Monday, March 17, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 230

పాఱడు

 

 

 






7-194-ఉ.
పాఱఁడు లేచి దిక్కులకు; బాహువు లొడ్డఁడు; బంధు రాజిలోఁ
దూఱఁడు; ఘోరకృత్య మని దూఱఁడు; తండ్రిని మిత్రవర్గముం
జీరఁడు; మాతృసంఘము వసించు సువర్ణ గృహంబు లోనికిం
దాఱఁడు; కావరే యనఁడు; తాపము నొందఁడు; కంటగింపఁడున్.
          హిరణ్యకశిపుడు రాక్షస సైనికులతో చేత దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రహ్లాదుని చితగ్గొట్టిస్తున్నాడు. ప్రహ్లాదుడు మహా మహిమాన్విత భక్తుడు కదా, రాక్షసులు ఎన్ని బాధలు పెడుతున్నా ప్రహ్లాదుడు భగవంతుంణ్ణి స్మరిస్తున్నాడు తప్ప కళ్ళ నీళ్ళు పెట్టటం లేదు, ఏ మాత్రం జంకడు. (దూఱడుని ఉన్న రెండర్థాలుతో రెండు సార్లు వాడారు)
ఇటు అటు దూరంగా పారిపోడు. కొట్టద్దని చేతులు అడ్డం పెట్టుకోడు. బంధువుల గుంపు లోకి దూరిపోడు.  ఘోరం, అన్యాయం అంటు గోల చేయడు. కొట్టిస్తున్న తండ్రిని తిట్టను కూడ తిట్టడు. తన స్నేహితులను ఎవరిని సాయం చెయ్యమని పిలవడు. తల్లులు ఉండే బంగారు మేడల లోపలకి పోయి దాక్కోడు. కాపాడండి కాపాడండి అని కూడ అనడు. అస్సలు బాధ పడడు. వాళ్ళని ఎందుకు కొట్టరు అంటు ఎవరిమీద అసూయ చెందడు. ఇలాంటి పిల్లాడిని ఎక్కడైనా ఉంటాడా?
7-194-u.
paaRa@MDu laechi dikkulaku; baahuvu loDDa@MDu; baMdhu raajilO@M
dooRa@MDu; ghOrakRtya mani dooRa@MDu; taMDrini mitravargamuM
jeera@MDu; maatRsaMghamu vasiMchu suvarNa gRhaMbu lOnikiM
daaRa@MDu; kaavarae yana@MDu; taapamu noMda@MDu; kaMTagiMpa@MDun.
          పాఱడు = పారిపోడు; లేచి = లేచిపోయి; దిక్కుల్ = దూర ప్రదేశముల; కున్ = కు; బాహువులు = చేతులు; ఒడ్డడు = అడ్డము పెట్టడు; బంధు = చుట్టముల; రాజి = సంఘము; లోన్ = లోకి; దూఱడు = ప్రవేశింపడు; ఘోర = ఘోరమైన; కృత్యము = కార్యము, పని; అని = అనుచు; దూఱడు = తిట్టడు; తండ్రిని = తండ్రిని; మిత్ర = స్నేహితుల; వర్గమున్ = సమూహమును; చీరడు = పిలువడు; మాతృ = తల్లుల; సంఘము = సమూహము; వసించు = ఉండెడి; సువర్ణ = బంగారు; గృహంబు = ఇంటి; లోని = లోపలి; కిన్ = కి; తాఱడు = దాగి కొనడు; కావరే = కాపాడండి; అనడు = అనడు; తాపమున్ = సంతాపమును; ఒందడు = పొందడు; కంటగింపడున్ = ద్వేషము      చూపడు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: