Thursday, April 24, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 269

లేమా

10.2-172-క.

లేమా! దనుజుల గెలువఁగ
లేమా? నీ వేల కడఁగి లేచితి? విటు రా
లే మాను మాన వేనిన్
లే మా విల్లందికొనుము లీలం గేలన్.
          ఓ లేత వయసు చినదానా! సత్యభామా! మేము రాక్షసులను గెలవ లేమా ఏమి? నీ వెందుకు యుద్ధానికి సిద్ధపడుతున్నావు? ఇటురా. యుద్ధప్రయత్నం మానెయ్యి. మానకపోతే పోనీలే ఇదిగో ఈ విల్లు విలాసంగా అందుకో.
నరకాసుర వధ ఘట్టంలో శ్రీ కృష్ణుడు సత్యభామతో పలికిన పలుకులివి. పద్యం నడక, లేమా అనే పదంతో వేసిన యమకాలంకారం అమోఘం. చమత్కార భాషణతో చేసిన యిద్దరి వ్యక్తిత్వాల పోషణ ఎంతో బావుంది. ఒకే హల్లు మరల మరల వేస్తే వృత్యనుప్రాస, రెండు అంతకన్న ఎక్కువ హల్లులు అర్థబేధంతో అవ్యవధానంగా వేస్తే  ఛేక. శబ్ద బేధం లేకుండా అర్థ బేధంతో మరల మరల వేస్తే యమకం. అవ్యవధానంగా రెండు అంత కన్నా ఎక్కువ హల్లులు అర్థబేధం శబ్దబేధం లేకుండా తాత్పర్య బేధంతో వేస్తే లాట.
10.2-172-ka.
laemaa! danujula geluva@Mga
laemaa? nee vaela kaDa@Mgi laechiti? viTu raa
lae maanu maana vaenin
lae maa villaMdikonumu leelaM gaelan.
          లేమా = చిన్నదానా {లేమ – లేత వయస్కురాలు, స్త్రీ}; దనుజులన్ = రాక్షసులను; గెలువగ = జయింప; లేమా = సమర్థులము కామా; నీవు = నీవు; ఏల = ఎందుకు; కడగి = యత్నించి; లేచితివి = నిలబడితివి; ఇటు = ఈ వైపునకు; రా = రమ్ము; లే = లెమ్ము; మాను = వదలివేయుము; మానవు = మానని; ఏనిన్ = పక్షమున; లే = లెమ్ము; మా = మా యొక్క; విల్లున్ = ధనుస్సు; అందికొనుము = పుచ్చుకొనుము; లీలన్ = విలాసముగా; కేలన్ = చేతితో.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Wednesday, April 23, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 268

లోపలి సౌధంబులోన

10.1-1709-సీ.

లోపలి సౌధంబులోన వర్తింపఁగాఁ
 దేవచ్చునే నిన్నుఁ దెత్తునేని
గావలివారలఁ ల బంధువులఁ జంపి
 కాని తేరా దని మలనయన!
భావించెదేని యుపాయంబు చెప్పెద
 నాలింపు కులదేవయాత్రఁ జేసి
గరంబు వెలువడి గజాతకును మ్రొక్కఁ
 బెండ్లికి మునుపడఁ బెండ్లికూఁతుఁ
తే.
నెలమి మావారు పంపుదు రేను నట్లు
పురము వెలువడి యేతెంచి భూతనాథు
తికి మ్రొక్కంగ నీవు నా మయమందు
వచ్చి గొనిపొమ్ము నన్ను నవార్యచరిత!
          ఓ కమలాల వంటి కన్నులున్న కన్నయ్యా! నీవు కన్యాంతఃపురంలో ఉంటావు కదా, రుక్మిణీ ! నిన్నెలా తీసుకుపోవాలి. అలా తీసుకెళ్ళాలంటే కాపలావాళ్ళను, అప్పు డక్కడ యున్న బంధుజనాలను చంపాల్సివస్తుంది కదా అని నీవు అనుకుంటే, దీనికి యొక యుపాయం మనవి చేస్తాను. చిత్తగించు. పెళ్ళికి ముందు మా వారు పెళ్ళికూతురును  మా యిలవేల్పు మంగళగౌరిని మొక్కడానికి పంపిస్తారు. నేనుకూడ అలాగే అంతఃపురం వెలువడి మొక్కుచెల్లించడానికి ఊరి వెలుపల యున్న దుర్గగుడికి బయలుదేరి వస్తాను. అడ్డగింపరాని నడవడిక కలవాడా! కృష్ణా! ఆ సమయానికి వచ్చి నన్ను నిరాటంకంగా తీసుకొనిపో!
10.1-1709-see.
lOpali saudhaMbulOna vartiMpaMgaa@M
 daevachchunae ninnu@M dettunaeni
gaavalivaarala@M gala baMdhuvula@M jaMpi
 kaani taeraa dani kamalanayana!
bhaaviMchedaeni yupaayaMbu cheppeda
 naaliMpu kuladaevayaatra@M jaesi
nagaraMbu veluvaDi nagajaatakunu mrokka@M
 beMDliki munupaDa@M beMDlikoo@Mtu@M
tae.
nelami maavaaru paMpudu raenu naTlu
puramu veluvaDi yaeteMchi bhootanaathu
satiki mrokkaMga neevu naa samayamaMdu
vachchi gonipommu nannu navaaryacharita!
          లోపలి = లోపలికి ఉన్న; సౌధంబు = అంతఃపురము; లోనన్ = అందు; వర్తింపంగా = తిరుగుచుండగా; తేవచ్చునే = తీసుకురాగలమా; నిన్నున్ = నిన్ను; తెత్తునేని = తీసుకొచ్చినను; కావలివారలన్ = కాపలాదారులను; కల = అక్కడున్న; బంధువులన్ = చుట్టములను; చంపి = సంహరించి; కాని = కాని; తేరాదు = తీసుకురాలేము; అని = అని; కమలనయన = పద్మాక్షుడా, కృష్ణా; భావించెదేని = తలచెడి పక్షమున; ఉపాయంబు = సుళువు మార్గమును; చెప్పెదన్ = తెలిపెదను; ఆలింపు = వినుము; కులదేవ = ఇలవేల్పుని కొలుచుట కైన; యాత్ర = ప్రయాణము; చేసి = అయ్యి; నగరంబు = అంతఃపురము; వెలువడి = బయలుదేరి; నగజాత = పార్వతీదేవి; కును = కి; మ్రొక్కన్ = పూజించుటకు; పెండ్లి = వివాహమున; కిన్ = కు; మునుపడన్ = ముందుగా; పెండ్లికూతున్ = పెళ్ళికూతురును; ఎలమి = ప్రీతితో; మావారు = మావాళ్ళు; పంపుదురు = పంపించెదరు; ఏనున్ = నేనుకూడ; అట్లు = ఆ విధముగనే; పురము = అంతఃపురము; వెలువడి = బయలుదేరి; ఏతెంచి = వచ్చి; భూతనాథుసతి = పార్వతీదేవి {భూతనాథుసతి - భూతనాథు (శివు)ని సతి, పార్వతి}; కిన్ = కి; మ్రొక్కగన్ = పూజించుచుండగా; నీవున్ = నీవు; = ఆ యొక్క; సమయము = సమయము; అందున్ = అందు; వచ్చి = చేరవచ్చి; కొనిపొమ్ము = తీసుకెళ్ళుము; నన్నున్ = నన్ను; అవార్యచరిత = అడ్డగింపరాని వర్తన గల వాడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~

Tuesday, April 22, 2014

తెలుగు భాగవత తేనె సోనలు – 267

నీలోనలేని

10.1-1241-క.

నీలోన లేని చోద్యము
లే లోకములందుఁ జెప్ప రీశ్వర! నీటన్
నేలన్ నింగిని దిక్కుల
నీలో చోద్యంబు లెల్ల నెగడు మహాత్మా!
          సమస్తమైన వింతలు నీలోనే ఉన్నాయి కదా మహానుభావ! నీలో లేని వింతలు నీళ్ళల్లో కాని, నేలమీద కాని, ఎక్కడికి వెళ్ళినా ఏ లోకంలోను ఉన్నట్లు పెద్ద లెవరు చెప్పలేదు స్వామి.
కృష్ణ బలరాములను ద్వారకకు తీసుకెళ్తున్న అక్రూరునికి దివ్యదర్శనాలు అనుగ్రహించిన వాసుదేవుడు ఏం వింతలు చూసావని అడిగాడు. సర్వము నీవుగా నుండగా, ఇంక వేరే నీలో లేని వింతలు ఏముంటాయి మహాత్మా! యని మనవి చేస్తున్నాడు అక్రూరుడు.
10.1-1241-ka.
neelOna laeni chOdyamu
lae lOkamulaMdu@M jeppa reeSvara! neeTan
naelan niMgini dikkula
neelO chOdyaMbu lella negaDu mahaatmaa!
          నీ = నీ; లోనన్ = అందు; లేని = లేనట్టి; చోద్యములు = వింతలు; = ఏ ఒక్క; లోకములు = లోకము {త్రిలోకములు - 1స్వర్గ 2మర్త్య 3పాతాళ లోకములు}; అందున్ = లోను; చెప్పరు = ఉన్నవని వినబడ లేదు; నీటన్ = నీటిలోను; నేలన్ = నేలమీద; నింగినిన్ = ఆకాశము నందు; దిక్కులన్ = నలుదిక్కు లందు {నలుదిక్కులు - 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము}; నీ = నీ; లోన్ = అందు; చోద్యంబులు = వింతలు; ఎల్లన్ = అన్నియు; నెగడు = వర్ధిల్లును; మహాత్మా = గొప్పవాడా.
~~~|సర్వేజనాః సుఖినోభవంతు|~~~