Monday, September 22, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – శ్రీకృష్ణా యదుభూషణా

1-201-శా.
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
      శ్రీ కృష్ణ! యదుకులవిభూషణ! విజయమిత్ర! శృంగార రసరత్నాకర! జగత్కంటకులైన మహీపతుల వంశాలను దహించి వేసిన వాడ! జగదీశ్వర! ఆపన్నులైన అమరుల, అవనీసురుల, ఆవులమందల ఆర్తులను బాపువాడ! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకు ఈ భవబంధాలను తెంపెయ్యి.
      ద్వారకకు తిరిగివెళ్తున్న శ్రీకృష్ణుని గూర్చి కుంతీదేవి చేసిన స్తుతి బహుప్రసిద్ధమైనది. స్తుతిలోని పద్య మిది.
1-201-Saa.
SreekRshNaa! yadubhooshaNaa! narasakhaa! SRMgaararatnaakaraa!
lOkadrOhinaraeMdravaMSadahanaa! lOkaeSvaraa! daevataa
neekabraahmaNagOgaNaartiharaNaa! nirvaaNasaMdhaayakaa!
neekun mrokkeda@M druMpavae bhavalatal nityaanukaMpaanidhee!
          శ్రీకృష్ణా = కృష్ణా {కృష్ణ - నల్లనివాడు}; యదుభూషణా = కృష్ణా {యదు భూషణా - యదు వంశమునకు భూషణము వంటి వాడు / కృష్ణుడు}; నరసఖా = కృష్ణా {నరసఖ - అర్జునునకు సఖుడు / కృష్ణుడు}; శృంగార రత్నాకరా = కృష్ణా {శృంగార రత్నాకర -శృగార రసమునకు సముద్రము వంటివాడు / కృష్ణుడు}; లోకద్రోహి నరేంద్ర వంశ దహనా = కృష్ణా {లోకద్రోహి నరేంద్ర వంశ దహనా - దుష్టరాజవంశముల నాశనము చేయువాడు, కృష్ణుడు}; లోకేశ్వరా = కృష్ణా {లోకేశ్వర - లోకములకు ఈశ్వరుడు / కృష్ణుడు}; దేవత = దేవతల; అనీక = సమూహమునకును; బ్రాహ్మణ = బ్రాహ్మణులకును; గోగణ = గోవుల మందకును; ఆర్తి = బాధలను; హరణా = హరించువాడా / కృష్ణా; నిర్వాణ సంధాయకా = కృష్ణా {నిర్వాణ సంధాయిక - మోక్షమును కలింగించువాడు / కృష్ణుడు}; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరించెదను; త్రుంపవే = తెంపుము; భవ = సంసార; లతల్ = బంధనములు; నిత్యానుకంపానిధీ = కృష్ణా {నిత్యానుకంపానిధీ -నిత్యమైన దయకు నిలయమైనవాడు / కృష్ణుడు}.

~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: