Wednesday, June 3, 2015

కుంతి స్తుతి - మఱియు బ్రజాపరిపాలనపరుండయిన

1-204-వ.
మఱియుఁ, బ్రజాపరిపాలనపరుం డయిన రాజు ధర్మయుద్ధంబున శత్రువులఁ వధియించినం బాపంబు లేదని, శాస్త్రవచనంబు గల; దయిన నది విజ్ఞానంబు కొఱకు సమర్థంబు గాదు; చతురంగంబుల ననేకాక్షౌహిణీ సంఖ్యాతంబులం జంపించితి; హతబంధు లయిన సతుల కేను జేసిన ద్రోహంబు దప్పించుకొన నేర్పు లేదు; గృహస్థాశ్రమధర్మంబు లైన తురంగమేధాది యాగంబులచేతఁ బురుషుండు బ్రహ్మహత్యాది పాపంబుల వలన విడివడి నిర్మలుం డగు నని, నిగమంబులు నిగమించు; పంకంబునఁ బంకిలస్థలంబునకు, మద్యంబున మద్యభాండంబునకును శుద్ధి సంభవింపని చందంబున బుద్ధిపూర్వక జీవహింసనంబు లయిన యాగంబులచేతం బురుషులకుఁ బాప బాహుళ్యంబ కాని పాపనిర్ముక్తి గాదని శంకించెద."
              మఱియున్ = ఇంకా; ప్రజా = ప్రజలను; పరిపాలన = పరిపాలించుట; పరుండు = చేయవలసినవాడు; అయిన = అయినట్టి; రాజు = రాజు; ధర్మ = ధర్మబద్ధమైన; యుద్ధంబున = యుద్ధముతో; శత్రువులన్ = శత్రువులను; వధియించినన్ = సంహరించినప్పటికీ; పాపంబు = పాపము; లేదు = లేదు/ అంటదు; అని = అని; శాస్త్ర = శాస్త్రములు చెప్పిన; వచనంబున్ = మాట; కలదు = ఉంది; అయినన్ = అయిననూ; అది = అది; విజ్ఞానంబు = విజ్ఞానము; కొఱకున్ = వలన; సమర్థంబు = సరియయినది; కాదు = కాదు; చతురంగంబులన్ = చతురంగబలములతో {చతురంగము - రథములు, ఏనుగులు, గుఱ్ఱములు, కాల్బలము అను సేనా భాగములుతో కూడిన సేన}; అనేక = లెక్కలేనన్ని; అక్షౌహిణీ = అక్షౌహిణుల {అక్షోహిణి - ఇరవైఒక్కవేల ఎనిమిదివందల డెబ్బై రథములు, అన్ని ఏనుగులు, అరవైయైదువేల నాలుగువందల పది గుర్రాలు, లక్షా తొమ్మిదివేల మూడు వందల యాభై కాల్బలమును కల సేనావిశేషము}; సంఖ్యాతంబులన్ = సంఖ్యలలోనున్న వాటిని; చంపించితిన్ = చనిపోవునట్లు చేసి; హత = చంపబడిన; బంధులు = బంధువులు; అయిన = అయిన; సతులు = స్త్రీలు; కున్ = కు; ఏను = నేను; చేసిన = చేసినటువంటి; ద్రోహంబున్ = ద్రోహమును; తప్పించుకొనన్ = తప్పించుకోడానికి; నేర్పు = మార్గము; లేదు = లేదు; గృహస్థాశ్రమ = గృహస్థాశ్రమపు; ధర్మంబులు = ధర్మాలు; ఐన = అయినట్టి; తురంగమేధ = అశ్వమేధము; ఆది = మొదలగు; యాగంబులు = యాగములు; చేతన్ = చేత; పురుషుండు = మానవుడు; బ్రహ్మహత్య = బ్రాహ్మణులను చంపుట; ఆది = మొదలగు; పాపంబుల = పాపముల; వలనన్ = నుండి; విడివడి = బయటపడి; నిర్మలుండు = నిర్మలమైనవాడు; అగున్ = అగును; అని = అని; నిగమంబులు = వేదములు, నిగమించునవి; నిగమించున్ = నిర్ణయిస్తున్నాయి; పంకంబునన్ = బురదతో; పంకిలస్థలంబు = బురదనేల; కున్ = కును; మద్యంబున = మద్యము వలన; మద్యభాండంబు = మద్యపుకుండ; కున్ = కును; శుద్ధి = పరిశుభ్రత; సంభవింపని = కలుగని; చందంబునన్ = విధంగా; బుద్ధి = ఇష్ట; పూర్వక = పూర్వకముగా చేయు; జీవహింసనంబులు = జీవులనుచంపుటలు; అయిన = అయినట్టి; యాగంబులు = యజ్ఞముల; చేతన్ = వలన; పురుషులు = మానవుల; కున్ = కు; పాప = పాపముల; బాహుళ్యంబ = వృద్ధియే; కాని = కాని; పాప = పాపములనుండి; నిర్ముక్తి = విముక్తి; కాదు = కాదు; అని = అని; శంకించెదన్ = అనుమానిస్తాను.
ప్రజలను పరిపాలించే రాజు ధర్మబుద్ధితో శత్రువులను చంపటంలో దోషం లేదని శాస్త్రాలు చెప్పుతున్నాయి. అయినా, ఆలోచించి చూస్తే ఈ మాట నాకు సమంజసం అనిపించటం లేదు. రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, కాలిబంట్లతో కూడిన పెక్కు అక్షౌహిణుల సైన్యాలను చంపించాను. పతులను, బంధువులను హతమార్చి సతులకు నేను చేసిన మహాద్రోహం క్షమించరానిది. నా యీ పాపానికి నిష్కృతి లేదు. గృహస్థధర్మాలైన అశ్వమేధం మొదలైన యజ్ఞాలు ఆచరిస్తే బ్రహ్మహత్య మొదలగు దోషాలు పరిహారం అవుతాయని వేదాలు చెప్పుతున్నాయి.. కాని బురదవల్ల బురదనేల పరిశుభ్రం కాదు. కల్లుపోసి కడిగి నందువల్ల కల్లుకుండకు శుద్ధి లభించదు. అలాగే బుద్ధి పూర్వకంగా చేసే జీవహింసతో కూడిన యజ్ఞాలవల్ల మానవుల పాపం పెరుగుతుందే కాని తరగదని నా అనుమానం.
1-204-va.
maRriyuM~, brajaaparipaalanaparuM Dayina raaju dharmayuddhaMbuna shatruvulaM~ vadhiyiMchinaM baapaMbu lEdani, shaastravachanaMbu gala; dayina nadi viGyaanaMbu koRraku samarthaMbu gaadu; chaturaMgaMbula nanEkaakShauhiNee saMkhyaataMbulaM jaMpiMchiti; hatabaMdhu layina satula kEnu jEsina drOhaMbu dappiMchukona nErpu lEdu; gRihasthaashramadharmaMbu laina turaMgamEdhaadi yaagaMbulachEtaM~ buruShuMDu brahmahatyaadi paapaMbula valana viDivaDi nirmaluM Dagu nani, nigamaMbulu nigamiMchu; paMkaMbunaM~ baMkilasthalaMbunaku, madyaMbuna madyabhaaMDaMbunakunu shuddhi saMbhaviMpani chaMdaMbuna buddhipoorvaka jeevahiMsanaMbu layina yaagaMbulachEtaM buruShulakuM~ baapa baahuLyaMba kaani paapanirmukti gaadani shaMkiMcheda."
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
- - -

No comments: