి మేలి రుచులఁ
బ్రథిత కీర్తితోడ భవదీయవంశంబు
నీరరాశి భంగి నెగడు చుండు.



టీకా:
జననాథ = రాజా; నీ = నీ యొక్క; మాట = మాటలు; సత్యంబు = యధార్థములు; సత్ = మంచి; కీర్తిదంబు = కీర్తినిచ్చెడివి; కులా = కులస్తులకు; అర్హంబు = తగినవి; ధర్మయుతమున్ = ధర్మబద్దమైనవి; కరుణా = కనికరముకలిగి; అనువర్తులు = నడచువారు; ఘన = మిక్కలి; సత్త్వ = సత్త్వగుణ; మూర్తులు = స్వరూపులు; కాని = తప్పించి; మీ = మీ యొక్క; కులము = వంశము; అందున్ = లో; కలుగరు = పుట్టరు; ఒరులు = ఇతరులు; రణ = యుద్దమునందు; భీరువులున్ = పిరికివారు; వితరణ = దానము చేయుట యందు; భీరువులున్ = వెనుదీయువారు; లేరు = లేరు; ప్రత్యర్థులున్ = శత్రులు; అర్థులున్ = యాచకులు; ప్రబ్బికొనిన = కమ్ముకొనగా; దాన = దానములతోను; శౌండిమమునన్ = పరాక్రమముతోను; తనుపుదురు = తృప్తికలిగించెదరు; అధికులు = అతిశయించినవారు; ఐ = అయ్యి; మీ = మీ యొక్క; తాతలు = పితామహులు; అందఱున్ = అందరు; మేటి = గొప్ప; మగలు = శూరులు.
మీ = మీ యొక్క; కులంబున్ = వంశము; అందున్ = లో; మెఱయు = ప్రకాశించెడి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; మింటి = ఆకామందున్న; చంద్రు = చంద్రుని; మాడ్కిన్ = వలె; మేలి = శ్రేష్ఠమైన; రుచులన్ = కాంతులతో; పృథిత = పెద్దదైన; కీర్తి = కీర్తి; తోడన్ = తోటి; భవదీయ = నీ యొక్క; వంశంబు = వంశము; నీరరాశి = సముద్రము {నీరరాశి - నీరు రాశిగాగలది, కడలి}; భంగిన్ = వలె; నెగడుచుండున్ = ప్రకాశించును.

భావము:
ఇప్పుడు నాతో నీవు అన్నమాట యదార్థం. మంచి కీర్తిని ఇచ్చేది నీ వంశానికి తగినది ధర్మంతో కూడినది మీ వంశం. మీకులంలో కనికరం కలవారూ ఆత్మబలం కలవారూ తప్ప వేరేవారు పుట్టలేదు. మీతో యుద్ధం చెయ్యడానికి గానీ, దానం ఇవ్వడానికి గానీ భయపడేవారు ఎవరూ లేరు. దరిచేరిన ప్రత్యర్ధులకు పరాక్రమంతోనూ, దేహి అనే అర్ధులకు దానంతోనూ తృప్తి కలిగిస్తారు. మీ తాతలు అందరూ గొప్ప మేటివీరులు. ఆకాశంలో వెలిగే చంద్రునిలా మీ వంశంలో ప్రహ్లాదుడు మేలైన కాంతివంతమైన కీర్తితో ప్రకాశిస్తాడు. మీ వంశం సమృద్ధమైన ఆ కీర్తితో సముద్రం వలె పెంపారుతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=74&Padyam=554

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :



Sunday, December 11, 2016

వామన వైభవం - 51:

8-552-సీ.
"ఇది నాకు నెలవని యేరీతిఁ బలుకుదు? ;
నొక చో టనక యెందు నుండ నేర్తు;
నెవ్వనివాఁడ నం చేమని నుడువుదు? ;
నా యంతవాఁడనై నడవనేర్తు;
నీ నడవడి యని యెట్లు వక్కాణింతుఁ? ;
బూని ముప్పోకల బోవ నేర్తు;
నదినేర్తు నిదినేర్తు నని యేలఁ జెప్పంగ? ;
నేరుపు లన్నియు నేన నేర్తు;
8-552.1-తే.
నొరులుఁ గారు నాకు నొరులకు నే నౌదు
నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు
సిరియుఁ దొల్లి గలదు చెప్పెద నా టెంకి
సుజనులందుఁ దఱచు చొచ్చియుందు.
8-553-వ.
అది యట్లుండ నిమ్ము.



టీకా:
ఇది = దీనిని; నా = నా; కున్ = కు; నెలవు = నివాసము; అని = అని; ఏ = ఏ; రీతిన్ = విధముగా; పలుకుదు = చెప్పెగలను; ఒక = ప్రత్యేకముగ ఒక; చోటు = ప్రదేశము; అనకన్ = అనకుండ; ఎందున్ = ఎక్కడైనను; ఉండనేర్తున్ = ఉండగలను; ఎవ్వని = ఎవరికిచెందిన; వాడన్ = వాడిని; అంచున్ = అనుచు; ఏమి = ఏమి; అని = అని; నుడువుదున్ = చెప్పెగలను; నా = నా; అంతవాడను = అంతవాడినినేనే; ఐ = అయ్యి; నడవనేర్తు = స్వేచ్చగావర్తించెదను; ఈ = ఇలాంటి; నడవడి = వర్తనకలవాడను; అని = అని; ఎట్లు = ఎలా; వక్కాణింతున్ = చెప్పగలను; పూని = ధృతితో; ముప్పోకలన్ = మూడు పోకడలు {ముప్పోకలు - మూడుపోకడలు, 1సత్త్వగుణము 2రజగుణము 3తమోగుణములుకల మూడువిధములు, 1శ్రవణ 2అధ్యయన 3ఉపన్యాస అనెడి మూడు విద్యలు, 1ముందుకు 2వెనుకుక 3పక్కలకు అనెడి మూడు గమనములు}; పోవనేర్తు = వెళ్ళగలను; అది = అది; నేర్తున్ = తెలుసును; ఇది = ఇది; నేర్తున్ = తెలుసును; అని = అని; ఏల = ఎందుకు; చెప్పంగన్ = చెప్పడము; నేరుపులు = విద్యలు; అన్నియున్ = అన్ని; నేన = నాకే; నేర్తున్ = తెలుసును; ఒరులు = ఇతరులు; కారు = ఏమీకారు. నా = నా; కున్ = కు; ఒరుల = ఇతరుల; కున్ = కు; నేన్ = నేను; ఔదు = ఉపయోగపడెదను; ఒంటి = ఒంటరి, అనితరమైన; వాడన్ = వాడిని; చుట్టము = బంధువు; ఒకడు = ఒక్కడుకూడ; లేడు = లేడు; సిరియున్ = లక్ష్మీదేవి, సంపద; తొల్లి = ఇంతకుముందు; కలదు = ఉన్నది; చెప్పెదన్ = తెలియచెప్పెదను; నా = నా యొక్క; టెంకి = నివాసము; సుజనులు = మంచివారి, పుణ్యాత్ముల; అందున్ = లో, ఎడల; తఱచు = ఎక్కువగా, ఎక్కువమార్లు; చొచ్చి = కూడి, చొరవకలిగి; ఉందున్ = ఉంటాను. అది = దాని; అట్లు = అలా; ఉండనిమ్ము = ఉండనియ్యి.

భావము:
“ఇది నా చోటు అని ఎలా చెప్పగలను? ఒక చోటనకుండా అన్ని చోట్లా ఉంటాను. ఎవరికి చెందినవాడనని చెప్పగలను? నేను నా అంతవాడనై స్వేచ్ఛగా నడుచుకుంటాను. నా నడవడి ఇది అని ఎలా చెప్పగలను? పూనికతో మూడుపోకడలూ పొగలను. అది ఇది నేర్చుకున్నానని చెప్పడము ఎందుకు గానీ, అన్ని విద్యలూ నేర్చుకున్నాను. వేరే వారు ఎవ్వరూ నన్ను చేరదీయరు. నేనే వారిని చేరదీస్తాను. నేను ఒంటరివాణ్ణి. చుట్టాలు ఎవరూ లేరు. ఇంతకు ముందు నాకు సిరికూడా ఉండేది. ఎక్కువగా నేను మంచివారితో కలిసి మసలుతుంటాను. అదే నా నివాసము. ఆ సంగతి అట్లుండనీ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=74&Padyam=552

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Saturday, December 10, 2016

వామన వైభవం - 50:


8-550-మ.
వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా! "
8-551-వ.
అని ధర్మయుక్తంబుగాఁ బలికిన వైరోచని వచనంబులు విని సంతోషించి యీశ్వరుం డిట్లనియె.



టీకా:
వర = మంచి; చేలంబులో = బట్టలుకాని; మాడలో = సువర్ణ నాణెములుకాని {మాడ - అరవరహా, ఒక సువర్ణనాణెము}; ఫలములో = పళ్ళుకాని; వన్యంబులో = వనములుకాని; గోవులో = పశువులుకాని; హరులో = గుర్రములుకాని; రత్నములో = మణులుకాని; రథంబులో = రథములుకాని; విమృష్టాన్నంబులో = మంచి ఆహారములు కాని; కన్యలో = స్త్రీలుకాని; కరులు = ఏనుగులుకాని; కాంచనమో = బంగారము కాని; నికేతనములో = ఇళ్శుకాని; గ్రామంబులో = ఊళ్ళుకాని; భూములో = పొలములుకాని; ధరణీఖండమో = భూభాగముకాని; కాక = కాకపోతే; ఏమి = ఏది; అడిగెదో = అడిగెదవు; ధాత్రీసుర = బ్రాహ్మణ; ఇంద్ర = శ్రేష్ఠులలో; ఉత్తమా = ఉత్తముడా. అని = అని; ధర్మయుక్తంబుగాన్ = ధర్మబద్దముగా; పలికిన = అడిగిన; వైరోచని = బలిచక్రవర్తి {వైరోచని - విరోచనుని పుత్రుడు, బలి}; వచనంబులు = మాటలు; విని = విని; సంతోషించి = ఆనందించి; ఈశ్వరుండు = భగవంతుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:
ఓ బ్రాహ్మణోత్తముడా! నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రములా, డబ్బులా, పండ్లా, అడవి సంపదలా, గోవులా, గుర్రాలా, రత్నాలా, రథాలా, మంచి ఆహారాలా, కన్యలా, ఏనుగులా, బంగారమా, భవనాలా, గ్రామాలా, పొలాలా, భూభాగాలా లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నావా? ఇలా ధర్మబద్ధంగా బలిచక్రవర్తి పలికిన పలుకులకు సంతోషించిన భగవంతుడైన వామనుడు ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=73&Padyam=550

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Friday, December 9, 2016

వామన వైభవం - 49:

8-549-మ.
"వడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలంబెయ్య? ది
య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యెన్వంశమున్ జన్మముం;
గడుధన్యాత్ముఁడనైతి; నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్
గడతేఱెన్; సుహుతంబులయ్యె శిఖులుం; గల్యాణ మిక్కాలమున్.


టీకా:
వడుగా = బ్రహ్మచారి; ఎవ్వరివాడవు = ఎవరిపిల్లవాడవు; ఎవరవు = ఎవరివినీవు; సంవాస = ఉండెడి; స్థలంబు = చోటు; ఎయ్యెడకున్ = ఎక్కడ; నీవు = నీవు; అరుదెంచుటన్ = వచ్చుటచేత; సఫలము = సార్థకము; అయ్యెన్ = అయినది; వంశమున్ = (నా) వంశము; జన్మమున్ = పుట్టుక; కడు = మిక్కలి; ధన్యాత్ముడను = పుణ్యాత్ముడను; ఐతిన్ = అయ్యాను; ఈ = ఈయొక్క; మఖమున్ = యాగము; యోగ్యంబు = పవిత్రమైనది; అయ్యెన్ = అయినది; నా = నా యొక్క; కోరికల్ = మనోవాంఛితములు; కడతేఱెన్ = తీరిపోయినవి; సుహుతంబులు = చక్కగా కాలుతున్నవి; అయ్యెన్ = అయినవి; శిఖులున్ = అగ్నులు; కల్యాణము = మిక్కలి శుభదాయకము; ఈ = ఈ; కాలమున్ = సమయము. 

భావము:
“ఓ బ్రహ్మచారీ! నీపేరేమిటి? ఎవరి పిల్లవాడవు? నీవు నివసించే చోటేది? ఇక్కడికి నీవు రావడం వల్ల నా వంశమూ నా జన్మ సఫలము అయ్యాయి. నేను చాలా పుణ్యాత్ముడను అయ్యాను. ఈ యజ్ఞం పవిత్రం అయింది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు బాగా వేల్వబడ్డాయి. ఈ సమయం చాలా శుభదాయకం అయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=73&Padyam=549

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Thursday, December 8, 2016

వామన వైభవం - 48:

8-547-ఆ.
వటుని పాద శౌచవారి శిరంబునఁ
బరమ భద్ర మనుచు బలి వహించె
నే జలము గిరీశుఁ డిందుజూటుఁడు దేవ
దేవుఁ డుద్వహించె ధృతి శిరమున.
8-548-వ.
మఱియు నయ్యజమానుం డభ్యాగతున కిట్లనియె.

టీకా:
వటుని = బ్రహ్మచారి; పాద = పాదములు; శౌచ = కడిగిన; వారిన్ = నీటిని; శిరంబునన్ = తలపైన; పరమ = మిక్కలి; భద్రము = శుభకరము; అనుచు = అనుచు; బలి = బలి; వహించెన్ = ధరించెను; ఏ = ఎట్టి; జలమున్ = నీటిని; గిరీశుండు = పరమశివుడు {గిరీశుడు - గిరి (కైలాసగిరిపైనున్న) ఈశుడు (ప్రభువు), శంకరుడు}; ఇందుజూటుండు = పరమశివుడు {ఇందుజూటుండు - ఇందు (చంద్రుని) జూటుండు (జటాజూటమున కలవాడు), శంకరుడు}; దేవదేవుడు = పరమశివుడు {దేవదేవుడు - మహాదేవుడు, శంకరుడు}; ఉద్వహించెన్ = చక్కగాధరించెను; ధృతిన్ = పూని; శిరమునన్ = తలపైన. మఱియున్ = అటుపిమ్మట; ఆ = ఆ; యజమానుండు = యజ్ఞముచేయువాడు; అభ్యాగతున్ = అతిథి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
జటాజూటంలో చంద్రుని ధరించిన మహాదేవుడైన శివుడు ఎల్లప్పుడూ ఏనీళ్ళను తలపై ధరిస్తాడో, అటువంటి వామనుని కాళ్లు కడిగిన నీళ్ళను బలిచక్రవర్తి మేలుకలిగించేవిగా తలచి తలపై చల్లుకున్నాడు. అలా కాళ్ళు కడిగి తలపై జల్లుకున్న ఆ చక్రవర్తి అతిథిగా వచ్చిన ఆ వామనునితో ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=547

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Wednesday, December 7, 2016

వామన వైభవం - 47:

8-545-ఉ.
స్వస్తి జగత్త్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర వి
ద్వస్త నిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం
ద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు, నిర్జరీగళ
న్యస్త సువర్ణసూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకున్.
8-546-వ.
అని దీవించి కరచరణాద్యవయవంబులు ధరించిన వేదరాశియుం బోలె ముందట నకుటిలుండును, జటిలుండును, సదండఛత్రుండునుఁ, గక్షలంబిత బిక్షాపాత్రుండునుఁ, గరకలిత జల కమండలుండును, మనోహరవదన చంద్రమండలుండును, మాయావాదన నటుండును నగు వటునిం గని దినకర కిరణ పిహితంబులైన గ్రహంబుల చందంబునఁ దిరోహితులై భృగువులుఁ గూర్చున్న యెడల లేచి క్షేమం బడిగి తియ్యని మాటల నాదరించిరి; బలియును నమస్కరించి తగిన గద్దియ నునిచి, పాదంబులుఁ దుడిచి తన ప్రాణవల్లభ పసిండి గిండియల నుదకంబు పోయ వడుగు కొమరుని చరణంబులఁ గడిగి తడి యొత్తి తత్సమయంబున.



టీకా:
స్వస్తి = శుభమగుగాక; జగత్రయీ = ముల్లోకములలోని; భువన = ప్రపంచములను; శాసన = పరిపాలించెడి; కర్త = అధికారి; కున్ = కి; హాసమాత్ర = అవలీలగా {హాసమాత్రము - నవ్వుఒక్కదానితో, అవలీలగా}; విద్వస్త = వెలవెలపోగొట్టబడిన; నిలింపభర్త = దేవేంద్రుడుకలవాని; కున్ = కి; ఉదార = ఉన్నతమైన; పద = పదవులలో; వ్యవహర్త = మెలగెడువాని; కున్ = కి; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులచే; స్తుత = కీర్తింపబడిన; మంగళ = శుభకరమైన; అధ్వర = యజ్ఞముల; విధాన = కార్యక్రమములలో; విహర్త = మెలగునాని; కున్ = కి; నిర్జర = దేవతల; గళ = మెడలో; న్యస్త = ఉన్నట్టి; సువర్ణ = బంగారు; సూత్ర = మంగళసూత్రముల; పరిహర్త = తొలగించెడివాని; కున్ = కి; దానవ = రాక్షసులు; లోక = అందరికి; భర్త = రాజు; కున్ = కి. అని = అని; దీవించి = దీవించి; కర = చేతులు; చరణ = కాళ్ళు; ఆది = మున్నగు; అవయవంబులున్ = అవయవములను; ధరించిన = స్వీకరించిన; వేద = వేదముల; రాశియున్ = సమూహము; పోలెన్ = సరిపోలి; ముందటన్ = ఎదురుగ; అకుటిలుండును = అమాయకుడు; జటిలుండును = జటలుకట్టినజుట్టుకలవాడు; సదండఛత్రుండునున్ = దండముగొడుగుగలవాడు; కక్షన్ = చంకలో; లంబిత = వేల్లాడుచున్న; బిక్షాపాత్రుండును = బిక్షాపాత్ర కలవాడు; కర = చేతిలో; కలిత = ఉన్నట్టి; జల = నీరుగల; కమండులుడును = కమండలము కలవాడు; మనోహర = అందమైన; వదన = మోము యనెడి; చంద్రమండలుండును = చంద్రమండలమువాడు; మాయావాదన = చతురోక్తులతో; నటుండును = వర్తించువాడు; అగు = అయిన; వటునిన్ = బ్రహ్మచారిని; కని = చూసి; దినకర = సూర్య {దినకరుడు - దినము (పగలును) కరుడు (కలిగించెడివాడు), సూర్యుడు}; కిరణ = కిరణములచే; పిహితంబులు = కప్పబడినవి; ఐన = అయిన; గ్రహంబుల = గ్రహముల; చందంబునన్ = వలె; తిరోహితులు = మరుగుపడినవారు; ఐ = అయ్యి; భృగువులున్ = భృగునిప్రజనులు; కూర్చున్న = కూర్చొనియున్న; ఎడలన్ = చోటులందు; లేచి = లేచినిలబడి; క్షేమంబున్ = కుశలప్రశ్నలు; అడిగి = అడిగి; తియ్యని = మృదువైన; మాటలన్ = మాటలతో; ఆదరించిరి = ఆదరముగపలకరించిరి; బలియును = బలికూడ; నమస్కరించి = నమస్కారముచేసి; తగిన = యుక్తమైన; గద్దియను = ఆసనమున; ఉనిచి = కూర్చొనబెట్టి; పాదంబులున్ = పాదములను; తుడుచి = తుడిచి; తన = తనయొక్క; ప్రాణవల్లభ = ఇల్లాలు {ప్రాణవల్లభ - ప్రాణములతోసమానమైన వల్లభ (ప్రియురాలు), భార్య}; పసిండి = బంగారు; గిండియలన్ = చెంబులతో; ఉదకంబు = నీరు; పోయ = పోయగా; వడుగు = బ్రహ్మచారి; కొమరుని = పిల్లవాని; చరణంబులు = కాళ్ళు, పాదములు; కడిగి = కడిగి; తడి = తడిని; ఒత్తి = పొడిబట్టతోతుడిచి; తత్ = ఆ; సమయంబునన్ = సమయమునందు.

భావము:
“ముల్లోకాలనూ శాశించే అధికారం కలవాడా నీకు స్వస్తి! అవలీలగా దేవేంద్రుడంత వానిని వెలవెల పోయేలా చేసినవాడా! ఉన్నత పదవిలో మెలిగేవాడా! మునీంద్రుల పొగడ్తలందుకున్న శుభకరమైన యాగకార్యాలతో విహరించేవాడా! దేవతాస్త్రీల మెడలలోని బంగారు మంగళసూత్రాలను తొలగించేవాడా! సమస్త రాక్షసలోక సార్వభౌముడా! నీకు శుభ మగుగాక.” అలా బలిని దీవించిన వామనుడు కరచరణాలతో మానవాకారం ధరించిన వేదరాశివలె అతని ముందు నిలబడ్డాడు. జడలుకట్టిన జుట్టు, దండమూ, గొడుగు, కమండలం ధరించి ఉన్నాడు. అతని చంకలో భిక్షాపాత్ర వ్రేలాడుతున్నది. అతని ముఖం చంద్రబింబంవలె అందంగా వుంది. మాయా వాదనల చతురోక్తులు పలుకుటలో అతడు నేర్పరి. సూర్యుని కిరణాలతో కప్పబడి వెలవెల పోయిన ఇతర గ్రహాలమాదిరిగా ఆ బ్రహ్మచారి ముందు భృగువంశపు బ్రాహ్మణులు మరుగుపడిపోయారు. వారు కూర్చున్న చోటు నుండి లేచి నిలబడి వామనుని క్షేమాన్ని అడిగి తియ్యని మాటలతో అతణ్ని గౌరవించారు. బలిచక్రవర్తి అతనికి మ్రొక్కి ఆసనంపై కూర్చోపెట్టాడు. అతని అడుగులను తుడిచాడు. తన ఇల్లాలు బంగారు కలశంతో నీళ్ళు పోయగా, రాక్షస చక్రవర్తి ఆ వడుగు అడుగులు కడిగి తడి తుడిచాడు. ఆ సమయంలో. . .
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=545

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Tuesday, December 6, 2016

వామన వైభవం - 46:


8-543-మ.
ఇతఁడే దానవచక్రవర్తి సురలోకేంద్రాగ్నికాలాది ది
క్పతి గర్వాపనయప్రవర్తి, గతలోభస్ఫూర్తి, నానా మఖ
వ్రతదానప్రవణానువర్తి, సుమనోరామామనోభేదనో
ద్ధత చంద్రాతపకీర్తి, సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తి దాన్.
8-544-వ.
అని కుశ పవిత్రాక్షత సంయుతం బయిన దక్షిణహస్తంబు సాఁచి యిట్లనియె.



టీకా:
ఇతడే = ఇతనేనా; దానవ = రాక్షస; చక్రవర్తి = చక్రవర్తి; సురలోకేంద్ర = దేవేంద్రుడు; అగ్ని = అగ్నిదేవుడు; కాల = యముడు; ఆది = మున్నగు; దిక్పతి = దికపాలకుల; గర్వ = గర్వమును; అపనయ = తొలగించిన; ప్రవర్తి = మొనగాడు; గత = నశించిన; లోభ = లోభము; స్పూర్తిన్ = ప్రకాశించగా; నానా = పలు; మఖ = యాగములు; వ్రత = వ్రతములు; దాన = దానముచేసెడి; ప్రవణ = సమర్థతతో; అనువర్తి = నడచెడివాడు; సుమనస్ = దేవతా; రామా = స్త్రీల; మనస్ = మనస్సులను; భేదన = కలవరపాటును; ఉద్ధత = పెంచెడి; చంద్ర = చంద్రుని; ఆతప = వెన్నెలవంటి; కీర్తిన్ = కీర్తి కలవాడు; సత్య = సత్యసంధత; కరుణా = దయా హృదయము; ధర్మ = ధర్మబుద్ధులతో; ఉల్లసత్ = ఉల్లాసవంతమైన; మూర్తి = వ్యక్తి; తాన్ = అతను. అని = అని పలికి; కుశ = దర్భలు; పవిత్ర = పవిత్రమైన; అక్షత = అక్షతలు; సంయుతంబు = కలిగినది; అయిన = ఐన; దక్షిణ = కుడి; హస్తంబున్ = చేతిని; సాచి = చాచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
“ఇతడేనా రాక్షసచక్రవర్తి! ఇతడేనా దేవేంద్రుడు, అగ్ని, యముడూ మొదలైన దిక్పాలకుల గర్వాన్ని తొలగించిన మొనగాడు! ఇతడేనా అత్యాశలేని నిండైన హృదయం కలవాడు! ఇతడేనా పెక్కు యజ్ఞాల పుణ్యకార్యాలలో ప్రీతితో దానమిచ్చేవాడు! ఇతడేనా దేవతాస్త్రీల మనస్సులను కలవరపెట్టే వెన్నెలవంటి కీర్తికలవాడు! ఇతడేనా సత్యంతో ధర్మంతో ప్రకాశించే స్వరూపం కలవాడు!”. ఇలా పలికి, పవిత్రమైన దర్భలూ అక్షతలూ పట్టుకున్న తన కుడిచెయ్యి సాచి వామనుడు ఇలా అన్నాడు
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=543

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Monday, December 5, 2016

వామన వైభవం - 45:


8-541-క.
వెడవెడ నడకలు నడచుచు
నెడనెడ నడు గిడక నడరి యిల దిగఁబడగా
బుడిబుడి నొడువులు నొడువుచుఁ
జిడిముడి తడఁబడగ వడుగు చేరెన్ రాజున్.
8-542-వ.
ఇట్లు డగ్గఱి మాయాబిక్షుకుండు రక్షోవల్లభుం జూచి యిట్లనియె.

టీకా:
వెడవెడన్ = మెల్లిమెల్లి; నడకలు = అడుగులుతో; నడచుచున్ = తిరుగుతు; ఎడనెడ = మధ్యమధ్యలో; అడుగు = అడుగులు; ఇడక = వేయకుండ; అడరి = బెదరి; ఇల = భూమి; దిగబడగా = కుంగిపోతుండగ; బుడిబుడి = చిన్నచిన్న; నొడువులున్ = మాటలు; నొడువుచున్ = పలుకుచు; చిడిముడిన్ = కలవరపాటుతో; తడబడగ = తడబడుతుండగ; వడుగు = బ్రహ్మచారి; చేరెన్ = సమీపించెను; రాజున్ = చక్రవర్తిని. ఇట్లు = ఇలా; డగ్గఱి = దగ్గరకుచేరి; మాయా = కపట; బిక్షకుండు = యాచకుడు; రక్షస్ = రాక్షసుల; వల్లభున్ = ప్రభువును; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:
వామనుడు మెల్లమెల్లగా అడుగులువేస్తూ నడిచాడు. అక్కడక్కడ నేల దిగబడుతుంటే అడుగులు తడబడుతు నడిచాడు. మధ్యలో కొద్దిగా మాట్లాడుతు, తడబడుతు, కలవరబడుతు బలిచక్రవర్తిని సమీపించాడు. (బలిచక్రవర్తి యాగశాలలోనికి వామనరూపంతో మయావటువుగా అవతరించిన విష్ణువు ప్రవేశించే ఘట్టం. పద్యం నడక వామనుని నడకతో పోటీపడుతోందా అన్నట్టు ఉంది.) అలా మాయాబిక్షుక రూపంలో ఉన్న వామనుడు ఆ దానవచక్రవర్తి అయిన బలిని చూసి ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=541

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

Sunday, December 4, 2016

వామన వైభవం - 44:

8-539-క.
కొందఱతోఁజర్చించును
గొందఱతో జటలు చెప్పు గోష్ఠిం జేయుం
గొందఱతోఁ దర్కించును
గొందఱతో ముచ్చటాడుఁ; గొందఱ నవ్వున్.
8-540-వ.
మఱియు ననేక విధంబుల నందఱకు నన్ని రూపులై వినోదించుచు.



టీకా:
కొందఱ = కొంతమంది; తోన్ = తోటి; చర్చించును = చర్చలుచేయును; జటలు = వేదపాఠములను {జట - వేదము చెప్పుటలో విశేషము - జట, ఘన}; చెప్పున్ = చదువును; గోష్ఠిన్ = సల్లాపములు; చేయున్ = ఆడును; కొందఱ = కొంతమంది; తోన్ = తోటి; తర్కించును = వాదించును; కొందఱ = కొంతమంది; తోన్ = తోటి; ముచ్చటలాడును = ముచ్చటించును; కొందఱన్ = కొందరితో; నవ్వున్ = నవ్వుతుండును. మఱియున్ = అంతేకాక; అనేక = పలు; విధంబులన్ = విధములుగా; అందఱ = అందరి; కున్ = కి; అన్ని = అన్ని; రూపులు = రకములుగా; ఐ = కనబడుచు; వినోదించెను = క్రీడించెను.

భావము:
ఆ సభలో వామనుడు కొందరితో వాదోపవాదాలు చేసాడు. కొందరితో కలిసి వేదాన్ని చదివాడు. కొందరితో చక్కగా సల్లాపాలు సాగించాడు. కొందరితో వాదించాడు. కొందరితో చక్కగా మాట్లాడాడు. అంతేకాకుండా అందరితోనూ అనేకవిధాలుగా వ్యవహరిస్తూ విహరించసాగాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=539

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : : 

Saturday, December 3, 2016

వామన వైభవం - 43:

వామన వైభవం - 43:

8-537-వ.
మఱియును
8-538-క.
వెఱచుచు వంగుచు వ్రాలుచు
నఱిముఱిఁ గబురులకుఁ జనుచు హరిహరి యనుచున్
మఱుఁగుచు నులుకుచు దిఱదిఱఁ
గురుమట్టపుఁ బడుచు వడుగుఁ గొంత నటించెన్.



టీకా:
మఱియును = అంతేకాక. వెఱచుచున్ = బెదురుతూ; వంగుచున్ = ఒరుగుచు; వ్రాలుచున్ = తగ్గుచు; అఱిముఱిన్ = సంభ్రమముతో; కబురులకు = సంభాషణములకు; చనుచున్ = దిగుచు; హరిహరి = అయ్యయ్యో; అనుచున్ = అనుచు; మఱగుచు = చాటుమాటులకు వెళుచు; ఉలుకుచున్ = ఉలికిపడుచు; గురు = మిక్కలి; మట్టపు = పొట్టి; పడుచు = బాల; వడుగు = బ్రహ్మచారి; కొంత = కొంచముసేపు; నటించెన్ = నటించెను.

భావము:
అంతే కాక, ఆ పొట్టి బ్రహ్మచారి వెరపు చూపుతూ, ఒయ్యారంగా వంగుతూ, జనంలోకి దూరుతూ, “హరి హరి” అంటూ చాటుకు వెడుతూ, ఉలికిపడుతూ కొంతసేపు చుట్టూతిరుగుతూ కొంతసేపు నటించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=538

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : : 

Friday, December 2, 2016

వామన వైభవం - 42:

8-536-సీ.
చవులుగాఁ జెవులకు సామగానంబులు;
చదువు నుద్గాతల చదువు వినుచు
మంత్ర తంత్రార్థ సంబంధభావములు పే;
ర్కొనెడి హోతలతోడఁ గూడికొనుచు
హోమకుండంబులం దున్న త్రేతాగ్నుల;
వెలిఁగించు యాజక వితతిఁ గనుచు
దక్షులై బహువిధాధ్వర విధానంబులు;
చెప్పెడు సభ్యులఁ జేరఁ జనుచుఁ
8-536.1-తే.
బెట్టుగోరెడు వేడుక పట్టుపఱుచు
నదితి పుట్టువు లచ్చికి నాటపట్టు
కోరి చరియించె సభలోనఁ గొంతఁదడవు
పుట్టు వెన్నఁడు నెఱుగని పొట్టివడుఁగు.



టీకా:
చవులుగాన్ = ఇంపుగా; చెవుల = చెవుల; కున్ = కు; సామగానంబులు = సామగానములు {సామగానములు - సామవేద మంత్రములు}; చదువు = పఠించెడి; ఉద్గాతల = ఉద్గాతలయొక్క {ఉద్గాత - యజ్ఞములందు సామవేద గానములను నడపువాడు}; చదువు = పఠనములను; వినుచున్ = వినుచు; మంత్రతంత్ర = మంత్రతంత్రముల; అర్థ = అర్థమునకు; సంబంధ = సంబంధించిన; భావములు = టీకలను; పేర్కొనెడి = వివరించెడి; హోతల = హోతల {హోతలు - ఋగ్వేదము తెలిసిన ఋత్విక్కులు}; తోడన్ = తోటి; కూడికొనుచు = కలియుచు; హోమకుండంబుల్ = హోమకుండములు; అందు = లో; ఉన్న = ఉన్నట్టి; త్రేతాగ్నులన్ = మూడుఅగ్నులను {త్రేతాగ్నులు - 1ఆవహనీయము 2గార్హపత్యము 3దక్షిణాగ్ని యనెడి మూడగ్నులు}; వెలిగించు = వెలిగించెడి; యాజక = ఋత్విక్కుల; వితతిన్ = సమూహమును; కనుచు = చూచుచు; దక్షులు = సమర్థులు; ఐ = అయ్యి; బహువిధ = పలురకములైన; అధ్వర = యజ్ఞ; విధానంబులు = విధులను; చెప్పెడు = పేర్కొనెడి; సభ్యులన్ = సభాపతుల; చేరన్ = దగ్గరకు; చనుచున్ = వెళుతు.  పెట్టు = దానమును; కోరెడు = కోరవలెననెడి; వేడుకన్ = కుతూహలమును; పట్టుపఱుచు = విదితముచేయుచు; అదితి = అదితి; పుట్టువు = కుమారుడు; లచ్చి = లక్ష్మీదేవి; కిన్ = కి; ఆటపట్టు = నివాసమైనవాడు; కోరి = కోరి; చరియించెన్ = తిరిగెను; సభ = సభ; లోనన్ = అందు; కొంత = కొంత; తడువు = సేవు; పుట్టువు = జన్మించుట; ఎన్నడున్ = ఎప్పుడు; ఎఱుగని = తెలియని; పొట్టి = వామనుడైన; వడుగు = బ్రహ్మచారి.

భావము:
చెవులకు ఇంపుగా సామవేదం పఠించే ఉద్గాతల గానాలు విన్నాడు. మంత్రతంత్రాలను వివరిస్తూ హోమం చేసే హోతలను కలుసుకున్నాడు. హోమకుండంలో అహవనీయం, గార్హపత్యం, దక్షిణాగ్ని అనే మూడగ్నులను వెలిగించే ఋత్విజులను చూసాడు. యాగవిధులను నేర్పరితనంతో పేర్కొంటున్న సభాపతులను సమీపించాడు. ఆ సభను బాగా ఆకర్షించాలని అనుకొని కొంతసేపు ఆ సభలో తిరుగాడాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=536

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : : 

Thursday, December 1, 2016

వామన వైభవం - 41:

8-534-క.
గుజగుజలు పోవువారును
గజిబిజిఁ బడువారు చాలఁ గలకల పడుచున్
గజిబిజి యైరి సభాస్థలిఁ
బ్రజ లెల్లను బొట్టివడుగు పాపని రాకన్.
8-535-వ.
ఆ సమయంబున బలిసభామండపంబుఁ దఱియం జొచ్చి.

టీకా:
గుజగుజలు = గుసగుసలు; పోవువారును = ఆడువారును; గజిబిజిన్ = తికమక; పడువారు = పడువారును; చాలన్ = మిక్కలి; కలకల = కలకలము; పడుచున్ = పడుచు; గజిబిజిన్ = తికమకపడినవారు; ఐరి = అయిరి; సభాస్థలిన్ = సభాప్రాంగణములోని; ప్రజలు = జనులు; ఎల్లన్ = అందరు; పొట్టి = వామనరూపు; వడుగు = బ్రహ్మచారి; పాపని = పిల్లవాని; రాకన్ = వచ్చుటతో. ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు; బలి = బలియొక్క; సభామండపంబున్ = సభాస్థలి; దఱియన్ = దగ్గరకు; చొచ్చి = చేరి.

భావము:
పొట్టి బ్రహ్మచారి యైన వామనుడు రాగానే ఆ సభలోని కొందరు ప్రజలు గుసగుసలాడారు. కొందరు గజిబిజి పడ్డారు. కొందరు తికమక పడ్డారు. అలా ఆ సభలోని వారందరూ పెద్ద కలకలం చేసారు. సభలో అలా కలకలం జరుగుతుండగా, ఆ పొట్టి బ్రహ్మచారి బలిచక్రవర్తి సభమంటపం దరిచేరాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=72&Padyam=534

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :