Tuesday, March 25, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 238

కలడంభోధి

  









7-274-మ.
లఁ డంభోధిఁ, గలండు గాలిఁ, గలఁ డాకాశంబునం, గుంభినిం
లఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ద్యోత చంద్రాత్మలం
లఁ, డోంకారమునం ద్రిమూర్తులఁ ద్రిలింవ్యక్తులం దంతటం
లఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల యీ యా యెడన్.
          నాయనా! భగవంతుడు అయిన శ్రీమహావిష్ణువు లేని చోటు విశ్వములో ఎక్కడ లేదు. అంతట వ్యాపించియే ఉన్నాడు. నీటిలో, గాలిలో, ఆకాశంలో ఉన్నాడు. భూమిమీద ఉన్నాడు. అగ్నిలోను ఉన్నాడు. సర్వదిక్కులలోను ఆయన ఉన్నాడు. పగలు రాత్రి సమయాలలో ఉన్నాడు. సూర్యుడు , చంద్రుడు, ఆత్మ, ఓంకారం, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, స్త్రీ పురష నపుంసక అనే త్రిలింగ వ్యక్తులు అందరు ఇలా బ్రహ్మాది పిపీలక పర్యంతమందు ఆయన ఉన్నాడు. అట్టి సర్వ పూర్ణుడు, సర్వవ్యాపి, సర్వేశ్వరుడు కోసం ఎక్కడెక్కడో వెదకాల్సిన పనిలేదు. సర్వే, సర్వకాల, సర్వావస్థలలోను ఉన్నడయ్యా!
హరి హరి యని ఊరికే పలవరించేస్తున్నావు. కాని వాడు ఎక్కడా లేడు విశ్వమంతా వెదికాను నాకెక్కడా కనిపించలేదు. తెలుసున్నట్టు చెప్తున్నావు. అసలు ఎక్కడ ఆ హరి అన్నవాడు. చూపెట్టు అని హిరణ్య కశిపుడు కొడుకుని గద్దించి అడిగాడు. వినయ వివేకశీలి, హరికింకరుడు అయిన బాలుడు ప్రహ్లాదుడు తండ్రికి శైశవ సహజ లక్షణంతో నృత్యంలా కాళ్ళు చేతులు కళ్ళు కదుపుతు చెప్తున్నాడు. ఇక్కడ ప్రహ్లాద చరిత్రలో ఎక్కడున్నాడు అనేవాడికి కనిపించడు; ఉన్నాడు అన్నవాడికి అన్నిట కనిపిస్తాడు భగవంతుడు అన్న సత్యం నిరూపితం చేయటం చమత్కారం.
7-274-ma.
kala@M DaMbhOdhi@M, galaMDu gaali@M, gala@M DaakaaSaMbunaM, guMbhiniM
gala@M, Dagnin diSalaM bagaLLa niSalan khadyOta chaMdraatmalaM
gala@M, DOMkaaramunaM drimoortula@M driliMgavyaktulaM daMtaTaM
gala@M, DeeSuMDu galaMDu, taMDree! vedakaMgaa naela yee yaa yeDan.
          కలడు = ఉన్నాడు; అంభోధిన్ = సముద్రముల లోను; కలండు = ఉన్నాడు; గాలిన్ = గాలి లోను; కలడు = ఉన్నాడు; ఆకాశంబునన్ = ఆకాశము లోను; కుంభినిన్ = భూమి యందును; కలడు = ఉన్నాడు; అగ్నిన్ = నిప్పు లోను; దిశలన్ = దిక్కు లన్నిటి యందును; పగళ్ళన్ = దినము లందును; నిశలన్ = రాత్రు లయందును; ఖద్యోత = సూర్యుని {ఖద్యోతము - ఖత్ (ఆకాశమున) జ్యోతము (ప్రకాశించునది), సూర్యుడు}; చంద్ర = చంద్రుని; ఆత్మలన్ = ఆత్మ లందు; కలడు = ఉన్నాడు; ఓంకారమునన్ = ఓంకారము నందును; త్రిమూర్తులన్ = త్రిమూర్తు లందును {త్రిమూర్తులు - 1బ్రహ్మ 2 విష్ణు 3మహేశ్వరులు}; త్రిలింగ = స్త్రీ పురుష నపుంసక {త్రిలింగములు - 1స్త్రీలింగము 2పుల్లింగము 3నపుంసకలింగము}; వ్యక్తులన్ = జాతులవారి; అందున్ = అందు; అంతటన్ = అంతటను; కలడు = ఉనాడు; ఈశుండు = భగవంతుడు {ఈశుడు - నైజముచేతనే ఐశ్వర్యములు గల వాడు, విష్ణువు}; కలండు = ఉన్నాడు; తండ్రి = తండ్రీ; వెదుకంగన్ = అన్వేషించుట; ఏల = ఎందుకు; ఈయాయెడన్ = ఇక్కడా అక్కడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: