Wednesday, August 14, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_25


దండంబు యోగీంద్ర మండల నుతునకు

6-336-సీ.
     దండంబు యోగీంద్ర మండల నుతునకు; దండంబు శార్ఙ్గ  కోదండునకును;
     దండంబు మండిత కుండల ద్వయునకు; దండంబు నిష్ఠుర భండనునకు;
     దండంబు మత్తవేదండ రక్షకునకు; దండంబు రాక్షస ఖండనునకు;
     దండంబు పూర్ణేందు మండల ముఖునకు; దండంబు తేజః ప్రచండునకును;
తే. దండ మద్భుత పుణ్య ప్రధానునకును;
     దండ ముత్తమ వైకుంఠ ధామునకును;
     దండ మాశ్రిత రక్షణ త్పరునకు;
     దండ మురు భోగినాయక ల్పునకును.
        సాక్షాత్కరించిన శేషశాయి యైన అనంతపద్మనాభుణ్ణి దర్శించి, వృత్రాసర భయ పీడితు లైన దేవతా బృందాలు స్తుతిస్తున్నారు.

        యోగీంద్ర బృందవందిత, శార్ఙ్గ మనే ధనస్సు ధరించిన స్వామీ నీకు నమస్కారం. కర్ణకుండలాలతో శోభిల్లే దేవదేవా, ఎదుర్కొన సాధ్యం కానంతటి యుద్ధం చేసే మహానుభావ నీకు దండము. గజేంద్రుని రక్షించినవాడ, రాక్షసులను శిక్షించినవాడ నీకు వందనం. చంద్రబింబం వంటి చక్కటి మోము గలవాడా, ప్రచండ మైన తేజస్సు గలవాడ నీకు ప్రణామం. అగణ్యపుణ్య స్వరూపా నమస్కారం. శ్రేష్ఠ మైన వైకుంఠధామమున నుండు దేవా దండం. ఆర్త జన రక్షణ తత్పరుడ వైన ప్రభూ వందనం. మహా గొప్ప ఆదిశేషునే తల్పంగా శయనించే పరాత్పర ప్రణామం.
        దండంబు = నమస్కారము; యోగీంద్ర మండల నుతునకు - యోగి = యోగులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; మండల = సమూహములచే; నుతున్ = స్తుతింప బడెడివాని; కున్ = కి; దండంబు = నమస్కారము; శార్ఙ్ఘ = శార్ఙ్ఘము అనెడి; కోదండు నకును - కోదండున్ = విల్లుగలవాని; కును = కి; దండంబు = నమస్కారము; మండిత కుండల ద్వయునకు - మండిత = అలంకరింప బడిన; కుండల = చెవి కుండలముల; ద్వయున్ = జంట గలవాని; కు = కి; దండంబు = నమస్కారము; నిష్ఠుర భండనునకు - నిష్ఠుర = అతికఠినమైన; భండనున్ = యుద్దము చేయువాని; కు = కి; దండంబు = నమస్కారము; మత్త వేదండ రక్షకునకు - మత్తవేదండ = గజేంద్రమును; రక్షకున్ = కాపాడినవాని; కున్ = కి; దండంబు = నమస్కారము; రాక్షస ఖండనునకు - రాక్షస = రాక్షసులను; ఖండనున్ = సంహరించినవాని; కు = కి; దండంబు = నమస్కారము; పూర్ణేందు మండల ముఖునకు - పూర్ణ = నిండు; ఇందు = చంద్ర; మండల = మండలము వంటి; ముఖున్ = ముఖము గలవాని; కు = కి; దండంబు = నమస్కారము; తేజః ప్రచండునకును - తేజస్ = తేజస్సు; ప్రచండున్ = అతితీవ్రమైనదిగలవాని; కున్ = కి;
        దండ మద్భుత - దండము = నమస్కారము; అద్భుత = అద్భుతమైన; పుణ్య ప్రధానునకును - పుణ్య = పుణ్యములను; ప్రధానున్ = ఇచ్చెడివాని; కును = కి; దండ ముత్తమ - దండము = నమస్కారము; ఉత్తమ = శ్రేష్ఠమైన; వైకుంఠ ధాము నకును - వైకుంఠ = వైకంఠము; ధామున్ = నివాసముగా గలవాని; కును = కి; దండ మాశ్రిత రక్షణ - దండము = నమస్కారము; ఆశ్రిత = ఆశ్రయించినవారిని; రక్షణ = కాపాడుటయందు; తత్పరునకు - తత్పరున్ = లగ్న మగువాని; కు = కి; దండ మురు భోగినాయక - దండము = నమస్కారము; ఉరు = పెద్ద; భోగినాయక = ఆది శేషుని {భోగి నాయకుడు - భోగి (సర్పము) లకు నాయకుడు, శేషుడు}; తల్పునకును - తల్పున్ = పాన్పుగా గలవాని; కును = కి;

No comments: