Wednesday, November 27, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 125



punnaaga

10.1-1010-సీ.
పున్నాగ కానవే! పున్నాగవందితుఁ; దిలకంబ! కానవే తిలకనిటలు;
ఘనసార! కానవే నసారశోభితు; బంధూక! కానవే బంధుమిత్రు;
మన్మథ! కానవే న్మథాకారుని; వంశంబ! కానవే వంశధరునిఁ;
జందన! కానవే చందనశీతలుఁ; గుందంబ! కానవే కుందరదను;
తే. నింద్రభూజమ! కానవే యింద్రవిభవుఁ;
గువల వృక్షమ! కానవే కువలయేశుఁ;
బ్రియకపాదప! కానవే ప్రియవిహారు;
ననుచుఁ గృష్ణుని వెదకి రయ్యబ్జముఖులు.
          శుకమహర్షి పరీక్షిన్మహారాజునకు సమస్త చరాచర జగత్తు అంతట వసించి ఉండే వాసుదేవుణ్ణి అందాల గోపభామినులు యమునాతీరంలో ప్రేమతో వివశులై పాడుతు వెదుకుతున్నవిధం చెప్తున్నారు గజేంద్రునిచే స్తుతింపబడ్డాడు వానిని చూసావా? ఓ పున్నాగ చెట్టు!నుదుట బొట్టు చక్కగా పెట్టుకొనే అతనిని చూసవా? ఓ బొట్టుగ చెట్టు! గొప్ప బలంతో భాసిల్లే వానిని చూసావా? ఓ కర్పూరపు అరటిచెట్టు! చుట్టాలకు చెలికాడైన వానిని చూసావా? ఓ మంకెన చెట్టు! మన్మథుని వంటి చక్కదనం గల వానిని చూసావా? ఓ వెలగ చెట్టు! వేణువు పట్టుకొని వాయిస్తుంటాడు వానిని చూసావా? ఓ వెదురుపొదా! మంచిగంధంలా చల్లటి వానిని చూసావా? ఓ చందనం చెట్టు! మొల్లమొగ్గల్లాంటి పళ్ళు కల అతనిని చూసావా? ఓ మొల్ల చెట్టు! దేవేంద్ర వైభవంతో వెలిగిపోయే వానిని చూసావా? ఓ మరువం చెట్టు! అతడే భూమండలానికే అధినాథుడు వానిని చూసావా? ఓ రేగుచెట్టు! మనోహర మైన విహారాలు కల వానిని చూసావా? ఓ కడప వృక్షమా! అంటు ఆ గుండ్రని మోముల గొల్లభామలు ఆ అందాల కృష్ణుని వెతుకసాగారు.
10.1-1010-see.
punnaaga kaanavae! punnaagavaMditu@M; dilakaMba! kaanavae tilakaniTalu;
ghanasaara! kaanavae ghanasaaraSObhitu; baMdhooka! kaanavae baMdhumitru;
manmatha! kaanavae manmathaakaaruni; vaMSaMba! kaanavae vaMSadharuni@M;
jaMdana! kaanavae chaMdanaSeetalu@M; guMdaMba! kaanavae kuMdaradanu;
tae. niMdrabhoojama! kaanavae yiMdravibhavu@M;
guvala vRkshama! kaanavae kuvalayaeSu@M;
briyakapaadapa! kaanavae priyavihaaru;
nanuchu@M gRshNuni vedaki ra yyabjamukhulu.
పున్నాగ = ఓ పొన్నచెట్టు; కానవే = చూసావా; పున్నాగ = పురుషశ్రేష్ఠులచే, మగ ఏనుగుచేత; వందితున్ = నమస్కరింపబడిన వానిని; తిలకంబ = ఓ బొట్టుగ చెట్టు; కానవే = చూసితివా; తిలక నిటలు = తిలకము నుదుట కల వాడు; ఘనసార = ఓ కప్పురం చెట్టు; కానవే = చూసితివా; ఘనసార = మేఘము వంటి  కాంతిచే; శోభితున్ = ప్రకాశించు వానిని; బంధూక = ఓ మంకెన చెట్టు; కానవే = చూసితివా; బంధు = బంధుత్వపు; మిత్రున్ = మిక్కలి స్నేహము చూపు వానిని; మన్మథ = ఓ వెలగచెట్టు; కానవే = చూసితివా; మన్మథ = మన్మథుని వంటి; ఆకారుని = ఆకారము కల వానిని; వంశంబ = ఓ వెదురు పొద; కానవే = చూసితివా; వంశధరుని = మురళీధరుని; చందన = ఓ గంధంచెట్టు; కానవే = చూసితివా; చందన = మంచిగంధము వలె; శీతలున్ = చల్లని వానిని; కుందంబ = ఓ మొల్ల చెట్టు; కానవే = చూసితివా; కుందర = మల్లెమొగ్గల వంటి; దనున్ = పండ్లు కల వానిని; ఇంద్ర = ఓ మరువపు; భూజమ = చెట్టు; కానవే = చూసితివా; ఇంద్ర = ఇంద్రునివంటి; విభవున్ = వైభవము కల వానిని; కువల = ఓ రేగు; వృక్షమ = చెట్టు; కానవే = చూసితివా; కువలయేశున్ = భూమికి ప్రభువును; ప్రియక = ఓ కడప; పాదప = చెట్టు; కానవే = చూసితివా; ప్రియ = మనోజ్ఞమైన; విహారున్ = విహారములు కల వానిని; అనుచు = అంటు; కృష్ణుని = కృష్ణుని; వెదకిరి = అన్వేషించిరి; = ఆ యొక్క; అబ్జముఖులు = అందమైన గోపికలు {అబ్జ ముఖి - పద్మములవంటి మోములు కలామె, సుందరి}.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: