Monday, May 18, 2015

కుంతి స్తుతి - మఱియు జవనిక

1-188-వ.
మఱియు జవనిక మఱుపున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా యవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచేఁ బరమహంసలు నివృత్తరాగద్వేషులు నిర్మలాత్ములు నయిన మునులకు నదృశ్యమానుండ వయి పరిచ్ఛిన్నుండవు గాని, నీవు మూఢదృక్కులుఁ గుటుంబవంతులు నగు మాకు నెట్లు దర్శనీయుండ వయ్యెదు శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ! పద్మమాలికాలంకృత! పద్మలోచన! పద్మసంకాశచరణ! హృషీకేశ! భక్తియోగంబునం జేసి నమస్కరించెద నవధరింపుము.
              మఱియున్ = ఇంకను; జవనిక = తెర; మఱుపున = చాటున; నాట్యంబు = నాట్యము; సలుపు = చేయు; నటుని = నటుని; చందంబునన్ = వలె; మాయా = మాయ అనే; యవనిక = తెర; అంతరాళంబున = చాటున; నిలువంబడి = నిలబడి ఉండి; నీ = నీ యొక్క; మహిమ = మహిమ; చేన్ = చేత; పరమహంసలు = మోక్షస్థితిని పొందినవారు; నివృత్త = నివారింపబడిన; రాగద్వేషులున్ = అనురాగము, ద్వేషములు కలవారును { రాగద్వేషములు పదమూడు}; నిర్మల = నిర్మలమైన; ఆత్ములున్ = ఆత్మగలవారును; అయిన = అయినట్టి; మునులు = మునుల; కున్ = కు; అదృశ్య = కనుపించక; మానుండు = ఉండేవాడవును; అయి = అయ్యి; పరిచ్ఛిన్నుండవు = కప్పబడినవాడవు; కాని = కానీ; నీవు = నీవు; మూఢ = మోసము చెందిన; దృక్కులున్ = దృష్టి కలవారును; కుటుంబవంతులున్ = కుటుంబము గలవారును; అగు = అయినట్టి; మాకు = మాకు; ఎట్లు = ఏవిధంగ; దర్శనీయుండవు = కనబడువాడవు; అయ్యెదు = అవుతావు; శ్రీకృష్ణ = కృష్ణా; వాసుదేవ = కృష్ణా {వాసుదేవుడు - ఆత్మ యందు వసించే దేవుడు, విష్ణువు}; దేవకీనందన = కృష్ణా {దేవకీనందన - దేవకీదేవి పుత్రుడు, కృష్ణుడు}; నంద గోప కుమార = కృష్ణా {నందగోప కుమార - నందుడను గోపాలుని కుమారుడు, కృష్ణుడు}; గోవింద = కృష్ణా {గోవింద - గోవులను పాలించు వాడు, కృష్ణుడు}; పంకజనాభ = కృష్ణా {పంకజనాభుడు - పద్మము నాభిని గల వాడు, విష్ణువు}; పద్మమాలికాలంకృత = కృష్ణా {పద్మమాలికాలంకృతుడు - పద్మ మాలికలతో అలంకరింపబడిన వాడు, కృష్ణుడు}; పద్మలోచన = కృష్ణా {పద్మలోచనుడు - పద్మములవంటి కన్నులు గలవాడు, కృష్ణుడు}; పద్మసంకాశ చరణ = కృష్ణా {పద్మసంకాశ చరణుడు - పద్మముల వలె ప్రకాశించు పాదములు గలవాడు, కృష్ణుడు}; హృషీ కేశ = కృష్ణా {హృషీకేశ - ఇంద్రియములకు ప్రభువు, విష్ణువు}; భక్తి యోగంబునన్ = భక్తి యోగము వలన; చేసి = చేసి; నమస్కరించెదన్ = నమస్కరిస్తున్నాను; అవధరింపుము = స్వీకరింపుము.
          మాయ అనే యవనిక మాటున వర్తించే నీ మహిమ, తెరచాటున వర్తించే నటునిలా అగోచరమైనది; పరమహంసలు, రాగద్వేషరహితులు, {రాగద్వేషములు పదమూడు}, నిర్మలహృదయులు అయిన మునీశ్వరులకు సైతం దర్శింపశక్యంకాని పూర్ణపురుషుడవైన నిన్ను సంసార నిమగ్నులు, జ్ఞానహీనుల అయిన మా వంటి వారం ఎలా చూడగలం; శ్రీకృష్ణా! వాసుదేవా! దేవకీనందనా! నందగోపకుమారా! గోవిందా! పద్మనాభా! పద్మమాలా విభూషణా! పద్మనయనా! పద్మసంకాశ చరణా! హృషీకేశా! భక్తి పూర్వకమైన నా ప్రణామాలు పరిగ్రహించు. నా విన్నపం మన్నించు.
1-188-vachanamu
maRriyu javanika maRrupuna naaTyaMbu salupu naTuni chaMdaMbuna maayaa yavanikaaMtaraaLaMbuna niluvaMbaDi nee mahimachEM~ baramahaMsalu nivRittaraagadvEShulu nirmalaatmulu nayina munulaku nadRishyamaanuMDa vayi parichchhinnuMDavu gaani, neevu mooDhadRikkuluM~ guTuMbavaMtulu nagu maaku neTlu darshaneeyuMDa vayyedu shreekRiShNa! vaasudEva! dEvakeenaMdana! naMdagOpakumaara! gOviMda! paMkajanaabha! padmamaalikaalaMkRita! padmalOchana! padmasaMkaashacharaNa! hRiSheekEsha! bhaktiyOgaMbunaM jEsi namaskariMcheda navadhariMpumu.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: