Friday, February 28, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 213


కంటిగంటి

3-146-మత్త.
కంటిఁ గంటి భవాబ్ది దాటఁగ గంటి నాశ్రితరక్షకుం
గంటి యోగిజనంబు డెందము గంటిఁ జుట్టముఁ గంటి ము
క్కంటికిం గనరాని యొక్కటిఁ గంటిఁ దామరకంటిఁ జే
కొంటి ముక్తివిధానముం దలకొంటి సౌఖ్యము లందగన్.
          ఆహా! దర్శించాను; సందర్శించాను; సంసారసాగరాన్ని తరించాను; ఆశ్రితులను రక్షించే ఆ సర్వరక్షకుని దర్శించాను; మహాయోగుల ఆత్మబంధువును సందర్శించాను; మూడు కన్నులున్న మహేశ్వరునికి కూడ అంతుపట్టని అద్వితీయుని కనుగొన్నాను; పద్మాక్షుడు గోవిందుని చేరాను; ముక్తిమార్గాన్ని చేరుకున్నాను; పరమానందాన్ని అందుకున్నాను.
శ్రీకృష్ణనిర్యాణ ఘట్టంలో ఒక చెట్టుమొదట్లో ఆసీనుడైన స్వామిని కనుగొన్న ఉద్ధవుని ఉద్వేగం ఇది. ఈ మత్తకోకిల పద్యంలో ఉద్దవుడనే కోకిల కృష్ణదర్శనంతో మత్తెక్కి పారవశ్యంతో కూజితాలు చేస్తున్నాడు.
3-146-matta.
kaMTi@M gaMTi bhavaabdi daaTa@Mga gaMTi naaSritarakshakuM
gaMTi yOgijanaMbu DeMdamu gaMTi@M juTTamu@M gaMTi mu
kkaMTikiM ganaraani yokkaTi@M gaMTi@M daamarakaMTi@M jae
koMTi muktividhaanamuM dalakoMTi saukhyamu laMdagan.
          కంటిగంటి = చూసేను చూసేను; భవ = సంసారము అను; అబ్దిన్ = సాగరమును; దాటగన్ = దాటు విధానమును; కంటి = చూసితిని; ఆశ్రితరక్షకున్ = కృష్ణుని {ఆశ్రిత రక్షకుడు ఆశ్రయించిన వారిని రక్షించు వాడు, కృష్ణుడు}; కంటి = చూసితిని; యోగిజనంబు డెందమున్ = కృష్ణుని {యోగిజనంబు డెందము - యోగుల మనసులో ఉండు వాడు, విష్ణువు}; కంటి = చూసేను; చుట్టమున్ = బంధువును; కంటి = చూసేను; ముక్కంటికిం గనరాని యొక్కటిన్ = కృష్ణుని {ముక్కంటికిం గనరాని యొక్కటి - శివునికి కూడ చూచుటకురాని ఏకేశ్వరుడు, విష్ణువు}; కంటి = చూసేను; తామర కంటిన్ = కృష్ణుని {తామర కంటి - పద్మములవంటి కన్నులు ఉన్న వాడు, విష్ణువు}; చేకొంటి = చేపట్టేను; ముక్తి విధానమున్ = కృష్ణుని {ముక్తి విధానము ముక్తిని చేరు మార్గము, విష్ణువు}; తలకొంటి = చేరుకొన్నాను; సౌఖ్యములు = సౌఖ్యములు; అందగన్ = పొందగా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

2 comments:

gajula sridevi said...

రావుగారు,నేటి కాలంలోని చదువులలో ఇటువంటి పద్యాలు తగ్గిపోయాయి.మేము చిన్నతనంలో చదువుకునేటప్పుడు చిన్న తరగతుల్లోనే ఈ తరహా పద్యాలు ఉండేవి....అందుకనేనేమో సునిశిత భావాలు చక్కగా అలవడ్డాయి. మేము శ్రీకృష్ణ నిర్యాణం పాఠాన్ని ఏడవ తరగతిలోనే చదువుకున్నాం.

vsrao5- said...

నమస్కారం తల్లీ, మీ స్పందనలకి అభిమానానికి ధన్యవాదాలు.
మీరన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. మీ కన్నా వయస్సులో పెద్దవాడినే (65) కాని, నా భావనలు కూడ అలానే ఉన్నాయి. మీ తరం వరకు కొంత ఇంటిలో ఎలా ఉన్నా పాఠ్య పుస్తకాలలో ఉండేవి. కొందరైనా బుద్ధిమంతులు పాఠాలు చదివేవారు. చండామార్కుల చదువులు అనవచ్చు. ఇప్పుడు మార్కులు చదువులు మరి. నేను చండ అంటే తీవ్రమైన (తత్కాల్ అర్థం కూడ కూడి ఉన్నంది) మారకం (అర్థం తలచుకోడం ఎందుకులెండి) విధానం వారు అని అర్థం చేసుకుంటా. కొందఱు తప్పు అంటే అనవచ్చు. ఎందుకు అంటే మా చిన్నప్పుడు మన పద్యాలు, పాటలు వంటివే చెప్పేవారు. ఎంత వయసు వచ్చినా వాటిలో అంతరార్థాలు ఇంకా ఇంకా స్పురిస్తూ, స్పూర్తిదాయకంగానే ఉంటాయి. ఇప్పటి విద్యా విధానంలో చెప్పే రైమ్స్, ఫ్లాష్ కార్డులు విధానంలో పిల్లలకి గొప్ప సాంఘిక అభివృద్ధికి పునాది వేస్తున్నారు అనుకున్నా. వాటిలో వేటినైనా పెద్దయ్యాక గుర్తుచేసుకొని ఆనుభూతి చెందె, స్పూర్తి పొందే అవకాశం ఉందా, అని నా అనుమానం. 90 ఏళ్ళు వచ్చినా క్లబ్బు డాన్సులే జీవితం. డబ్బు సంపాదనే ధ్యేయం అంటే నేనేం చెప్పలేను.
మీ వంటి ఉత్తములతో పరిచయ భాగ్యం కలిగిస్తున్న మా నల్లనయ్యకు సహస్రాధిక సాష్టాంగప్రణామాలు.