Friday, December 18, 2015

ప్రహ్లాదుని హింసించుట - పాఱడు


7-194-ఉ.
పాఱఁడు లేచి దిక్కులకుబాహువు లొడ్డఁడు; బంధురాజిలోఁ
దూఱఁడు; "ఘోరకృత్య" మని దూఱఁడు; తండ్రిని మిత్రవర్గముం
జీరఁడు; మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిం
దాఱఁడు; "కావరే" యనఁడుతాపము నొందఁడు; కంటగింపఁడున్.
టీకా:
          పాఱడు = పారిపోడు; లేచి = లేచిపోయి; దిక్కుల్ = దూరప్రదేశముల; కున్ = కు; బాహువులు = చేతులు; ఒడ్డడు = అడ్డము పెట్టడు; బంధు = చుట్టముల; రాజి = సంఘము; లోన్ = లోకి; దూఱడు = ప్రవేశింపడు; ఘోర = ఘోరమైన; కృత్యము = కార్యము, పని; అని = అనుచు; దూఱడు = తిట్టడు; తండ్రిని = తండ్రిని; మిత్ర = స్నేహితుల; వర్గమున్ = సమూహమును; చీరడు = పిలువడు; మాతృ = తల్లుల; సంఘము = సమూహము; వసించు = ఉండెడి; సువర్ణ = బంగారు; గృహంబు = ఇంటి; లోని = లోపలి; కిన్ = కి; తాఱడు = దాగికొనడు; కావరే = కాపాడండి; అనడు = అనడు; తాపమున్ = సంతాపమును; ఒందడు = పొందడు; కంటగింపడున్ = ద్వేషముచూపడు.
భావము:
            ఆ రాక్షసులు ఎంత హింసిస్తున్నా ప్రహ్లాదుడు దూరంగా పారిపోడు; కొడుతుంటే చేతులు అయినా అడ్డం పెట్టుకోడు; చుట్టాల గుంపులోకి దూరి దాక్కోడు; ఇది “ఘోరం, అన్యాయం” అని తండ్రిని నిందించడు; స్నేహితులను సాయం రమ్మనడు; తన తల్లి, సవితి తల్లి మున్నగు తల్లులు నివాసం ఉండే బంగారు మేడల లోనికి పరుగెట్టి, “కాపాడండి” అని గోలపెట్టడు; అసలు బాధపడనే పడడు; వేదన చెందడు. తండ్రిని గానీ, బాధిస్తున్న రాక్షసులను కాని అసహాయంగా చూస్తున్న వారిని కానీ ఎవరినీ ద్వేషించడు; ఎంతటి విచిత్రం, ఇలాంటి పిల్లవాడు ఎక్కడైనా ఉంటాడా?
७-१९४-उ.
पार्रँडु लेचि दिक्कुलकु; बाहुवु लोड्डँडु; बंधुराजिलो
दूर्रँडु; "घोरकृत्य" मनि दूर्रँडु; तंड्रिनि मित्रवर्गमुं
जीरँडु; मातृसंघमु वसिंचु सुवर्णगृहंबुलोनिकिं
दार्रँडु; "कावरे" यनँडु; तापमु नोंदँडु; कंटगिंपँडुन्.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: