Wednesday, April 27, 2016

ప్రహ్లాదుడు స్తుతించుట – నీ గృహాంగణ

7-367-సీ.
నీ గృహాంగణభూమి నిటలంబు మోవంగమోదించి నిత్యంబు మ్రొక్కఁడేని
నీ మంగళస్తవ నికర వర్ణంబులులుమాఱు నాలుకఁ లుకఁడేని
నీ యధీనములుగా నిఖిలకృత్యంబులుప్రియభావమున సమర్పింపఁడేని
నీ పదాంబుజముల నిర్మల హృదయుఁడైచింతించి మక్కువఁ జిక్కఁడేని
7-367.1-తే.
నిన్నుఁ జెవులార వినఁడేని నీకు సేవ; చేయరాఁడేని బ్రహ్మంబు జెందఁ గలఁడె
యోగి యైనఁ దపోవ్రతయోగి యైన; వేది యైన మహాతత్త్వవేది యైన.
టీకా:
          నీ = నీ యొక్క; గృహ = గుడి; అంగణ = ముంగిలి; భూమి = ప్రదేశమునందు; నిటలంబు = నొసలు; మోవంగ = తాకునట్లు; మోదించి = ముదమంది; నిత్యంబున్ = ప్రతిదినము; మ్రొక్కడేని = నమస్కరింపనిచో; నీ = నీ యొక్క; మంగళ = శుభకరములైన; స్తవ = స్తోత్రముల; నికర = సమూహముయొక్క; వర్ణంబులు = అక్షరసముదాయము; పలు = అనేక; మాఱు = సార్లు; నాలుకన్ = నాలుకతో; పలుకడేని = పలుకనిచో; నీ = నీకు; అధీనములు = సమర్పించినవి; కాన్ = అగునట్లు; నిఖిల = సర్వ; కృత్యంబులు = కార్యములు; ప్రియ = ఇష్టపూర్వక; భావమునన్ = తలపులతో; సమర్పింపడేని = సమర్పించనిచో; నీ = నీ; పద = పాదములు యనెడి; అంబుజములన్ = పద్మములను; నిర్మల = స్వచ్ఛమైన; హృదయుడు = హృదయముగలవాడు; ఐ = అయ్యి; చింతించి = ధ్యానించి; మక్కువ = ప్రేమయందు; చిక్కడేని = తగుల్కొననిచో. 
          నిన్నున్ = నిన్ను; చెవులార = చెవులనిండుగా; వినడేని = విననిచో; నీ = నీ; కున్ = కు; సేవన్ = పూజ; చేయన్ = చేయుటకు; రాడేని = రాకపోయినచో, సిద్దపడనిచో; బ్రహ్మంబున్ = పరబ్రహ్మస్వరూపమైననిన్ను; చెందగలడే = పొందగలడా ఏమి, లేడు; యోగి = యోగసాధనచేయువాడు; ఐనన్ = అయినను; తపోవ్రతయోగి = తపస్సు వ్రతముగల యోగి; ఐనన్ = అయినను; వేది = వేదములుచదివినవాడు; ఐనన్ = అయినను; మహా = గొప్ప; తత్త్వవేది = తత్త్వజ్ఞానముగలవాడు; ఐనన్ = అయినను.
భావము:
            నీ గుడి ప్రాంగణంలో నిత్యం నీకు తలవంచి మ్రొక్కని వాడు; మంగళకరాలైన నీ కీర్తనలు పలుమార్లు నాలుకతో పలుకని వాడూ; కర్మలు సమస్తం నీ అధీనం అని భక్తిభావంతో తలచి సమర్పణ చేయనివాడూ; నీ పాదపద్మాలు నిర్మలమైన మనస్సుతో నిత్యం ధ్యానించి పరవశించని వాడూ; చెవులారా నీ సంకీర్తనలు వినని వాడూ; చేతులారా నీ సేవ జేయనివాడూ; యోగి అయినా, మహా తపశ్శక్తిశాలి యైన యోగి అయినా, ఎంతటి పండితుడైనా, ఎంతటి తత్వవేత్త అయినా ఎప్పటికీ పరమపదం అందుకోలేడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: