Saturday, June 25, 2016

క్షీరసాగరమథనం – జలధిఁ గడవ

8-206-ఆ.
లధిఁ గడవ చేయ శైలంబుఁ గవ్వంబు
చేయ భోగిఁ ద్రాడు చేయఁ దరువ
సిరియు సుధయుఁ బడయ శ్రీవల్లభుఁడుఁ దక్క
నొరుఁడు శక్తిమంతుఁ డొకఁడు గలఁడె?
8-207-ఆ.
గొల్లవారి బ్రతుకు గొఱఁతన వచ్చునె
గొల్లరీతిఁ బాలకుప్ప ద్రచ్చి
గొల్లలైరి సురలు గొల్లయ్యె విష్ణుండు
చేటు లేని మందు సిరియుఁ గనిరి.
టీకా:
            జలధి = సముద్రము; కడవన్ = కుండగా; చేయ = చేయుటకు; శైలంబున్ = కొండను; కవ్వంబున్ = కవ్వముగా; చేయన్ = చేయుటకు; భోగిన్ = పామును; త్రాడున్ = తాడుగా; చేయన్ = చేయుటకు; తరువన్ = చిలుకుటకు; సిరియున్ = లక్ష్మీదేవి; సుధయున్ = అమృతము; పడయన్ = పొందుటకు; శ్రీవల్లభుడున్ = హరి {శ్రీవల్లుడు - శ్రీ (లక్ష్మీదేవికి) వల్లభుడు (పతి), విష్ణువు}; తక్కన్ = తప్పించి; ఒరుడు = ఇతరుడు; శక్తిమంతుడు = సామర్థ్యముగలవాడు; ఒకడు = ఇంకొకడు; కలడె = ఉండగలడా, లేడు.
            గొల్లవారి = గోల్లవారి; బ్రతుకు = జీవితము; కొఱత = తక్కువది; అనన్ = అనుట; వచ్చునె = సాధ్యమా, కాదు; గొల్ల = గొల్లవారి; రీతిన్ = వలె; పాలకుప్పన్ = పాలసముద్రమును {పాలకుప్ప - పాలు+కుప్ప, సముద్రము}; త్రచ్చి = చిలికి; గొల్లలు = గొల్లవారు; ఐరి = అయ్యారు; సురలు = దేవతలు; గొల్ల = గొల్లవాడు; అయ్యెన్ = అయ్యెను; విష్ణుండు = హరి; చేటు = మరణము; లేని = లేకపోవుటను కలిగించెడి; మందు = ఔషధమును; సిరియున్ = లక్ష్మీదేవిని; కనిరి = పొందగలిగిరి.
భావము:
            సముద్రాన్ని కుండగానూ, పర్వతాన్ని కవ్వంగానూ, సర్పాన్ని కవ్వంతాడుగానూ చేయగలవారూ. ఆపై చిలికి వెన్నతీసినట్లు లక్ష్మిని, అమృతాన్ని సంపాదించగల సమర్థత కలవారూ ఆ లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరు ఎవ్వరూ లేరు కదా!
            గొల్ల వారి వృత్తి దేనికి తీసిపోయేది కాదు. పాలసముద్రాన్ని చిలికి, దేవతలు గొల్లవారు అయి అమరత్వాన్ని అందించే అమృతాన్నీ; శ్రీమహావిష్ణువు గొల్ల అయి శ్రీమహాలక్ష్మినీ పొందగలిగారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: