Tuesday, September 20, 2016

క్షీరసాగరమథనం – మాయల్ చేయఁగ రాదు పో


8-351-శా.
మాయల్ చేయఁగ రాదు పో; నగవులే మాతోడి పోరాటముల్
దాయా! చిక్కితి; వ్రక్కలించెదఁ గనద్దంభోళి ధారాహతిన్
నీ యిష్టార్థము లెల్లఁ జూడుము వెసన్ నీ వారలం గూడుకో
నీ యాటోపము నిర్జరేంద్రుఁ డడఁచున్ నేఁ డాజిలో దుర్మతీ!
8-352-వ.
అని యుపాలంభించిన విని విరోచననందనుం డిట్లనియె.

టీకా:
          మాయల్ = మాయలు; చేయగరాదు = చేయకూడదు; పో = నిశ్చయంగా; నగవులే = నవ్వులాటలా, కాదు; మా = మా; తోడి = తోటి; పోరాటముల్ = యుద్దములు; దాయా = దాయదుడా, శత్రువా; చిక్కితి = దొరికిపోతివి; వ్రక్కలించెదన్ = చీల్చివేసెదను; కనత్ = మెరిస్తున్న; దంభోళి = వజ్రాయుధపు; ధారా = అంచు యొక్క; హతిన్ = దెబ్బతో; నీ = నీ యొక్క; ఇష్టార్థముల్ = కోరికలను; ఎల్లన్ = అన్నిటిని; చూడుము = చూసుకొనుము; వెసన్ = శ్రీఘ్రమే; నీ = నీ; వారలన్ = వారిని; కూడుకో = కలుసుకో; నీ = నీ యొక్క; ఆటోపమున్ = అహంకారమును; నిర్జరేంద్రుడు = ఇంద్రుడు; అడచున్ = అణచివేయును; నేడు = ఇప్పుడు; ఆజి = యుద్ధభూమి; లోన్ = అందు; దుర్మతీ = దుర్మార్గుడా.
          అని = అని; ఉపాలంభించిన = నిందించుచుండగా; విని = విని; విరోచననందనుడు = బలిచక్రవర్తి; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:
           ఓ దుష్టా! ఇక నీ మాయలు చెల్లవు. మాతో పోరాటాలంటే నవ్వులాటలేం కావు. దేవేంద్రుడి చేతికి చిక్కావు. ఈ తళతళలాడే వజ్రాయుధంతో నరికేస్తా. తొందరగా నీ కోరికలు అన్నీ చెప్పుకో. నీ వారిని కలుసుకో. ఇవాళ్టి పోరులో నీ అహంకారం ఈ దేవేంద్రుడు అణచివేస్తాడు.
          అంటూ నిందిస్తున్న అదితి పుత్రుడైన దేవేంద్రుడితో, హిరణ్యకశిపుని మనుమడు విరోచనుని పుత్రుడు అయిన బలిచక్రవర్తి ఇలా అన్నాడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: