Thursday, December 4, 2014

రుక్మిణీకల్యాణం – అంత నాభీష్మకుండు

41- వ.
అంత నా భీష్మకుండు విహితప్రకారంబునం బితృదేవతల నర్చించి బ్రాహ్మణులకు భోజనంబులు పెట్టించి, మంగళాశీర్వచనంబులు చదివించి, రుక్మిణీదేవి నభిషిక్తంజేసి వస్త్రయుగళభూషితం గావించి, రత్నభూషణంబు లిడం జేసె; ఋగ్యజుస్సామ మంత్రంబుల మంగళాచారంబు లొనరించి, భూసురులు రక్షాకరణంబు లాచరించిరి; పురోహితుండు గ్రహశాంతికొఱకు నిగమనిగదిత న్యాయంబున హోమంబు గావించె; మఱియు నా రాజు దంపతుల మేలుకొఱకుఁ దిల ధేను కలధౌత కనక చేలాది దానంబులు ధరణీదేవతల కొసంగెను; అయ్యవసరంబున.
          భీష్మకుడు పద్దతి ప్రకారం పితృదేవతలని పూజించి, విప్రులకి భోజనాలు పెట్టించాడు. పుణ్యాహవచనాలు చదివించాడు. రుక్మిణికి స్నానం చేయించి, కొత్తబట్టలు, రత్నాభరణలుతో అలంకరించాడు. బ్రాహ్మణులు వేద మంత్రాలతో రక్షాకరణాలు చేసారు. పురోహితుడు వేదాల్లో చెప్పిన విధంగా హోమం చేసాడు. నవ దంపతులు రుక్మిణీకృష్ణులకు శుభం కోసం భీష్మకుడు విప్రులకు తిలా, గో, రజత, స్వర్ణ, వస్త్రాది ధానాలు చేసాడు. అప్పుడు.
మన సంప్రదాయాలను ఎంతో అలవోకగా వర్ణించిన చక్కటి వచనం యిది. ఏదైనా శుభకార్యం ఆరంభించే సమయంలో, పెద్దలను సన్మానించాలి, విప్రులను తృప్తిపరచాలి, వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి, అభ్యంగన స్నానాలు చేయాలి, శుభ్రమైన వస్త్రాలు, సకల శోభనకర అలంకారలు అలంకరించుకోవాలి, శాంతులు పూజలు దానాలు చేయాలి. ఈ సత్సంప్రదాయాలు ఎన్నో శతాబ్దాలనుండి ఆచరణలో ఉన్నాయి. సంకల్ప బల, పారిశుధ్య విలువలతో కూడిన మన సదాచారాలు కాలపరీక్షకు తట్టుకొని నిలబడ్డాయి. కనుక వాటిని వదలరాదు.
41- va.
aMta naa bheeShmakuMDu vihitaprakaaraMbunaM bitRidEvatala narchiMchi braahmaNulaku bhOjanaMbulu peTTiMchi, maMgaLaasheervachanaMbulu chadiviMchi, rukmiNeedEvi nabhiShiktaMjEsi vastrayugaLabhooShitaM gaaviMchi, ratnabhooShaNaMbu liDaM jEse; Rigyajussaama maMtraMbula maMgaLaachaaraMbu lonariMchi, bhoosurulu rakShaakaraNaMbu laachariMchiri; purOhituMDu grahashaaMtikoRraku nigamanigadita nyaayaMbuna hOmaMbu gaaviMche; maRriyu naa raaju daMpatula mElukoRrakuM~ dila dhEnu kaladhauta kanaka chElaadi daanaMbulu dharaNeedEvatala kosaMgenu; ayyavasaraMbuna.
          అంతన్ = అంతట; = ఆ యొక్క; భీష్మకుండు = భీష్మకుడు; విహిత = పద్దతి; ప్రకారంబునన్ = ప్రకారముగా; పితృదేవతలన్ = పిత్రుదేవతలను; అర్చించి = పూజించి; బ్రాహ్మణుల్ = విప్రుల; కున్ = కు; భోజనంబులున్ = అన్నములు; పెట్టించి = పెట్టించి; మంగళ = శుభప్రదమైన; ఆశీర్వచనంబులున్ = ఆశీర్వచన మంత్రములను {ఆశీర్వచనంబులు - దీవెనలుతోటి పుణ్యాహవచనములు}; చదివించి = పఠింపజేసి; రుక్మిణీదేవినిన్ = రుక్మిణిని; అభిషిక్తన్ = స్నానమాచరింపబడినామెగా; చేసి = చేసి; వస్త్ర = వస్త్రముల; యుగళ = జతచేత; భూషితన్ = అలంకరింపబడినామెగా; కావించి = చేసి; రత్న = రత్నాల; భూషణంబులు = ఆభరణములు; ఇడంజేసె = పెట్టెను, ధరింపజేసెను; ఋక్ = ఋగ్వేద; యజుః = యజుర్వేద; సామ = సామవేద; మంతంబులన్ = మంత్రములచేత; మంగళ = శుభ; ఆచారంబులన్ = కార్యములను; ఒనరించి = చేసి; భూసురులు = విప్రులు; రక్షాకరణంబులు = రక్షజేయుటలు; ఆచరించిరి = చేసిరి; పురోహితుండు = ఆస్థాన విప్రుడు; గ్రహశాంతి = నవగ్రహముల శాంతి; కొఱకు = కోసము; నిగమ = వేదములలో; నిగదిత = చెప్పబడిన; న్యాయంబునన్ = ప్రకారముగా; హోమంబు = అగ్నిహోత్రమును; కావించె = నిర్వహించెను; మఱియున్ = ఇంకను; ఆ = ఆ; రాజు = రాజు; దంపతుల = నవదంపతుల; మేలు = శ్రేయస్సు; కొఱకు = కోసము; తిల = నువ్వులు; ధేను = గోవులు; కలధౌత = రజత (వెండి); కనక = స్వర్ణ (బంగారము); చేలా = వస్త్రములు; ఆది = మున్నగు; దానంబులున్ = దానములను; ధరణీదేవతల్ = బ్రాహ్మణుల; కున్ = కు; ఒసంగెను = ఇచ్చెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: