Tuesday, November 25, 2014

రుక్మిణీకల్యాణం – ఘను లాత్మీయ

32- మ.
ను లాత్మీయ తమోనివృత్తికొఱకై గౌరీశుమర్యాద నె
వ్వని పాదాంబుజతోయమందు మునుఁగన్ వాంఛింతు రే నట్టి నీ
నుకంపన్ విలసింపనేని వ్రతచర్యన్ నూఱు జన్మంబులున్
నినుఁ జింతించుచుఁ బ్రాణముల్ విడిచెదన్ నిక్కంబు ప్రాణేశ్వరా!
          జీవితేశ్వరా! నాథా! పార్వతీపతి పరాత్పరుని పాదపద్మాల యందు ప్రభవించిన పవిత్ర గంగాజలాలలో ఓలలాడుతుంటాడు.  మహాత్ములు అజ్ఞాన రాహిత్యం కోరి, పరమేశ్వరుని వలెనే, ఆ పరాత్పరుని గంగాజలాలలో ఓలలాడాలని కోరుతుంటారు. అటువంటి తీర్థపాదుడ వైన నీ యనుగ్రహాన్ని అందుకొని మనలేని ఎడల, బ్రహ్మచర్యదీక్షా వ్రతనిష్ఠ వహించి వంద జన్మలు కలిగినా సరే, నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ, తప్పక నా ప్రాణాలు నీకే అర్పిస్తాను.
  రుక్మిణీ సందేశంలోని సుమథురమైన పద్యరాజం యిది.  భాగవతమే మహా మహిమాన్వితం, అందులో రుక్మిణీ కల్యాణం మహత్వం ఎవరికైనా చెప్పతరమా. – ఆత్మేశ్వరా! పరమాత్మా! ఆత్మజ్ఞాన సంపన్నులు కూడ తమ హృదయాలలోని అవశిష్ఠ అజ్ఞానాంధకార నివారణ కోసం సాత్వికగుణం అభివృద్ధి చేసి తమోగుణం గ్రసించే బ్రహ్మవేత్త లాగ ఏ పరబ్రహ్మ అనే పవిత్ర జ్ఞాన గంగలో లయం కావాలని కోరతారో అట్టి పరబ్రహ్మతో ఈ జన్మలో ఉపరతి జెందలేనిచో ఎన్ని జన్మ లైనా పట్టుబట్టి విడువ కుండా మళ్ళీ మళ్ళీ మరణించే దాకా తపిస్తూనే ఉంటాను అంటున్నది రుక్మిణి అనే జీవాత్మ.
32- ma.
ghanu laatmeeya tamOnivRittikoRrakai gaureeshumaryaada ne
vvani paadaaMbujatOyamaMdu munuM~gan vaaMchhiMtu rE naTTi nee
yanukaMpan vilasiMpanEni vratacharyan nooRru janmaMbulun
ninuM~ jiMtiMchuchuM~ braaNamul viDichedan nikkaMbu praaNEshvaraa!
          ఘనులు = గొప్పవారు; ఆత్మీయ = తమ యొక్క; తమః = అఙ్ఞానమును; నివృత్తి = తొలగించుకొనెడి; వృత్తిన్ = ఉపాయము; కొఱకు = కోసము; = అయ్యి; గౌరీశు = శివుని {గౌరీశుడు - గౌరి యొక్క ప్రభువు, శివుడు}; మర్యాదన్ = వలెనే; ఎవ్వని = ఎవరి యొక్క; పాద = పాదము లనెడి; అంబుజ = పద్మముల; తోయము = తీర్థము; అందున్ = అందు; మునుగన్ = స్నానముచేయవలె నని; వాంఛింతురు = కోరుదురో; ఏనున్ = నేను కూడ; అట్టి = అటువంటి; నీ = నీ యొక్క; అనుకంపన్ = దయచేత; విలసింపనేని = మేలగకపోతే; వ్రత = వ్రతదీక్ష; చర్యన్ = వంటి కార్యముగా; నూఱు = వంద (100); జన్మంబులున్ = రాబోవు జన్మములులో; నినున్ = నిన్ను; చింతించుచున్ = తలచుచు; ప్రాణముల్ విడిచెదన్ = చనిపోయెదను; నిక్కంబు = ఇది తథ్యము; ప్రాణేశ్వరా = నా పాణమునకు ప్రభువా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: