Sunday, July 6, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 343

అడిచితివో


1-357-క.
డిచితివో భూసురులను;
గుడిచితివో బాల వృద్ధ గురువులు వెలిగా;
విడిచితివో యాశ్రితులను;
ముడిచితివో పరుల విత్తములు లోభమునన్.
          ఆరాధ్యులైన భూసురులను అణచివేసావా, లేకపోతే బాలురకు వృద్ధులకు గురువులకు పెట్టకుండా కుడిచినావా, శరణని చేరిన వారిని కాపాడకుండా వదలిపెట్టావా, పోనీ పరుల ధనాలను లోభం కొద్దీ ముడిచేసావా; తప్పు చేసినవాడికి కాని నీ కెందుకయ్యా యీ విచారం.
ద్వారక నుండి విచార వదనంతో వచ్చిన అర్జునుడుని విషయ మేమిటి అని ధర్మరాజు అడుగుతున్నాడు.
1-357-ka.
aDichitivO bhoosurulanu;
guDichitivO baala vRddha guruvulu veligaa;
viDichitivO yaaSritulanu;
muDichitivO parula vittamulu lObhamunan.
అడిచితివో = అణగ్గొట్టితివా ఏమిటి; భూసురులను = బ్రాహ్మణులను {భూసురులు - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; కుడిచితివో = తింటివా ఏమిటి; బాల = పిల్లలను కాని; వృద్ధ = ముసలివారిని కాని; గురువులు = గురువులను కాని; వెలిగా = విడిచి పెట్టి; విడిచితివో = విడిచిపెట్టావా ఏమిటి; ఆశ్రితులను = ఆశ్రయించినవారిని; ముడిచితివో = మూటగట్టితివా ఏమిటి; పరుల = ఇతరుల; విత్తములు = ధనములను; లోభమునన్ = పిసినారితనముతో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: