Sunday, November 20, 2016

వామన వైభవం - 30:

8-512-ఆ.
"ఈ మహానుభావుఁ డెట్లింత కాలంబు
నుదర మందు నిలిచి యుండె" ననుచు
నదితి వెఱఁగుపడియె నానంద జయశబ్ద
ములను గశ్యపుండు మొగి నుతించె.
8-513-వ.
అంత నవ్విభుండు సాయుధసాలంకారంబగు తన దివ్యరూపంబు నుజ్జగించి రూపాంతరం బంగీకరించి కపటవటు చందంబున నుపనయనవయస్కుండైన వామన బాలకుండై తల్లి ముంగటఁ గుమార సముచితాలాపంబు లాడుఁచు గ్రీడించు సమయంబున నదితియుం దనయ విలోకన పరిణామ పారవశ్యంబున.

టీకా:
ఈ = ఈ యొక్క; మహానుభావుడు = గొప్పవాడు; ఎట్లు = ఎలా; ఇంత = ఇన్ని; కాలంబు = రోజులు; ఉదరము = గర్భము; అందున్ = లో; నిలిచి = స్థిరముగ; ఉండెన్ = ఉన్నాడు; అనుచున్ = అనుచు; అదితి = అదితి; వెఱగు = ఆశ్చర్య; పడియెన్ = పోయెను; ఆనంద = సంతోషపు; ఆనంద = ఆనందపు; జయశబ్దములనున్ = జయజయధ్వానములను; కశ్యపుండు = కశ్యపుడు; మొగిన్ = పూని; నుతించెన్ = స్తుతించెను. అంతన్ = అంతట; ఆ = ఆ; విభుండు = భగవంతుడు; సాయుధ = ఆయుధములు గల; సాలంకారంబు = అలంకారములు గలది; అగు = అయిన; తన = తన యొక్క; దివ్య = దివ్యమైన; రూపంబున్ = స్వరూపమును; ఉజ్జగించి = ఉపసంహరించి; రూప = స్వరూపము నందు; అంతరంబున్ = మార్పును; అంగీకరించి = స్వీకరించి; కపట = మాయా; వటు = బ్రహ్మచారి; చందంబునన్ = వలె; ఉపనయన = వడుగుచేయదగిన; వయస్కుండు = వయసుగలవానిగ; ఐన = అయినట్టి; వామన = పొట్టి; బాలకుండు = చిన్నబాలుడు; ఐ = అయ్యి; తల్లి = అమ్మకు; ముంగటన్ = ఎదురుగ; కుమార = పుత్రునికి; సముచిత = తగిన; ఆలాపంబులు = పలుకులు; ఆడుచున్ = పలుకుచు; క్రీడించు = విహరించెడి; సమయంబునన్ = సమయమునందు; అదితియున్ = అదితి; తనయ = పుత్రుని; విలోకన = చూచుటవలన; పరిణామ = కలిగిన; పారవశ్యంబునన్ = మైమరపుతో.


భావము:
“ఇంతటి మహానుభావుడు ఇంతకాలమూ నా కడుపులో ఎలా ఉన్నాడా” అని వామనుడిని చూసి అదితి ఆశ్చర్యపడింది. ఆనందంతో కూడిన జయజయ శబ్దాలతో కశ్యపుడు స్వామిని పూని సంస్తుతించాడు.
అటుపిమ్మట వామనుడు ఆయధాలూ అలంకారాలు కలిగిన తన దివ్య రూపాన్ని వదిలిపెట్టి, కపట బ్రహ్మచారిగా మారురూపాన్ని పొందాడు. పొట్టి బాలుడుగా, వడుగు చేయదగిన వయస్సు కలవాడుగా అయ్యాడు. ఆ కొడుకుని చూచి అదితి ఆనందంతో మైమరచి, పారవశ్యమున. . .

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=69&Padyam=512

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: