Thursday, December 25, 2014

రుక్మిణీకల్యాణం - ఇట్లు మేఘమధ్యంబు

68- వ.
ఇట్లు మేఘమధ్యంబు వెలువడి విలసించు క్రొక్కారు మెఱుంగు తెఱంగున, మృగధరమండలంబు నిర్గమించి చరించు మృగంబు చందంబునఁ, గమలభవ నర్తకుం డెత్తిన జవనిక మఱుఁగు దెరలి పొడచూపిన మోహినీదేవత కైవడి, దేవదానవ సంఘాత కరతల సవ్యాపసవ్య సమాకృష్యమాణ పన్నగేంద్ర పాశ పరివలయిత పర్యాయ పరిభ్రాంత మంథరాచల మంథాన మథ్యమాన ఘూర్ణిత ఘుమఘుమాయత మహార్ణవ మధ్యంబున నుండి చనుదెంచు నిందిరాసుందరీ వైభవంబున, బహువిధ ప్రభాభాసమాన యై యిందుధరసుందరీ మందిరంబు వెడలి మానసకాసార హేమకమల కానన విహారమాణ మత్తమరాళంబు భంగి మంద గమనంబునఁ గనక కలశ యుగళ సంకాశ కర్కశ పయోధరభార పరికంప్యమాన మధ్యయై రత్నముద్రికాలంకృతంబైన కెంగేల నొక్క సఖీలలామ కైదండఁ గొని రత్ననివహ సమంచిత కాంచన కర్ణపత్ర మయూఖంబులు గండభాగంబుల నర్తనంబులు సలుప నరవింద పరిమళ కుతూహ లావతీర్ణ మత్తమధుకరంబుల మాడ్కి నరాళంబులైన కుంతలజాలంబులు ముఖ మండలంబునఁ గ్రందుకొన, సుందర మందహాస రోచులు దిశలందు బాలచంద్రికా సౌందర్యంబు నావహింప నధర బింబఫలారుణ మరీచిమాలికలు రదన కుందకుట్మంబుల కనురాగంబు సంపాదింప, మనోజాత కేతన సన్నిభంబైన పయ్యెదకొంగు దూఁగ; సువర్ణమేఖలాఘటిత మణికిరణ పటలంబు లకాల శక్రచాప జనకంబులై మెఱయఁ జెఱుకు విలుతుం డొరబెఱికి వాఁడి యడిదంబు జళిపించిన ధగధగాయానంబులగు బాణంబుల పగిది, సురుచిర విలోకన నికరంబులు రాజవీరుల హృదయంబులు భేదింప, శింజాన మంజు మంజీర నినదంబులు చెవుల పండువు చేయఁ, బాద సంచారంబున హరిరాక కెదురుచూచుచు వీరమోహినియై చను దెంచుచున్న సమయంబున.
          ఇలా రుక్మిణీదేవి ఉమామహేశ్వరుల గుడినుంచి బయటకు వస్తోంది. అప్పుడు ఆమె వర్షాకాలంలో మేఘాల్లోంచి బయట కొచ్చి మెరసే మేఘంలా, లేడి చిహ్నమున్న చంద్రమండలంలోంచి బయటకొచ్చిన లేడిలా ఉంది. బ్రహ్మదేవుడనే దర్శకుడు ఎత్తిన నాటకాల తెర మరుగునుంచి బయటకొచ్చి వేషం ధరించిన మోహినీదేవతలా ఉంది. సముద్ర మధన సమయంలో దేవదానవులు చేతులు కలిపి వాసుకి అనే కవ్వం తాడు కట్టిన మంధర పర్వతమనే కవ్వం చిలుకుతుండగా పాలసముద్రం లోంచి వెలువడ్డ లక్మీదేవి లాంటి వైభవంతో, మానస సరోవరంలోని బంగారు కమలాల సమూహంలో విహరిస్తున్న కలహంసలా మందగమనంతో వస్తోంది. బంగారు జంట కలశాల్లాంటి స్తనద్వయం బరువుకి నడుము ఊగుతూంది. రత్నాల ఉంగరాలు అలంకరించిన చెయ్యి ఒక చెలికత్తె భుజం మీద వేసింది. రత్నాల బంగారు కర్ణాభరణాల కాంతులు చెక్కిళ్ళపై పరచు కుంటున్నాయి. పద్మాల సువాసనలకి మత్తెక్కిన తుమ్మెదల్లా ముంగురులు మోముపై కదుల్తు న్నాయి. అందమైన చిరునవ్వుల కాంతులు నల్దిక్కుల లేత వెన్నెలలా ప్రకాశిస్తున్నాయి. దొండ పండు లాంటి పెదవి కాంతుల వల్ల తెల్లని మల్లెమొగ్గల్లాంటి దంతాలు ఎర్రబారాయి. మన్మథుని జండాలా పైటకొంగు ఊగుతుంది. బంగారపు వడ్డాణం లోని రత్నాల కాంతులు అకాల ఇంద్రధనుస్సు మెరుపులు పుట్టిస్తున్నాయి మన్మధుడి ఒరలోంచి దూసిన కత్తుల మెరపులలా ఆమె మనోహరమైన చూపులు రాకుమారుల మనస్సులను ఛేదిస్తున్నాయి. మోగుతున్న కాలి గజ్జెల మనోఙ్ఞమైన గలగలలు చెవులకు పండుగ చేస్తున్నాయి. అలా కృష్ణుడిరాక కోసం ఎదురు చూస్తూ వీరమోహినిలా రుక్మిణీదేవి వస్తోంది. అప్పుడు.
          ఇట్లు = ఈ విధముగ; మేఘ = మబ్బుల; మధ్యంబున్ = నడుమనుండి; వెలువడి = బయటపడి; విలసించు = ప్రకాశించునట్టి; క్రొక్కారు = వానాకాలపు; మెఱుంగు = మెరుపుల; తెఱంగున = వలె; మృగధర = చంద్ర {మృగధరుడు - లేడి రూపును బింబమున ధరించినవాడు, చంద్రుడు}; మండలంబున్ = మండలమునుండి; నిర్గమించి = వెలువడి; చరించు = తిరుగుచున్నట్టి; మృగంబు = లేడి; చందంబునన్ = వలె; కమలభవ = బ్రహ్మదేవుడు అనెడి; నర్తకుండు = నాటకములాడించువాడు; ఎత్తిన = పైకెత్తిన; జవనిక = తెర {యవనిక (ప్ర) - జవనిక (వి)}; మఱుగు = చాటునుండి; తెరలి = బయటకొచ్చి; పొడచూపిన = కనబడిన; మోహినీదేవత = మోహినీదేవత {మోహినీదేవత - లోకమును మోహింపజేసెడి దేవత}; కైవడిన్ = వలె; దేవ = దేవతల; దానవ = రాక్షసుల; సంఘాత = సమూహము యొక్క; కరతల = అరచేతులచేత; సవ్యాపసవ్య = కుడిఎడమల తిరుగునట్లు; సమాకృష్యమాణ = లాగబడుచున్న; పన్నగేంద్ర = వాసుకిసర్పరాజు అను {పన్నగేంద్రుడు - పన్నగ (సర్పము)లకు రాజు, వాసుకి}; పాశ = తాడుచేత; పరివలయిత = చుట్టబడుటచేత; పర్యాయ = క్రమముగా; పరిభ్రాంత = తిరుగుచున్నట్టి; మథర = మంథర అను; అచల = పర్వతము అను; మంథాన = కవ్వముచేత; మథ్యమాన = చిలుకబడుతున్న; ఘూర్ణిత = తిరుగుటలువలన; ఘమఘమ = ఘమఘమ అనెడి ధ్వని; ఆయత = కలిగియున్న; మహార్ణవ = మహాసముద్రము; మధ్యంబునన్ = కడిలి; మధ్యంబునన్ = నడిమి; నుండి = ముండి; చనుదెంచు = వచ్చుచున్న; ఇందిరాసుందరీ = లక్మీదేవివంటి; వైభవంబునన్ = వైభవముతో; బహు = అనేక; విధ = రకముల; ప్రభా = కాంతులచేత; ప్రభాసమాన = మిక్కలి ప్రకాశించునది; ఐ = అయ్యి; ఇందుధరసుందరీ = పార్వతీదేవి {ఇందుధరసుందరి - ఇందుధర (శివుని) సుందరి, పార్వతి}; మందిరంబున్ = గుడినుండి; వెడలి = బయలుదేరి; మానసకాసార = మానససరోవరములోని; హేమ = బంగారు; కమల = పద్మముల; కానన = సమూహమునందు; విహారమాణ = విహరించుచున్న; మత్త = మదించిన; మరాళంబు = హంస; భంగిన్ = వలె; మంద = మెల్లని; గమనంబునన్ = నడకతో; కనక = బంగారు; కలశ = కలశముల; యుగళ = జంటతో; సంకాశ = సరిపోలునట్టి; కర్కశ = కఠినములైన; పయోధర = స్తనముల {పయోధరము - పయః (పాలను) ధరించునది, కుచము}; భార = బరువుచేత; పరికంప్యమాన = మిక్కలి ఊపబడుతున్న; మధ్య = నడుము కలామె; ఐ = అయ్యి; రత్న = మణులు పొదిగిన; ముద్రికా = ఉంగరములుచే; అలంకృతంబు = అలకరింపబడినది; ఐన = అయిన; కెంపు = ఎర్రని; కేలన్ = చేతితో; ఒక్క = ఒక; సఖీ = చెలికత్తెలలో; లలామ = శ్రేష్ఠురాలు; కైన్ = చేతిని; దండగొని = అసరాతీసుకొని; రత్న = మణుల; నివహ = సమూహముల; సమంచిత = చక్కగా అలంకరించిన; కాంచన = బంగారు; కర్ణపత్ర = చెవికమ్మల; మయూఖంబులు = కాంతులు; గండభాగంబులన్ = చెక్కిళ్ళపై; నర్తనంబులు = నాట్యములు; సలుపన్ = చేయుచుండగా; అరవింద = పద్మములయొక్క; పరిమళ = సువాసనలందలి; కుతూహల = కౌతుకముచేత; అవతీర్ణ = వాలిన; మత్త = మదించిన; మధుకరంబులన్ = తుమ్మెదల; మాడ్కిన్ = వలె; అరాళంబులు = ఉంగరాలుతిరిగినవి; ఐన = అయిన; కుంతల = తలవెంట్రుకల; జాలంబులు = సమూహములు; ముఖిన్ = ముఖము అను; మండలంబునన్ = బింబమునందు; క్రందుకొనన్ = కమ్ముకొనగా; సుందర = అందమైన; మందహాస = చిరునవ్వుల; రోచులు = కాంతులు; దిశలు = నలుదిక్కుల; అందున్ = అందు; బాల = లేత; చంద్రికా = వెన్నెలల; సౌందర్యంబున్ = అందమును; ఆవహింపన్ = కలుగజేయగా; అధర = కిందపెదవి అనెడి; బింబఫల = దొండపండు వంటి; అరుణ = ఎర్రనైన; మరీచి = కిరణ, కాంతి; మాలికలు = సమూహములు; రదన = పండ్లు అనెడి; కుంద = మల్లె; కుట్మంబుల్ = మొగ్గల; కున్ = కు; అనురాగంబున్ = అనురక్తి, ఎర్రదనము; సంపాదింపన్ = కలుగజేయగా; మనోజాత = మన్మథుని; కేతన = జండాను; సన్నింభంబు = సరిపోలునట్టిది; ఐన = అయిన; పయ్యెద = పైట; కొంగు = అంచు; తూగన్ = వేలాడుచుండగా; సువర్ణ = బంగారు; మేఖలా = మొలనూలియందు; ఘటిత = కూర్చబడిన; మణి = మణుల; కిరణ = కాంతుల; పటలంబులు = సమూహములు; అకాల = కాలముకానికాలములోని; శక్రచాప = ఇంద్రధనుస్సు; జనకంబులు = పుట్టిచునవి; ఐ = అయ్యి; మెఱయన్ = ప్రకాశించుచుండగా; చెఱకువిలుతుండు = మన్మథుడు {చెఱకువిలుతుడు - చెరకుగడ ధనుస్సుగా కలవాడు, మన్మథుడు}; ఒరన్ = కత్తిఒరనుండి; పెఱకి = దూసి; వాడి = పదునైన; అడిదంబున్ = కత్తిని; జళిపించినన్ = చలింపజేయగా; ధగధగ = ధగధగమనెడి మెరుపులు; ఆయమానంబులు = కలిగినవి; అగు = ఐన; బాణంబులన్ = బాణముల; పగిదిన్ = వలె; సు = మిక్కిలి; రుచిర = కాంతివంతమైన; విలోకన = చూపుల; నికరంబులున్ = సమూహములు; రాజ = రాజుల; వీరుల = శూరుల; హృదయంబులున్ = మనస్సులను; భేదింపన్ = బద్దలుకొడుతుండగా; శింజాన = అందెలధ్వని కలిగిస్తున్న; మంజు = మనోజ్ఞములైన; మంజీర = కాలిఅందెల; నినదంబులు = శబ్దములు; చెవులన్ = చెవులకు; పండువు = వేడుక; చేయన్ = కలిగించుచుండగా; పాదసంచారంబున = కాలినడకతో; హరి = కృష్ణుడు; రాక = వచ్చుటకు; ఎదురుచూచుచు = ఎదురుచూస్తు; వీర = వీరులను; మోహిని = మోహింపజేయునామె; ఐ = అయ్యి; చనుదెంచుచున్న = వస్తున్న; సమయంబునన్ = సమయమునందు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం: :

No comments: