Saturday, February 8, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 196

కొడుకులబట్టి

1-169-చంపకమాల
కొడుకులఁ బట్టి చంపె నని కోపము నొందదు బాలఘాతుకున్
విడువు మటంచుఁ జెప్పెడిని వెఱ్ఱిది ద్రౌపది; వీఁడు విప్రుఁడే?
విడువఁగ నేల? చంపుఁ డిటు వీనిని మీరలు సంపరేని నా
పిడికిటిపోటునన్ శిరము భిన్నము సేసెదఁ జూడుఁ డిందఱున్.
                తన కన్నకొడుకులను చంపేసాడు అని తెలిసినా కూడ ఈ శిశుహంతకుడు అశ్వత్థామ మీద ఈ ద్రౌపది కోపం తెచ్చుకోటం లేదు. పైగా వదలి వదలిపెట్టమంటోంది. ఎంత పిచ్చిదో చూడండి. బ్రాహ్మణుడు కదా వదలేయమంటోంది. ఇంతటి కసాయితనం చూపే వీడు బ్రాహ్మణుడా చెప్పండి. వీడిని వదలవలసిన అవసరం ఏంలేదు, చంపెయ్యండి. మీరు కనుక చంపకపోతే నేనే ఓగుద్దు గుద్ది వీడి బుర్రబద్దలుకొట్టేస్తాను. మీరంతా చూస్తూ ఉండండి.
దుర్యోధనునికి సంతోషంకలిగించటానికి అశ్వత్థామ ఉపపాండవులను అతిక్రూరంగా అర్థరాత్రి కటిక చీకటిలో సంహరించాడు. శ్రీకృష్ణార్జునులు వెంట తరిమి పట్టుకొని తీసుకొచ్చారు. సాధ్వీమణి అంతటి బాధలోను చక్కటి సంయమనంతో ఆలోచించి అశ్వత్థామను వదలిపెట్టమంది. కాని భీముడు ఉద్రేకంలోంచి ఇంకా బయటపడలేక తన కోపం ఇలా చూపుతున్నాడు.
1-169-చంపకమాల
Kodukula@M batti chaMpenani kOpamu noMdhadhu baalaghaathukun
Viduvu matMchu@M jeppedini vrRRidi dhroupadhi viidu viprudE?
viduva@Mga nEla? chaMpu@M ditu viinini miiralu saMparEni naa
pidikitipOtunan Siramu bhinnamu sEsedh@M juudu@M diMdhaRun.
          కొడుకులన్ = కొడుకులను; పట్టి = పట్టుకొని; చంపెన్ = చంపివేసెను; అని = అని; కోపమున్ = కోపము; ఒందదు = పొందదు; బాల = పిల్లలను; ఘాతుకున్ = సంహరించిన వానిని; విడువుము = వదిలిపెట్టుము; అటంచున్ = అంటూ; చెప్పెడిని = చెప్పుతున్నది; వెఱ్ఱిది = వెర్రిబాగులది; ద్రౌపది = ద్రౌపది; వీఁడు = ఇతడు; విప్రుఁడే = బ్రాహ్మణుడా; విడువఁగన్ = వదలిపెట్టుట; ఏల = ఎందుకు; చంపుఁడు = సంహరించండి; ఇటు = ఇలా; వీనిని = ఇతనిని; మీరలు = మీరు; సంపరేని = చంపకపోయినచో; నా = నాయొక్క; పిడికిటి = పిడికిలి; పోటునన్ = పోటుతో; శిరము = తల; భిన్నము = బద్దలు; సేసెదన్ = కొట్టెదను; చూడుఁడు = చూడండి; ఇందఱున్ = ఇంతమంది.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: