Sunday, February 7, 2016

ప్రహ్లాదుని జన్మంబు - సూనున్

7-256-శా.
సూనున్ శాంతగుణ ప్రధాను నతి సంశుద్ధాంచిత జ్ఞాను న
జ్ఞానారణ్య కృశాను నంజలిపుటీ సంభ్రాజమానున్ సదా
శ్రీనారాయణ పాదపద్మయుగళీ చింతామృతాస్వాద నా
ధీనున్ ధిక్కరణంబుజేసి పలికెన్ దేవాహితుం డుగ్రతన్.
టీకా:
సూనున్ = పుత్రుని; శాంతగుణ = శాంతగుణములు; ప్రధానున్ = ముఖ్యముగాగలవానిని; అతి = మిక్కిలి; సంశుద్ధ = పరిశుద్ధమైన; అంచిత = పూజనీయమైన; జ్ఞానున్ = జ్ఞానముగలవానిని; అజ్ఞాన = అజ్ఞానము యనెడి; అరణ్య = అరణ్యమునకు; కృశానున్ = చిచ్చువంటివానిని; అంజలిపుటీ = ప్రణామాంజలిచే; సంభ్రాజమానున్ = ప్రకాశించువానిని; సదా = ఎల్లప్పుడును; శ్రీనారాయణ = శ్రీహరి యొక్క; పాద = పాదములు యనెడి; పద్మ = పద్మముల; యుగళీ = జంట యెడల; చింతా = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; ఆస్వాదన = స్వీకరించుటయందు; అధీనున్ = లోనైనవానిని; ధిక్కరణంబు = తిరస్కారము; చేసి = చేసి; పలికెన్ = పలికెను; దేవాహితుండు = హిరణ్యకశిపుడు {దేవాహితుడు - దేవతలకు అహితుడు (శత్రువు), హిరణ్యకశిపుడు}; ఉగ్రతన్ = క్రూరత్వముతో.
భావము:
            ఆ ప్రహ్లాదుడు మహాశాంతమూర్తి, గొప్ప గుణవంతుడూ; బహు పరిశుద్ధమైన ఙ్ఞానం అనే సంపదకు గనిలాంటి వాడు; అఙ్ఞానం అనే అరణ్యానికి అగ్నిలాంటివాడు; నిరంతరం చేతులు జోడించి మనసులో పరంధాముని పాదపద్మాలనే ధ్యానిస్తూ ఉండేవాడు; అటువంటి సకల సద్గుణ సంశీలుడిని కన్న కొడుకును ధిక్కరించి, కోపించి; విబుధవిరోధి యైన హిరణ్యకశిపుడు ఇలా విరుచుకుపడ్డాడు.
७-२५६-शा.
सूनुन् शांतगुण प्रधानु नति संशुद्धांचित ज्ञानु न
ज्ञानारण्य कृशानु नंजलिपुटी संभ्राजमानुन् सदा
श्रीनारायण पादपद्मयुगळी चिंतामृतास्वाद ना
धीनुन् धिक्करणंबुजेसि पलिकेन् देवाहितुं डुग्रतन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: