Thursday, April 10, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 255

జలజాతాక్షుడు

1-259-ఉ.

జాతాక్షుఁడు సూడ నొప్పె ధవళఛ్ఛత్రంబుతోఁ జామరం
బుతోఁ బుష్ప పిశంగ చేలములతో భూషామణిస్ఫీతుఁ డై
లినీభాంధవుతో శశిధ్వజముతో క్షత్రసంఘంబుతో
భిచ్ఛాపముతోఁ దటిల్లతికతో భాసిల్లు మేఘాకృతిన్.
          ఆ కమలనేత్రుడు శ్యామసుందరుడు శ్వేత ఛత్రంతో, చామరాలతో, పూలతో, పీతాంబరాలతో, భూషణాలలోని మణిసమూహంతో; సూర్యునితో, చంద్రునితో, నక్షత్రాల సమూహంతో, ఇంద్ర ధనుస్సుతో, మెరుపు తీగలతో భాసిల్లే మేఘంలా ప్రకాశిస్తున్నాడు.
ద్వారకానగరం తిరిగివచ్చి, జననీజనకుల వద్దకు వెళ్తున్న శ్రీకృష్ణుని వర్ణన ఇది. శ్వేత ఛత్రం, చామరం, పూలు, పీతాంబరాలు, మణులను; సూర్య, చంద్ర, నక్షత్రాలు, ఇంద్రధనుస్సు, మెరుపు తీగలతో క్రమంగా ఉపమానం చమత్కారంగా చెప్పారు. మేఘాలు అడ్డొస్తే సూర్య, చంద్ర, నక్షత్రాలు కనబడవు. సూర్యుడుంటే చంద్రుడు నక్షత్రాలు కనబడవు. మెరుపు మెరుస్తుంటే నక్షత్రాలు, నక్షత్రాలున్నప్పుడు ఇంద్రధనుస్సు కనబడవు. కాని శ్రీకృష్ణుని వైభవం ఇలాంటివన్ని కూడగట్టుకు రాగలంత గొప్పదని కవి అన్యాపదేశంగా చెప్తున్నాడు.
1-259-u.
jalajaataakshu@MDu sooDa noppe dhavaLaChChatraMbutO@M jaamaraM
bulatO@M bushpa piSaMga chaelamulatO bhooshaamaNi spheetu@M Dai
nalineebhaaMdhavutO SaSidhvajamutO nakshatrasaMghaMbutO
balabhichChaapamutO@M daTillatikatO bhaasillu maeghaakRtin.

            జలజాతాక్షుడు = కృష్ణుడు {జలజాతాక్షుడు - జలజాత (పద్మములవంటి) అక్షుడు, కృష్ణుడు}; చూడన్ = చూచుటకు; ఒప్పె = చక్కగా ఉన్నాడు; ధవళత్ = తెల్లని; ఛత్రంబు = గొడుగుల; తోన్ = తో; చామరంబుల = చామరముల; తోన్ = తో; పుష్ప = పుష్పములతో; పిశంగ = వంగపండురంగు; చేలముల = వస్త్రముల; తోన్ = తో; భూషా = భూషణములలోని; మణి = మణులు; స్పీతుఁడు = అధికముగా కలవాడు; = అయ్యి; నలినీభాంధవు = పద్మముల బంధువు / సూర్యుని {నలినీబాంధవుడు – పద్మములకు బంధువు, సూర్యుడు}; తోన్ = తో; శశిధ్వజము = చంద్రుని {శశిధ్వజుడు – కుందేలు గుర్తు గలవాడు, చంద్రుడు}; తోన్ = తో; నక్షత్ర = తారకల; సంఘంబు = సమూహము తోన్ = తో; బలభిచ్ఛాపము = ఇంద్రధనుస్సు{బలభిచ్చాపము - బలభిత్ (ఇంద్రుని) చాపము (ధనుస్సు), ఇంద్రధనుస్సు}; తోన్ = తో; తటిల్లతిక = మెరుపుల; తోన్ = తో; భాసిల్లు = ప్రకాసించు; మేఘ = మేఘము యొక్క; ఆకృతిన్ = ఆకృతితో.


~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: