Tuesday, August 13, 2013

తెలుగు భాగవత తేనె సోనలు_24



నానానేకపయూథముల్ 

8-72-శా.
            నానానేకపయూథముల్ వనములోనం బెద్దకాలంబు స
            న్మానింపన్ దశలక్షకోటి కరిణీనాథుండనై యుండి మ
            ద్ధానాంభః పరిపుష్ట చందన లతాంచ్ఛాయ లం దుండ లే
            కీ నీ రాశ ని టేల వచ్చితి? భయం బెట్లో కదే యీశ్వరా!
                అడవిలో చాలాకాలంగా ఎన్నో ఏనుగు గుంపుల గౌరవాన్ని పొందు తున్నా. పదిలక్షలకోట్ల ఆడ ఏనుగులకు అధినాథుడనుగా ఉన్నాను. నా దాన జల ధారలతో పెరిగినట్టి మంచిగంధం చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా ఇలా నీళ్ళమీది ఆశతో ఇక్కడికి అనవసరంగా వచ్చాను. భగవంతుడా! బాగా భయం వేస్తోందయ్యా. ఏమైపోతుందో ఏమిటో?  
         నానానేకపయూథముల్ - నానా = అనేకమైన; అనేకప = ఏనుగుల {అనేకపము = ఒకటి కంటె ఎక్కువవాటితో (తొండము, నోరు) తాగునది, ఏనుగు}; యూథముల్ = సమూహములు; వనములోనం బెద్ దకాలంబు - వనము = అడవి; లోనన్ = అందు; పెద్ద = చాలా; కాలంబు = కాలము; సన్మానింపన్ = గౌరవించుండగ; దశలక్షకోటి కరిణీ నాథుండ నై - దశలక్షకోటి = పదిలక్షలకోట్ల; కరిణీ = ఆడ యేనుగులకు; నాథుండను = పతిని; = అయ్యి; యుండి - ఉండి = ఉండి; మ ద్ధా నాంభః - మత్ = నాయొక్క; దానా = మద; అంభస్ = జలముచే; పరిపుష్ట చందన లతాంత చ్ఛాయ లం దుండ - పరిపుష్ట = చక్కగాపెరిగిన; చందన = గంధపు; లతాంత = తీవలందలి; ఛాయలన్ = నీడల; అందున్ = లో; ఉండన్ = ఉండ; లే కీ - లేక = లేకపోయి; = ; నీ రాశ ని టేల - నీర = నీటిపైని; ఆశన్ = ఆశతో; ఇటు = ఈవైపునకు; ఏల = ఎందుకు; వచ్చితి - వచ్చితిన్ = వచ్చితిని; భయం బెట్లో కదే - భయంబు = భయమేస్తోంది; ఎట్లో = ఏలాగో; కదే = కదా; యీశ్వరా - ఈశ్వరా = భగవంతుడా.

తెలుగుభాగవతం.కం  http://www.telugubhagavatam.com/   
|| ఓం నమో భగవతే వాసుదేవాయః || 

No comments: