Saturday, August 17, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_27


                                    విశ్వకరు విశ్వదూరుని
8-88-క.
            విశ్వకరు విశ్వదూరుని
            విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
            శాశ్వతు నజు బ్రహ్మ ప్రభు
            నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్.
            జగత్తు సృష్టి చేసి, ఆ జగత్తుకి ఆవతల దూరంగా నుంటూ, జగత్తుకి అంతరాత్మ యై, జగత్తు అంతటిలో తెలుసుకో దగిన వా డై, జగత్తే తా నై, జగత్తుకి అతీతు డై, పుట్టుక లేకుండా, ఎల్లప్పుడు ఉండు వాడై, ముక్తికి నాయకు డై, జగత్తు నడిపిస్తున్న ఆ పరమాత్ముని నేను ఆరాధిస్తాను.
          ఇలా తలచుకుంటూ మొసలికి చిక్కిన గజేంద్రుడు భగవంతుని తన మనస్సులో నెలకొల్పుకుంటు  ప్రార్థించడానికి సిద్ధ మయ్యాడు.
        విశ్వకరు - విశ్వ = జగత్తుని; కరున్ = సృష్టించెడి వానిని; విశ్వదూరుని - విశ్వ = జగత్తుకి; దూరునిన్ = అతీతముగ నుండు వానిని; విశ్వాత్ముని - విశ్వ = జగత్తు; ఆత్మునిన్ = తన స్వరూప మైన వానిని; విశ్వవేద్యు - విశ్వ = లోక మంతటికి; వేద్యున్ = తెలుసుకొన దగ్గ వానిని; విశ్వు నవిశ్వున్ - విశ్వున్ = లోకమే తా నైన వానిని; విశ్వున్ = లోకముకంటె భిన్న మైన వాని; శాశ్వతు నజు - శాశ్వతున్ = శాశ్వతముగ నుండు వానిని; అజున్ = పుట్టుక లేని వానిని; బ్రహ్మ ప్రభు నీశ్వరునిం బరమపురుషు నే - బ్రహ్మ = బ్రహ్మదేవునికి, మోక్షంకి; ప్రభున్ = ప్రభు వైన వానిని; ఈశ్వరునిన్ = లోకము నడిపించు వానిని; పరమ = సర్వ శ్రేష్ట మైన; పురుషున్ = పురుషుని; నేన్ = నేను; భజియింతున్ = స్తుతించెదను.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః || 

No comments: