Friday, November 8, 2013

తెలుగు భాగవత తేనె సోనలు – 111



nammi

10.1-322-ఆ.
నమ్మి నిదురబోవ నా పట్టిచుంచు మా
లేఁగ తోఁకతోడ లీలఁ గట్టి
వీథు లందుఁ దోలె వెలది! నీ కొమరుండు;
రాచబిడ్డఁ డైన వ్వ మేలె?
10.1-322-aa.
nammi nidurabOva naa paTTichuMchu maa
lae@Mga tO@MkatODa leela@M gaTTi
veethu laMdu@M dOle veladi! nee komaruMDu;
raachabiDDa@M Daina Ravva maele?
                గోపికలు వచ్చి బాలకృష్ణుడి యల్లరి యశోదకు చెప్తున్నారు – ఓ ఉత్తమురాలా! యశోదమ్మా! నా కొడుకు ఆడి ఆడి అలసి నిద్రపోయాడు. నీ సుపుత్రుడు వచ్చి నా కొడుకు జుట్టును మా లేగదూడ తోకకు కట్టి, దాన్ని వీథు లమ్మట తోలాడు. ఎంత గొప్ప నాయకుడి పిల్లా డైతే మాత్రం ఇంతగా అల్లరి పెట్టవచ్చా.
          నమ్మి = నమ్మకముగా; నిదురబోవన్ = నిద్రపోగా; = ; పట్టి = చిన్నపిల్ల; చుంచున్ = జుట్టును, పిలకను; మా = మా యొక్క; లేగ = లేగదూడ; తోక = తోక; తోడన్ = తోటి; లీలన్ = విలాసముగా; కట్టి = కలిపి కట్టేసి; వీథులన్ = వీథుల; అందున్ = లోకి; తోలెన్ = పరిగెత్తించెను (ఆ దూడను); వెలది = పడతి, మేలైనది; నీ = నీ యొక్క; కొమారుండు = పుత్రుడు; రాచబిడ్డడు = రాకుమారుడు; ఐనన్ = అయినప్పటికిని; ఱవ్వ = అల్లరిచేయుట; మేలె = మంచిదా, కాదు.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

No comments: