Friday, November 29, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 127



lalitaskaMdhamu

1-22-ma.
lalitaskaMdhamu, kRshNamoolamu, SukaalaapaabhiraamaMbu, maM
julataaSObhitamun, suvarNasumanassuj~naeyamun, suMdarO
jjvalavRttaMbu, mahaaphalaMbu, vimalavyaasaalavaalaMbunai
velayun bhaagavataakhyakalpataru vurvin saddvija Sraeyamai.
1-22-మ.
లితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం
జుతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో
జ్జ్వవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై
వెయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజ శ్రేయమై.
          శూలికైన దమ్మిచూలికైన తెలిసి పలుకుట చిత్రమై నట్టి శ్రీమద్భాగవత మహా పురాణం సాక్షాత్తు కల్పవృక్షమే. ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయం పోతనామాత్యులవారు రెండు రకాల  అన్వయార్థాలు గల మత్తేభ రూపంలో వివరించారు. అంటే గజారోహణ సన్మానం చేస్తారు కదండి అలా సన్మానిస్తు భాగవతం సర్వఫలసిద్ధి సంధాయకం అన్నారు అన్నమాట. కరుణశ్రీ గారు అన్నట్లు - భాగవత కల్పవృక్షాన్ని తెలుగు వారికి అందించిన  మీప్రతిభ అప్రతిమానం కదా, పోతన గారు ! మీరు ధన్యులండి.

ఇది భాగవతం అనే పేరుతో విరాజిల్లేది
ఇది కల్పవృక్షం అనే పేరుతో ప్రకాశించేది.
భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహర మైనది.
కల్పవృక్షం మాను మనోజ్ఞ మైంది.
భాగవతానికి మూలం భగవాను డైన శ్రీకృష్ణుడు.
కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది.
భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది.
కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది
భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది
కల్పవృక్షం అందమైన పూల తీగలుచే అలంకరింప బడినది
భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు అలరించేది.
కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లు తుంటుంది
భాగవతం సుందరము ఉజ్వలము అయిన వృత్తాంతాలు గలది.
కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది.
భాగవతం  కైవల్యాది కామిత ప్రయోజనాలు  సర్వం సమకూర్చేది.
కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది.
భాగవతం స్వచ్చమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది.
కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలతగల మాను కలిగినది.
భాగవతం భూలోకంలో విరాజిల్లుతోంది.
కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది.
భాగవతం ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయక మైనది.
కల్పవృక్షం శుక పికాది పక్షులకు శ్రేయస్కర మైనది.
          లలిత = చక్కని / అందమైన; స్కంధము = మానుతో / స్కంధములతో; కృష్ణ = నల్లని / కృష్ణుని కథలు; మూలము = వేళ్ళుతో / మూలాధారముగ; శుక = చిలుకల / శుక యోగి; ఆలాప = పలుకులతో / పలుకులచే; అభిరామంబు = రమణీయంగా / మిక్కిలి శోభాకరమై; మంజులత = అందమైన పూల తీగలతో / మనోహరమైన వాక్కులతో; శోభితమున్ = అలంకరింపబడుతూ / అలరారుతూ; సువర్ణ = మంచి రంగులు గల / మంచి అక్షర ప్రయోగాలు కలిగి; సుమనస్ = మంచి పువ్వులుతో / మంచి మనసున్నవారికి; సుజ్ఞేయమున్ = చక్కగ కనిపిస్తున్న / చక్కగ తెలిసే లాగ; సుందర = అందంగా / అందమైన; ఉజ్జ్వల = బాగా పెరిగిన / విలాసవంత మైన; వృత్తంబున్ = గుండ్రముగా నున్న / వృత్తములతోను; మహా = పెద్ద / గొప్ప; ఫలంబు = పళ్ళుతో / ఫలితా న్నిచ్ఛే లాగను; విమల = విస్తార మైన / నిర్మల మూర్తి యైన; వ్యాసా = చుట్టుకొలత గల / వ్యాసు డనే; అలవాలంబున్ = పాదుతో ఉన్నది/ పునాది కలిగినది; = అయ్యి; వెలయున్ = రూపుకట్టి యున్నది / రూపొంది యున్నది; భాగవత = భాగవత మనే; ఆఖ్య = పేరు గల; కల్పతరువు = కల్పతరువు; ఉర్విన్ = భూమిమీద / లోకంలో; సద్ద్విజ = చక్కటి పిట్టలుకు / సజ్జనులకు మరియు ద్విజులకు; శ్రేయము = మేలుకూర్చునది / శ్రేయస్కరము; = అయ్యి.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: