Friday, December 25, 2015

ప్రహ్లాదుని హింసించుట - ఆగ్రహమునఁ

7-203-వ.
అదియునుం గాక తొల్లి శునశ్శేఫుం డను మునికుమారుండు దండ్రి చేత యాగపశుత్వంబునకు దత్తుం డయి తండ్రి తనకు నపకారి యని తలంపక బ్రదికిన చందంబున.
7-204-క.
గ్రహమునఁ నేఁ జేసిన
నిగ్రహములు పరులతోడ నెఱి నొకనాఁడున్
విగ్రహము లనుచుఁ బలుకఁ డ
నుగ్రహములుగా స్మరించు నొవ్వఁడు మదిలోన్.
టీకా:
          అదియునున్ = అంతే; కాక = కాకుండగ; తొల్లి = పూర్వము; శునశ్శేపుండు = శునశ్శేపుడు; అను = అనెడి; ముని = మునుల; కుమారుండు = పుత్రుడు; తండ్రి = తండ్రి; చేతన్ = వలన; యాగ = యజ్ఞమునకైన; పశుత్వంబున్ = బలిపశువు అగుట; కున్ = కు; దత్తుండు = ఇయ్యబడినవాడు; అయి = అయ్యి; తండ్రిన్ = తండ్రిని; తన = తన; కున్ = కు; అపకారి = హాని చేసినవాడు; అని = అని; తలపకన్ = భావించకుండగ; బ్రదికిన = ఆపదనుండి బయటపడిన; చందంబునన్ = విధముగ.
          ఆగ్రహమునన్ = కోపముతో; నేన్ = నేను; చేసిన = చేసినట్టి; నిగ్రహములు = దండనములు; పరుల = ఇతరుల; తోడన్ = తోటి; నెఱిన్ = వక్రతతో; ఒక = ఒక; నాడున్ = రోజునకూడ; విగ్రహములు = విరోధములుగా; పలుకడు = చెప్పడు; అనుగ్రహములు = సత్కారములు; కాన్ = అయినట్లు; స్మరించున్ = తలచును; నొవ్వడు = బాధపడడు; మది = మనసు; లోన = లోపల.
భావము:
            పూర్వకాలంలో ఒక ముని ఉండేవాడు. అతని శునశ్శేపుడు అనే కొడుకు ఉండే వాడు. ఆ తండ్రి ధనం కోసం తన కొడుకును యాగ పశువుగా ఇచ్చేసేడట. అయినా కూడ ఆ బాలుడు తండ్రిని అపకారిగా భావించకుండా ఉపకారిగానే భావించి జీవించి ఉన్నాడట. అలాగే నా కొడుకు ప్రహ్లాదుడు కూడ ఉన్నాడే!
            అంతే కాకుండా, నేను కోపంతో వీడిని ఎన్ని రకాల బాధలు పెట్టినా, ఎక్కడా ఎవరి దగ్గర మా నాన్న ఇలా బాధిస్తున్నాడు అంటూ కొండెములు చెప్పుకోడు. పైపెచ్చు అవన్నీ హితములుగానే తలుస్తున్నాడు. మనసులో కూడా బాధ పడడు. వీడి తత్వం ఏమిటో అర్థం కావటంలేదు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: