Saturday, November 29, 2014

రుక్మిణీకల్యాణం – కన్నియమీఁద నా తలఁపు

36- వ.
అని యిట్లు పలికిన బ్రాహ్మణునివలన విదర్భరాజ తనయ పుత్తెంచిన సందేశంబును, రూప సౌందర్యాది విశేషంబులును విన నవధరించి నిజకరంబున నతని కరంబుఁబట్టి నగుచు న య్యాదవేంద్రుండు; యిట్లనియె.
37- ఉ.

న్నియమీఁద నా తలఁపు గాఢము; కూరుకురాదు రేయి నా

కెన్నఁడు; నా వివాహము సహింపక రుక్మి దలంచు కీడు నే

మున్నె యెఱుంగుదుం; బరులమూఁక వధించి కుమారిఁ దెత్తు వి

ద్వన్నుత! మ్రాను ద్రచ్చి నవహ్నిశిఖన్ వడిఁ దెచ్చు కైవడిన్.

          ఇలా పలికిన బ్రాహ్మణుడి ద్వారా రుక్మిణి పంపిన సందేశం, ఆమె చక్కదనాలు అవి గ్రహించి కృష్ణుడు అతని చేతులో చేయ్యేసి నవ్వుతూ ఇలా అన్నాడు.
          సచ్చీలుడా! రుక్మిణీకన్య మీద నాకు గాఢమైన మనసుంది. రాత్రిళ్ళు నిద్రే రాదు. మా పెళ్ళికి ఇష్టపడక రుక్మి పెట్టే అడ్డంకులు నాకు ముందే తెలుసు. కట్టెని మధించి అగ్ని పుట్టించినట్లు, శత్రువులను మర్ధించి కన్యను తీసుకొస్తాను.
పరమ విష్ణుపరాయణురాలు జీవాత్మగా అనేక జన్మలలో వ్రతాదులు ఎన్నెన్నో చేసి అర్హత సాధించింది రుక్మిణి. పరమాత్మతో నేరుగా సంబంధానికి ఉవ్విళ్ళూరుతున్నది. ఆకలి నిద్రలపై దృష్టిలేని ఏకాగ్ర భక్తి. అదే అగ్ని ద్యోతనుడు తెచ్చిన గుహ్యమైన సందేశం. మరి శ్రీకృష్ణపరమాత్మ కూడ కూరుకురాదు రేయి అంటున్నాడు. భక్తునికి భగవంతునికి, జీవాత్మకు పరమాత్మకు మద్యన ఎంతటి అవినాభావ సంబంధం.
36- va.
ani yiTlu palikina braahmaNunivalana vidarbharaaja tanaya putteMchina saMdEshaMbunu, roopa sauMdaryaadi vishEShaMbulunu vina navadhariMchi nijakaraMbuna natani karaMbuM~baTTi naguchu na yyaadavEMdruMDu; yiTlaniye.
37- u.
kanniyameeM~da naa talaM~pu gaaDhamu; koorukuraadu rEyi naa
kennaM~Du; naa vivaahamu sahiMpaka rukmi dalaMchu keeDu nE
munne yeRruMguduM; barulamooM~ka vadhiMchi kumaariM~ dettu vi
dvannuta! mraanu drachchi navavahnishikhan vaDiM~ dechchu kaivaDin.
          అని = అని; ఇట్లు = ఈ విధముగ; పలికిన = చెప్పిన; బ్రాహ్మణుని = విప్రుని; వలన = వలన; విదర్భరాజతనయ = రుక్మిణీదేవి {విదర్భరాజతనయ - విదర్భరాజు (భీష్మకుడు) యొక్క పుత్రిక, రుక్మిణి}; పుత్తెంచిన = పంపించిన; సందేశంబున్ = సమాచారము; రూప = చక్కదనము; సౌందర్య = అందము; ఆది = మున్నగు; విశేషంబులున్ = విశిష్టతలను; వినన్ = వినవలెనని; అవధరించి = సమ్మతించి; నిజ = తన యొక్క; కరంబునన్ = చేతి యందు; అతని = అతని యొక్క; కరంబున్ = చేతిని; పట్టి = పట్టుకొని; నగుచున్ = నవ్వుతు; = ఆ యొక్క; యాదవేంద్రుండు = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
          కన్నియ = కన్యక; మీదన్ = పైన; నా = నా యొక్క; తలపున్ = మనసులో; గాఢము = దృఢముగా నున్నది; కూరుకు = నిద్ర; రాదు = రాదు; రేయి = రాత్రు లందు; నా = నా; కున్ = కు; ఎన్నడున్ = ఎప్పుడు; నా = నాతోడి; వివాహమున్ = పెండ్లిని; సహింపక = ఓర్వజాలక; రుక్మి = రుక్మి; తలంచున్ = తలపెట్టును; కీడు = చెరుపును; నేన్ = నేను; మున్న = ముందుగనే; ఎఱుంగుదున్ = తెలిసి యుంటిని; పరుల = శత్రువుల; మూక = సమూహమును; వధించి = చంపి; కుమారిన్ = కన్యకను; తెత్తున్ = తీసుకొచ్చెదను; విద్వన్ = విద్వాంసులచేత; నుత = పొగడబడువాడ; మ్రానున్ = కర్రను; త్రచ్చి = మథించి; నవ = కొత్త; వహ్ని = అగ్ని; శిఖన్ = మంటను; వడిన్ = వేగముగా; తెచ్చు = తీసుకొచ్చెడి; కైవడిన్ = విధముగ.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: