Friday, November 22, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 120



aMbhOjanaabhuna

10.2-202-సీ.
అంభోజనాభున కంభోజనేత్రున; కంభోజమాలాసన్వితునకు
నంభోజపదున కనంతశక్తికి వాసు;దేవునకును దేవదేవునకును
భక్తులు గోరినభంగి నే రూపైనఁ; బొందువానికి నాదిపురుషునకును
నఖిల నిదానమై యాపూర్ణవిజ్ఞానుఁ; డైనవానికిఁ, బరమాత్మునకును,
ఆ. ధాతఁ గన్న మేటితండ్రికి, నజునికి,
నీకు వందనంబు నే నొనర్తు
నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప
రాపరాత్మ మహిత! మితచరితు!
                తన పుత్రుడు నరకాసురుని వధ అనంతరం భూదేవి సత్యాపతిని స్తోత్రం చేస్తోంది – సర్వభూత స్వరూపుడా! సాటిలేని వాడ! పరమేశ్వరా! అపర పరాలు తానే యైన మహితాత్ముడా! మేరలులేని వర్తనలు కలవాడ! నీవు పద్మనాభుడవు; పద్మాక్షుడవు; పద్మ మాలా విభూషణుడవు; పద్మపాదుడవు; అనంతశక్తి స్వరూపుడవు[1]; వసుదేవు సుతుడవు[2]; దేవాధిదేవుడవు; భక్తులు కోరిన రూపం ధరించ గల వాడవు[3]; ఆది పురుషుడవు; సమస్త జగత్తుకు కారకుడవు; పరిపూర్ణవిజ్ఞాన వంతుడవు; పరమాత్మవు; సృష్టికర్తల పుట్టుకకు కారణ మైన వాడవు; పుట్టుక లేనివాడవు;  అయినట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను.
10.2-202-see.
aMbhOjanaabhuna kaMbhOjanaetruna; kaMbhOjamaalaasamanvitunaku
naMbhOjapaduna kanaMtaSaktiki vaasu; daevunakunu daevadaevunakunu
bhaktulu gOrinabhaMgi nae roopaina@M; boMduvaaniki naadipurushunakunu
nakhila nidaanamai yaapoorNavij~naanu@M; Denavaaniki@M, baramaatmunakunu,
aa. dhaata@M ganna maeTitaMDriki, najuniki,
neeku vaMdanaMbu nae nonartu
nikhilabhootaroopa! nirupama! yeeSa! pa
raaparaatma mahita! yamitacharita!
             అంభోజనాభున్ = పద్మ నాభున {అంభోజ నాభుడు - జగత్సృష్టికి కారణ మైన బ్రహ్మ జనించిన కమలము నాభి యందు కలవాడు, విష్ణుమూర్తి}; కిన్ = కి; అంభోజ నేత్రున్ = పద్మాక్షున; కిన్ = కు; అంభోజ = పద్మముల; మాలా = దండ; సమన్వితున్ = కలిగి ఉన్న వాని; కున్ = కి; అంభోజ = పద్మములవంటి; పదున్ = పాదములు కల వాని; కున్ = కి; అనంత = అంతులేని {అనంతశక్తి - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వ భోక్తృత్వ సర్వ నియంతృత్వ సర్వ నియామకత్వ సర్వాంతర్యామిత్వ సర్వ సృష్టత్వ సర్వపాలకత్వ సర్వ సంహారకత్వాది మేర లేని సమర్థతలు కల వాడు, విష్ణువు}; శక్తి = శక్తి కల వాని; కిన్ = కి; వాసుదేవున్ = కృష్ణుని {వాసుదేవుడు - శ్లో. వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం, సర్వభూతని వాసోసి వాసుదేవ నమోస్తుతే. విష్ణువు, ప్రపంచమును లోప లుంచుకొని ప్రపంచ మందు ఎల్లడల సర్వ భూతము లందు వసించి ఉండు వాడు, విష్ణువు మరింకొక విధమున వసు దేవుని కొడుకు, కృష్ణుడు}; కును = కి; దేవ దేవున్ = దేవుళ్ళకే దేవుని; కును = కి; భక్తులు = భక్తులు; కోరిన = అపేక్షించిన; భంగిన్ = విధముగా; = ఎట్టి; రూపు = స్వరూపము {ఏ రూపైన పొందు వాడు - జలచర స్థలచర ఉభయచర జంతు మానవాది ఎట్టి ఆకృతు లైనను సూక్ష్మ స్థూలాది రూపము లైనను చేపట్టు వాడు}; ఐనన్ = అయినను; పొందు = ధరించెడి; వాని = వాని; కిన్ = కి; ఆది పురుషున్ = మూలకారణభూతు డైన వాని; కును = కి; అఖిల = సమస్తమునకు; నిదానము = ఆధారభూతమై; ఆపూర్ణ = సంపూర్ణ మైన; విఙ్ఞానుడు = విఙ్ఞానము తానైన వాడు; ఐన = అయిన; వాని = వాని; కిన్ = కి; పరమాత్మున్ = పరబ్రహ్మ ఐన వాని; కును = కి; ధాతన్ = బ్రహ్మను; కన్న = పుట్టించిన; మేటి = గొప్ప; తండ్రి = తండ్రి; కిన్ = కి; అజున్ = పుట్టుక లేని వాని; కిన్ = కి; నీ = నీ; కున్ = కు; వందనంబు = నమస్కారము; నేన్ = నేను; ఒనర్తున్ = చేసెదను; నిఖిల = సమస్త; భూత = జీవ; రూప = స్వరూపుడ; నిరుపమ = పోలికల కతీత మైనవాడ; ఈశ = సర్వ నియామక; పరా = పరా ప్రకృతియు; అపరా = అపరా ప్రకృతియు; ఆత్మ = స్వరూప మైన వాడ; మహిత = మిక్కిల గొప్ప వాడ; అమిత = మేర లేని; చరిత = వర్తన కల వాడ.


[1] అనంతశక్తి - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వ భోక్తృత్వ సర్వ నియంతృత్వ సర్వ నియామకత్వ సర్వాంతర్యామిత్వ సర్వ సృష్టత్వ సర్వపాలకత్వ సర్వ సంహారకత్వాది మేర లేని సమర్థతలు కల వాడు, విష్ణువు
[2] వాసుదేవుడు - శ్లో. వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం, సర్వభూతని వాసోసి వాసుదేవ నమోస్తుతే. విష్ణువు, ప్రపంచమును లోప లుంచుకొని ప్రపంచ మందు ఎల్లడల సర్వ భూతము లందు వసించి ఉండు వాడు, విష్ణువు మరింకొక విధమున వసు దేవుని కొడుకు, కృష్ణుడు
[3] ఏ రూపైన పొందు వాడు - జలచర స్థలచర ఉభయచర జంతు మానవాది ఎట్టి ఆకృతు లైనను సూక్ష్మ స్థూలాది రూపము లైనను చేపట్టు వాడు

No comments: